పేరెంట్స్ .. పిల్లలు .. చదువులు .. ఈ మూడూ కూడా ఎంతసేపు చర్చించినా తేలని అంశాలు. ఇక ఇంటర్ అనేది ప్రతి విద్యార్థి విషయంలోను చాలా కీలకమైన విషయంగా కనిపిస్తుంది. అలాంటి ఇంటర్ విద్యార్థుల చుట్టూ తిరిగే కథతో పలకరించిన వెబ్ సిరీస్ 'AIR'. 7 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూద్దాం.
కథ: 2012లో మొదలయ్యే కథ ఇది. అర్జున్ (హర్ష్ రోషన్) రాజు (జయతీర్థ) ఇమ్రాన్ (భానుప్రకాశ్) వేరు వేరు స్కూల్స్ లో 10th పూర్తి చేస్తారు. అప్పటికే జయశ్రీ (అక్షర) పట్ల ఆకర్షితుడైన అర్జున్, ఆమె 'విజయవాడ'లోని AIR (ఆల్ ఇండియా ర్యాంకర్స్) జూనియర్ కాలేజ్ లో చేరుతుందని తెలిసి, తాను కూడా అందులోనే చేరతాడు. జయశ్రీ ఆ కాలేజ్ లో చేరడం లేదని తెలిసి, ఆ కాలేజ్ లో నుంచి బయటపడాలని నిర్ణయించుకుంటాడు. అక్కడే అతనికి రాజు - ఇమ్రాన్ పరిచయమవుతారు.
ఇమ్రాన్ ఫ్రీ సీట్ కారణంగా అక్కడ చేరతాడు కానీ, హాస్టల్ ఫీజ్ కట్టుకోవడం అతనికి భారంగా మారుతుంది. అయితే మారుమూల పల్లెలో పెరిగిన అతనికి హాస్టల్ వాతావరణం సరిపడదు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని అతను భావిస్తాడు. ఇక స్కూల్ ఎగ్గొట్టి తిరిగే రాజుకి, హాస్టల్ అనేది ఒక పంజరంగా అనిపిస్తుంది. దాంతో సాధ్యమైనంత త్వరగా కాలేజ్ లో నుంచి బయటపడాలనే ఆలోచనలోనే అతను ఉంటాడు.
ముగ్గురి లక్ష్యం ఒక్కటి కావడం వల్లనే వాళ్లు ఫ్రెండ్స్ అవుతారు. మేనేజ్ మెంట్ తమని కాలేజ్ లో నుంచి పంపించేలా చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఎలాంటి ప్లాన్స్ వేస్తారు. ఆ ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? తమ పిల్లలు మంచి ర్యాంకులు కొట్టాలనుకున్న వారి పేరెంట్స్ కల ఫలిస్తుందా? జయశ్రీతో పాటు కలిసి చదువుకోవాలనే అర్జున్ కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలని అనుకుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, పిల్లలను విడిచి ఉండలేకపోయినా పెద్ద కాలేజ్ లలో చేర్పిస్తారు. ఆ కాలేజ్ వాళ్లు సెక్షన్స్ చేసి, తమ కాలేజ్ కి ర్యాంకులు తెచ్చిపెట్టేవారిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యలోనే పిల్లలు బలిపశువులవుతుంటారు. ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని రూపొందినదే ఈ సిరీస్.
ఒక వైపున పేరెంట్స్ .. మరో వైపున కాలేజ్ మేనేజ్ మెంట్ .. ఇంకొక వైపున స్టూడెంట్స్ .. ఈ మూడు వైపుల నుంచి ఈ కథ నడుస్తూ ఉంటుంది. ముందుగా స్టూడెంట్స్ కి .. ఆ తరువాత కాలేజ్ మేనేజ్ మెంట్ కి .. పేరెంట్స్ కి ప్రాధాన్యతనిస్తూ వెళ్లారు. కాలేజ్ క్యాంపస్ ను .. హాస్టల్ వాతావరణాన్ని దర్శకుడు ఆవిష్కరించిన విధానం సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. సరదా సన్నివేశాలతో పాటు ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి.
మొత్తం 7 ఎపిసోడ్స్ లో మొదటి మూడు ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తాయి. 4-5 ఎపిసోడ్స్ కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. 6,7 ఎపిసోడ్స్ నుంచి మళ్లీ కథ దార్లో పడుతుంది. సునీల్ .. చైతన్యరావు .. హర్ష చెముడు వంటి వారిని ప్రత్యేకమైన పాత్రలలో పరిచయం చేసిన తీరు బాగుంది. మొదటి మూడు ఎపిసోడ్స్ లో ఛమక్కు మంటూ మెరిసిన డైలాగ్స్ .. ఆ తరువాత లేకపోవడం కూడా ఒక వెలితిగానే అనిపిస్తుంది.
పనితనం: అక్కడక్కడా కాస్త డల్ అయినప్పటికీ, కథ .. కథనం విషయంలో దర్శకుడు మెప్పించాడు. టీనేజ్ లో పిల్లల మధ్య ఉండే ఆకర్షణకి సంబంధించిన ట్రాక్ వేశాడు గానీ, దానిని సరిగ్గా పట్టించుకోకపోవడం నిరాశను కలిగిస్తుంది. సినిజిత్ నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా అనిపిస్తుంది. మనోజ్ ఫొటోగ్రఫీ బాగుంది. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ ఓకే.
ప్రధానమైన పాత్రలను పోషించిన ముగ్గురు పిల్లలు .. సమీర్ .. జీవన్ .. సందీప్ రాజ్ నటన ఆకట్టుకుంటుంది. 'ఇంటర్ లో సమ్మరే ఉంటుంది .. హాలిడేస్ ఉండవు' .. 'లోకల్ అయినా హాస్టల్లో ఉండాల్సిందే' .. 'ఫీజు తగ్గితే ర్యాంక్ తగ్గుతుంది' .. 'ఫ్రీడమ్ కోసం పంజరాన్ని ఎంచుకోవడమంటే ఇదే' .. 'ఊరుదాటి బయటికొచ్చాక గెలిచే వెళ్లాలి' వంటి సంభాషణలు మనసుకు పట్టుకుంటాయి.
ముగింపు: సరదాగా సాగిపోతూ .. అక్కడక్కడా ఎమోషన్స్ ను టచ్ చేసే ఈ సిరీస్, వినోదంతో పాటు సందేశాన్ని కూడా అందిస్తుంది.
'AIR' (ఈటీవీ విన్) వెబ్ సిరీస్ రివ్యూ!

AIR Review
- ఇంటర్ స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే 'AIR'
- 7 ఎపిసోడ్స్ గా వచ్చిన సిరీస్
- కామెడీ .. ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ
- వినోదంతో కూడిన సందేశం
Movie Name: AIR
Release Date: 2025-07-03
Cast: Harsh Roshan, Bhanu Prakash, Jayathertha, Akshara, Sameer, Chaithanya Rao
Director: Joseph Clinton
Music: Sinijith
Banner: Pocket Money Pictures
Review By: Peddinti
AIR Rating: 2.75 out of 5
Trailer