ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ కామెడీ మూవీనే 'హెడ్స్ ఆఫ్ స్టేట్'. జాన్ సెన్ .. ఇద్రీస్ ఎల్బా తో కలిసి ప్రియాంక నటించిన ఈ సినిమాకి, ఇలియా నైషుల్లెర్ దర్శకత్వం వహించాడు. గతంలో 'నోబడీ' .. 'హార్డ్ కోర్ హేన్రి' అనే యాక్షన్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ఆ తరువాత సినిమా అయిన 'హెడ్స్ ఆఫ్ స్టేట్', 6 భాషలలో అమెజాన్ ప్రైమ్ లో నేరుగా ఈ రోజునే విడుదలైంది.
కథ: అమెరికా అధ్యక్షుడు విల్ డెరింజర్ (జాన్ సెన్) బ్రిటీష్ ప్రధాని సామ్ క్లార్క్ (ఇద్రిస్ ఎల్బా) ఒక సమావేశంలో పాల్గొంటారు. డెరింజర్ ముందుగా యాక్షన్ సినిమాల హీరోగా రాణించి, ఆ క్రేజ్ తో అమెరికా అధ్యక్ష పీఠం వరకూ వస్తాడు. క్లార్క్ మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కుంటూ బ్రిటిష్ ప్రధాని స్థానానికి చేరుకుంటాడు. ఇద్దరి అభిప్రాయాలు .. ఆలోచనా విధానాలు వేరుగా ఉంటాయి. అదే విషయం ఆ సమావేశంలో బయటపడుతుంది.
అయితే తమ దేశాల మధ్య సఖ్యత అవసరమని భావించిన ఇద్దరూ, తాము చాలా సన్నిహితంగా ఉన్నామని మీడియాను .. ప్రజలను నమ్మించాలని భావిస్తారు. అందుకోసం ఒకే విమానంలో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకుంటారు. అమెరికా అధ్యక్షుడి విమానంలోనే బ్రిటీష్ ప్రధాని కూడా బయలుదేరతాడు. అయితే తమ ఇద్దరినీ చంపడం కోసం శత్రువులు ఆల్రెడీ ప్లాన్ చేశారనే విషయాన్ని గమనించలేకపోతారు.
విమానం కొంతదూరం ప్రయాణించే సరికి, దాడి మొదలవుతుంది. ఆ దాడిలో విమానం దెబ్బతింటుంది. విమానం కూలిపోతుందని గ్రహించిన ఇద్దరు నాయకులు కూడా ప్యారాచూట్ ల సాయంతో దూకేస్తారు. అలా దూకినవారు 'బెలారూస్' ఫారెస్టు ఏరియాలో పడతారు. అక్కడి నుంచి బయటపడటానికి వాళ్లు ఏం చేస్తారు? వాళ్లను సురక్షిత ప్రాంతానికి చేర్చడం కోసం MI-6 ఏజెంట్ నోయెల్ (ప్రియాంక చోప్రా) ఏం చేస్తుంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: అగ్రదేశాలకు చెందిన ఇద్దరు అధినేతలు, అనుకోకుండా ఒక ప్రమాదంలో చిక్కుకుంటారు. అప్పటివరకూ ఒకరి విధానాలను ఒకరు విమర్శించుకుంటూ వచ్చిన వారు, ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఒకరికొకరు సహకరించుకోవలసిందే. ఆ పరిస్థితులలో వాళ్లు ఏం చేస్తారు? అనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.
ఎప్పుడూ కూడా సాధారణ వ్యక్తుల మధ్య కామెడీ వర్కౌట్ అవుతుంది. హుందాతనంతో నిండిన పాత్రల మధ్య కామెడీ పెద్దగా వర్కౌట్ కాదు. కానీ ఒక దేశానికి అధ్యక్షుడు .. మరో దేశ ప్రధాని మధ్య దర్శకుడు సున్నితమైన హాస్యాన్ని వర్కౌట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఒక వైపున కామెడీ టచ్ తో కథ నడుస్తూనే, మరో వైపున ఏం జరుగనుందా? అనే ఒక ఉత్కంఠ నెలకొంటుంది.
కథను నాన్చడానికీ .. సన్నివేశాలను సాగదీయడానికి దర్శకుడు ఎక్కడా ప్రయత్నించలేదు. యాక్షన్ కామెడీ జోనర్ కి న్యాయం చేసే కంటెంట్ నే అందించాడని చెప్పాలి. కథను ఎప్పటికప్పుడు ఒక చోటు నుంచి మరో చోటికి షిఫ్ట్ చేస్తూ, అనూహ్యమైన మలుపులను స్క్రీన్ పైకి తీసుకుని వచ్చాడు. మెరుపు వేగంతో కూడిన యాక్షన్ సీన్స్ థ్రిల్ చేస్తాయి.
పనితీరు: కథ .. స్క్రీన్ ప్లే .. టేకింగ్ బాగున్నాయి. నటీనటుల నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. సినిమా గ్రాఫ్ ను పెంచడంలో ఈ రెండూ బలమైన పాత్రను పోషించాయి. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. సాధారణంగా ఇలాంటి సినిమాలు తెలుగులోకి అనువదించినప్పుడు, వాక్య నిర్మాణం కుదరక సంభాషణలు ఇబ్బందిపెడుతూ ఉంటాయి. అలాంటి అసహనం మనకి ఈ సినిమా విషయంలో కలగదు.
ముగింపు: భారీ యాక్షన్ దృశ్యాలతో .. సున్నితమైన కామెడీతో కూడిన ఈ కంటెంట్ ప్రేక్షకులకు నచ్చుతుంది. ఎక్కడ అభ్యంతరకరమైన సన్నివేశాలు .. సంభాషణలు లేని ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
'హెడ్స్ ఆఫ్ స్టేట్ ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Heads Of State Review
- నేరుగా ఓటీటీకి వచ్చిన 'హెడ్స్ ఆఫ్ స్టేట్ '
- ఆసక్తికరమైన కథాకథనాలు
- ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు
- ఫ్యామిలీతో చూడదగిన కంటెంట్
Movie Name: Heads Of State
Release Date: 2025-07-02
Cast: John Cena, Idris Elba, Priyanka Chopra, Jack Quaid, Paddy Comsidine
Director: Ilya Naishuller
Music: Stevin Price
Banner: Metro - Goldwyn- Mayer
Review By: Peddinti
Heads Of State Rating: 3.00 out of 5
Trailer