నితిన్ కథానాయకుడిగా దిల్ రాజు బ్యానర్ పై రూపొందిన సినిమానే 'తమ్ముడు'. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. చాలా కాలం తరువాత 'లయ' రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. నితిన్ సరైన హిట్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఎదురుచూస్తున్న హిట్, ఈ సినిమాతో వస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం. 

కథ: జై (నితిన్) ఆర్చరీ క్రీడాకారుడు. దేశానికి తాను బంగారు పతకం తీసుకురావాలనే పట్టుదలతో ఉంటాడు. అయితే కొంతకాలంగా అతని ఏకాగ్రత దెబ్బతింటూ ఉంటుంది. తనని చిన్నతనంలో వదిలేసి వెళ్లిపోయిన అక్కయ్య స్నేహలత (లయ) గుర్తొస్తూ ఉండటమే అందుకు కారణమని భావిస్తాడు. అక్కయ్య విషయంలో తాను చేసిన పని అతనికి 'గిల్ట్' గా ఉంటుంది. అక్కను కలిసి సారీ చెప్పి .. ఆమెతో తమ్ముడూ అని పిలుపించుకుంటే తప్ప, తన ఏకాగ్రత కుదరదని భావిస్తాడు. తన ఫ్రెండ్ చిత్ర (వర్ష బొల్లమ్మ)ను తీసుకుని బయల్దేరతాడు.       

తన అక్కయ్యను వెతుక్కుంటూ వెళ్లిన 'జై'కి, ఆమె 'ఝాన్సీ'గా పేరు మార్చుకుందని తెలుస్తుంది. తన ఫ్యామిలీతో కలిసి, 'అంబర గొడుగు'లో జరుగుతున్న జాతరకి ఆమె వెళ్లిందని అతను తెలుసుకుంటాడు. అక్కడే ఆమెను కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ గ్రామానికి వెళతాడు. అది ఒక అడవీ ప్రాంతం. ఏ రాష్ట్ర పరిధిలోకి రానటువంటి ప్రత్యేకమైన ప్రదేశం. అలాంటి ఆ ప్రదేశానికి జై చేరుకుంటాడు. 

స్నేహలత ఫ్యామిలీ అంతా కూడా ప్రమాదంలో ఉందనే విషయం, అక్కడికి వెళ్లిన తరువాతనే 'జై'కి అర్థమవుతుంది. అప్పటికే ఆ ఫ్యామిలీని శత్రువులు చుట్టుముడతారు. తన వాళ్లను సురక్షితంగా అంబరగొడుగు దాటించాలని 'జై' నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అతని అక్కయ్య ఫ్యామిలీకి హాని తలపెట్టింది ఎవరు? అక్క ప్రేమను పొందాలనే జై కోరిక నెరవేరుతుందా? అనేది కథ. 

విశ్లేషణ: ఈ కథలో మూడు ప్రధానమైన అంశాలు కనిపిస్తాయి. తనని ఆశ్రయించిన బాధితులకి న్యాయం చేస్తానని స్నేహలత మాట ఇవ్వడం .. అక్క ఇచ్చిన మాట నిలబడేలా చేయడం కోసం తమ్ముడు రంగంలోకి దిగడం .. అందువలన గతం మరిచిపోయి ఆమె తనని తమ్ముడిగా అంగీకరిస్తుందనేది హీరో నమ్మకం.  ఈ మూడు అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. 

గతంలో అక్కాతమ్ముళ్ల ఎమోషన్స్ కి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, కథలో 80 శాతం ఫారెస్టులోనే జరుగుతుంది. ఎమోషన్స్ కంటే కూడా యాక్షన్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఏ యాక్షన్ ట్రాక్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారో, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ను డిఫరెంట్ డిజైన్ చేయకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. ఫారెస్టు ఏరియాలో 'హెల్ప్ డెస్క్' లో కూర్చుని హీరోకి సలహాలు .. సూచనలు ఇచ్చే సప్తమి గౌడ పాత్ర అస్సలు సెట్ కాలేదు. 

ఈ కథలో హీరో ఉన్నాడు .. విలన్ ఉన్నాడు .. హీరోయిన్ ఉంది. కానీ ఒకరిని గురించి ఒకరికి తెలియదు .. చూసుకోరు కూడా. ఇది కొత్తదనమో .. విచిత్రమో అనేది ఎవరికి వారు తేల్చుకోవలసిందే. నితిన్ లాంటి హీరో సినిమాలో గ్లామరస్ హీరోయిన్ .. లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లు లేకపోవడం ఆడియన్స్ ను కాస్త నిరాశ పరిచే విషయమే. ఈ సినిమాలో గిరిజన యువతిగా శ్వాసిక కనిపిస్తుంది. హీరో .. విలన్ .. పాత్రాల కంటే కూడా ఈ పాత్రను దర్శకుడు బాగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది.       
      
పనితీరు: నితిన్ పాత్రలో కొత్తదనమేమీ లేదు. అతని అక్క పాత్రలో 'లయ' చాలా హుందాగా మెరిసింది. సౌరబ్ సచ్ దేవా పాత్రను దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేశాడు. ఆ పాత్ర చుట్టూ దర్శకుడు గీసిన హద్దులే మైనస్ కూడా అయింది. సప్తమిగౌడ ట్రాక్ అసలు అతకలేదు .. అసలు ఆ పాత్రను డిజైన్ చేయడం కుదరలేదు. శ్వాసిక నటన మాత్రం ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలలో కొందరి ఎంపిక సరైనది కాదేమో అనిపిస్తుంది. 

గుహన్ కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. ఫారెస్టు లొకేషన్స్ ను తెరపై ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. అలాగే మరో ప్రధానమైన పిల్లర్ గా అజనీశ్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకూ సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి ట్రై చేశాడు, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. 

ముగింపు: ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగిపోయే ఈ సినిమాలో, అక్కడక్కడ మాత్రమే ఎమోషన్స్ టచ్ అవుతాయి. మూడు నాలుగు పాత్రలు మినహా మిగతా ఆర్టిస్టులంతా క్రేజ్ లేని వారు  కావడం వలన, కథకి రావలసిన నిండుదనం రాలేదని అనిపిస్తుంది. విజువల్స్ పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మంచి మార్కులు పడతాయి. కాకపోతే తమ్ముడే రొటీన్ కి భిన్నంగా ఏమీ చేయలేకపోయాడే అనిపిస్తుంది.