'విరాటపాలెం - పీసీ మీనా రిపోర్టింగ్' జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఈ రోజునే వచ్చింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్ 7 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్ కి పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. అభిజ్ఞ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అది 'ఒంగోలు' పరిధిలోని 'విరాటపాలెం' అనే గ్రామం. ఆ గ్రామ ప్రజలకు సర్పంచ్ (రామరాజు) పట్ల పూర్తి విశ్వాసం ఉంటుంది.  ఆయనకి ఒక కొడుకు .. భ్రమరాంబ (లావణ్య) అనే కూతురు ఉంటారు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఆమె, మెడపై గదిలో నుంచి బయటికి రావడానికి ఎంత మాత్రం ఇష్టపడదు. ఒక అదే గ్రామంలో రాజకీయంగా మంచి పలుకుబడి కలిగిన నరసయ్య, 'టింబర్ డిపో'ను నడుపుతుంటాడు. సర్పంచ్ కంటే అతనికే అక్కడివారు భయపడుతూ ఉంటారు. 

ఆ గ్రామంలో పదేళ్లుగా ఎవరికీ పెళ్లిళ్లు జరగవు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నవారు ఆ ఊరు విడిచి వెళ్లిపోతుంటారు. ఎందుకంటే ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి కూతురు రక్తం కక్కుకుని చనిపోతూ ఉంటుంది. అది తమ గ్రామానికి ఒక శాపం కావొచ్చని అంతా నమ్ముతూ ఉంటారు. అందువల్లనే ఆ ఊళ్లో పెళ్లి అనే ఆలోచన చేయరు. అలాంటి పరిస్థితుల్లో తన తల్లి విజయమ్మతో కలిసి మీనా (అభిజ్ఞ) ఆ విలేజ్ కి చేరుకుంటుంది. కానిస్టేబుల్ గా బదిలీపై ఆమె అక్కడికి వస్తుంది.

కానిస్టేబుల్ గా ఛార్జ్ తీసుకున్న తరువాత, అక్కడి విషయాలు ఆమెకి అర్థమవుతాయి. తన కళ్లముందే జరిగిన 'మల్లి' చావు, మీనాను ఆలోచింపజేస్తుంది. వరుసగా జరుగుతున్న మరణాలను హత్యలుగా ఆమె అనుమానిస్తుంది. హంతకులు ఎవరనేది తెలుసుకోవడం కోసం, ఆ ఊళ్లో టీ కొట్టు నడుపుతున్న కిట్టూ సాయం తీసుకుంటుంది. ఆమె ఆన్వేషణలో ఎలాంటి నిజాలు బయటపడతాయి? ఆ ప్రయత్నంలో ఆమెకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ. 

విశ్లేషణ:1980ల కాలంలో నడిచే కథ ఇది. 'విరాటపాలెం' అనే గ్రామంలో జరుగుతున్న అనుమానాస్పద మరణాలు .. ఆ మరణాల వెనకున్న అసలు నిజాలు తెలుసుకోవడానికి కానిస్టేబుల్ మీనా చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సిరీస్, ఆడియన్స్ లో అదే కుతూహలాన్ని చివరివరకూ కొనసాగించేలా చేయగలిగింది. 

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ 7 ఎపిసోడ్స్ లోని కంటెంట్ ఎక్కడ బోర్ అనిపించదు. నెక్స్ట్ ఏం జరుగనుందా? అనే ఒక ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. గ్రామీణ నేపథ్యం .. అక్కడి మనుషులు .. స్వభావాలను ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది.
1980 కాలం నాటి వాతావరణాన్ని చూపించడంలో తీసుకున్న శ్రద్ధ బాగుంది. అయితే విలేజ్ వాతావరణాన్ని సెట్ చేసిన తీరు .. ఆర్ట్ డైరెక్టర్ కి సంబంధించిన అంశాలు కాస్త కృతకంగా అనిపిస్తాయి అంతే.               

ప్రధానమైన పాత్రలను మలచిన తీరు .. ఆయా పాత్రల నేపథ్యం .. వారిని మీనా అనుమానించడానికి గల కారణాలు .. ఇవన్నీ కూడా ఆసక్తికరమైన లింకులను కలుపుతూ వెళుతుంటాయి. 'రమణ' అనే పాత్ర పట్టుబడటం వంటి ఒకటి రెండు సీన్స్ కాస్త సిల్లీగా అనిపిస్తాయి గానీ, మిగతా కంటెంట్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. 

పనితీరు: కథాకథనాలు ఈ సిరీస్ కి ప్రధానమైన బలమని చెప్పాలి. సహజమైన గ్రామీణ వాతావరణాన్ని చూపించడానికి ఫొటోగ్రఫీ తన వంతు ప్రయత్నం చేసింది. నేపథ్య సంగీతం ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిందని చెప్పాలి. ఎడిటింగ్ వర్క్ కూడా నీట్ గా అనిపిస్తుంది. అనవసరమైన సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. నటీనటుల అందరి నటన సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. 

ముగింపు: అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ఈ మధ్య కాలంలో విలేజ్ నేపథ్యంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ సిరీస్ లలో ఒకటిగా దీనిని గురించి చెప్పుకోవచ్చు.