యథార్థ సంఘటనల ఆధారంగా కొన్ని సినిమాలు రూపొందుతూ ఉంటాయి. అవి ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ఒక సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిందే '23'. రాజ్ రాచకొండ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో, తేజ - తన్మయి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ ఏడాది మే 16వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 27వ తేదీ నుంచి మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.  

కథ: ఈ కథ ..  1991లో చుండూరులో జరిగిన  మారణకాండ, 1993లో జరిగిన చిలకలూరి పేట బస్సు దహనం .. 1997లో జరిగిన జూబిలీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ వంటి మూడు యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని నడుస్తుంది. 1993లో జరిగిన సంఘటనను ప్రధానంగా చేసుకుని ఈ కథ కొనసాగుతుంది. 

అది ఒక విలేజ్ .. ఆ విలేజ్ లో సాగర్ .. సుశీల ప్రేమించుకుంటూ ఉంటారు. ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని కాస్త స్థిరపడిన తరువాత ఆమెను పెళ్లి చేసుకోవాలని సాగర్ అనుకుంటాడు. కానీ ఈ లోగానే సుశీల నెల తప్పుతుంది. అందువలన మొదలయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి కొంత డబ్బు అవసరమని సాగర్ భావిస్తాడు. ఆ డబ్బు కోసం స్నేహితుడైన 'దాసు'తో కలిసి ఒక బస్సు దోపిడీకి పాల్పడతాడు. అయితే ఆ ఫ్లాన్ బెడిసి కొట్టడంతో బస్సు తగలబడిపోతుంది.      
 
జరిగిన దానికి సాగర్ చాలా బాధపడతాడు. దాసుతో పాటు అతను జైలుకెళతాడు. అతనితో పాటు అందమైన జీవితాన్ని ఊహించుకున్న సుశీల నివ్వెరపోతుంది. కోర్టు సాగర్ కి ఉరిశిక్షను విధిస్తుంది. గర్భవతిగా ఉన్న సుశీల పరిస్థితి ఏమిటి? సాగర్ ను కాపాడుకోవడానికి ఆమె  ఏం చేస్తుంది? ఆమె ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: యథార్థ సంఘటనల ఆధారంగా కొన్ని సినిమాలను నిర్మించినప్పుడు, వాటికి కమర్షియల్ అంశాలను అద్దడానికి మేకర్స్ ప్రయత్నిస్తారు. మరికొందరు ఉన్న విషయాన్ని సహజత్వంతో చెప్పటానికి ట్రై చేస్తారు. ఆ రెండో కోవకి చెందిన సినిమాగా ఇది కనిపిస్తుంది. అక్కడక్కడా ఎమోషన్స్ ను టచ్ చేస్తూ ఈ కథ కొనసాగుతుంది. 

డబ్బు .. పరపతి .. అధికారం వలన కొంతమంది నేరస్థులు తప్పించుకుంటున్నారు. వారి కారణంగా కొంతమంది అమాయకులు బలవుతున్నారు .. జైళ్లలో మగ్గిపోతున్నారు. పుస్తకాలు చదవడం .. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం వలన ఎవరికి వారు తమ చుట్టూ ఉన్న చీకటి నుంచి బయటపడొచ్చనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది.           

 దర్శకుడు ఈ కథలో మూడు ప్రధానమైన సంఘటలను చెప్పడానికి ప్రయత్నించాడు. అలా కాకుండా ప్రధానమైన సంఘటనను మాత్రమే తీసుకుని, వినోదపరమైన అంశాలను కూడా జోడిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా రెండు సంఘటనల విషయంలో అంత డీప్ గా వెళ్లలేదు. ఆ ట్రాకులు ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కూడా కాలేదు. 

పనితీరు: దర్శకుడు ఈ కథపై ఇంకాస్త కసరత్తు చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాలలో ఆడియన్స్ కి క్లారిటీ రాదు. తేజ .. తన్మయి .. తమ పాత్రలకు న్యాయం చేశారు. సన్నీ కూరపాటి ఫొటోగ్రఫీ .. మార్క్ కె రాబిన్ సంగీతం .. అనిల్ ఆలయం ఎడిటింగ్ ఫరావాలేదు.

ముగింపు: దర్శకుడు ఎంచుకున్న సమస్యలకు .. సంఘటనలకు ఇంకా కాస్త క్లారిటీ అవసరం అనిపిస్తుంది. అలాగే ఒక సినిమా వైపు నుంచి ఆడియన్స్ ఆశించే వినోదపరమైన అంశాలను గురించి కూడా పట్టించుకోకపోవడం ఒక వెలితిగా కనిపిస్తుంది.