లీగల్ డ్రామాగా రూపొందిన కన్నడ సినిమానే 'యుద్ధకాండ - చాప్టర్ 2'. అజయ్ రావు .. ప్రకాశ్ బెలవాడి .. అర్చన జోస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, పవన్ భట్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ లీగల్ డ్రామా ఏ అంశం చుట్టూ తిరిగిందనేది చూద్దాం.
కథ: భరత్ (అజయ్ రావు) ఓ అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన, ఒక హోటల్లో పనిచేస్తూనే ఎదుగుతాడు. కష్టపడి చదువుతూ 'లా' పూర్తి చేస్తాడు. నీతి .. నిజాయితీ .. ఇతరుల పట్ల సానుభూతి కలిగిన భరత్, ఒక పేరున్న సీనియర్ లాయర్ దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. అనుభవం కోసం జీతం లేకుండానే పనిచేస్తూ ఉంటాడు. అక్కడే అతనికి 'స్వప్న' పరిచయం అవుతుంది. ఆమె పరిచయం అతనిలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.
ఒక రోజున భరత్ ఒక కేసు విషయంగా కోర్టుకు వెళతాడు. ఆ కోర్టు ఆవరణలో ఎమ్మెల్యే జగన్నాథ్ తమ్ముడు జనార్దన్ ను నివేదిత ( అర్చన జోస్) షూట్ చేస్తుంది. జనార్థన్ అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో పోలీసులు నివేదితను అదుపులోకి తీసుకుంటారు. ఆమెకి కఠిన శిక్ష పడేలా చేయాలని ఎమ్మెల్యే జగన్నాథ్ నిర్ణయించుకుంటాడు. ఈ విషయంపై క్రిమినల్ లాయర్ రాబర్ట్ ను కలుస్తాడు. ఆయన నుంచి కోట్లలో ఫీజు వసూలు చేసిన రాబర్ట్, రంగంలోకి దిగుతాడు.
ఈ నేపథ్యంలోనే నివేదితను భరత్ కలుసుకుంటాడు. ఎందుకు ఆమె జనార్థన్ ను షూట్ చేయవలసి వచ్చిందో చెబితే, సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటాడు. అప్పుడు నివేదిత ఏం చెబుతుంది? ఆమె విషయంలో జనార్థన్ చేసినదేమిటి? అది తెలుసుకున్న భరత్ ఏం చేస్తాడు? నివేదిత దోషిగా తేలుతుందా? నిర్దోషిగా బయటపడుతుందా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఇది లీగల్ డ్రామా. ఒక క్రిమినల్ కేసు విషయంలో సీనియర్ లాయర్ కీ .. జూనియర్ లాయర్ కి మధ్య జరిగే పోరాటం ఇది. ఫస్టాఫ్ లో కథ కోర్టు దిశగా అడుగులు వేస్తుంది. సెకండాఫ్ అంతా కూడా కోర్టులోనే నడుస్తుంది. వాద ప్రతివాదనలే ప్రధానంగా ఈ కథ కొనసాగుతుంది. ఎత్తులు పైఎత్తులతో ఈ కోర్టు రూమ్ డ్రామా ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటుంది.
దర్శకుడు ఎంచుకున్న ఈ కథలో మగదిక్కులేని తల్లీబిడ్డలు .. అధికారం చేతిలో ఉందని అహంభావంతో ప్రవర్తించే అన్నదమ్ములు .. కోట్లలో ఫీజు వసూలు చేసే సీనియర్ లాయర్ .. కొత్తగా కోర్టు ఆవరణలో అడుగుపెట్టిన ఒక మానవత్వమున్న లాయర్ .. ప్రధానమైన పాత్రలుగా కనిపిస్తాయి. ఈ ఆరు పాత్రలను కలుపుకుంటూ సహజత్వంతో దర్శకుడు ఆవిష్కరించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
డబ్బుకి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే ప్రస్తుత సమాజంలో, నిజాన్ని .. ఇది నిజమని నిరూపించడమే అసాధ్యమైన విషయంగా మారిపోయింది. నిజాలు అమ్ముడుపోతున్నాయి .. కొత్త అబద్ధాలు పుట్టుకొస్తున్నాయి. సత్యం గెలుస్తుంది .. ధర్మం నిలుస్తుంది అని నమ్మి, నిజాయితీగా పోరాడిన ఒక లాయర్ కథగా ఇది మెప్పిస్తుంది. న్యాయం జరిగేలా చూసే విషయంలో అవుతున్న ఆలస్యమే మరికొన్ని నేరాలు జరగడానికి కారణం అవుతుందనే సందేశాన్ని అందించిన తీరు బాగుంది.
పనితీరు: నిజానికి నిన్నమొన్నటి వరకూ కోర్టు రూమ్ డ్రామాలు చూడటానికి ఆడియన్స్ ఆలోచించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందనే అనుకోవాలి. అందుకు కారణం ఇలాంటి సినిమాలనే చెప్పుకోవాలి. దర్శకుడు ఆయా పాత్రలను మలచిన తీరు .. వాటిని నడిపించిన విధానం .. వాదనలు .. ఆధారాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
కార్తీక్ శర్మ ఫొటోగ్రఫీతో పాటు నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకు బలమైన సపోర్టుగా నిలిచాయి. కోర్టు రూమ్ డ్రామాలకు సంభాషణలు ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. అలాంటి సంభాషణలతో క్లైమాక్స్ దృశ్యాలను రక్తి కట్టించారు. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు .. సంభాషణలు లేని ఈ ఈ సినిమా, ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి లీగల్ డ్రామాగా చెప్పుకోవచ్చు.
ముగింపు: సమాజంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లల విషయంలో పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను చెబుతూనే, అన్యాయం జరిగినవారికి సత్వరమే న్యాయం జరగాలని సూచించిన సినిమా ఇది. న్యాయం జరగడంలో అవుతున్న ఆలస్యం మరిన్ని నేరాలకు కారణమవుతుందంటూ ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది.
'యుద్ధకాండ - చాప్టర్ 2' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Yuddhakaanda Chapter 2 Review
- కన్నడలో రూపొందిన లీగల్ డ్రామా
- తల్లీకూతుళ్ల ఎమోషన్స్ ప్రధానం
- ఆకట్టుకునే కథాకథనాలు
- ఆసక్తికరంగా సాగే కోర్టు రూమ్ సీన్స్
- ఆలోచింపజేసే సందేశం
Movie Name: Yuddhakaanda Chapter 2
Release Date: 2025-06-20
Cast: Ajay Rao, Prakash Belawadi, Archana Jois, Radhanya Rakesh, Supritha
Director: Pavan Bhat
Music: -
Banner: Ajay Rao Productions
Review By: Peddinti
Yuddhakaanda Chapter 2 Rating: 2.50 out of 5
Trailer