కీర్తి సురేశ్ - సుహాస్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'ఉప్పు కప్పురంబు'. ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాణం ఎప్పుడు మొదలైంది .. ఎప్పుడు పూర్తయింది అనేది చాలామందికి తెలియదు. 28 రోజులలోనే షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమా, నేరుగా 'అమెజాన్ ప్రైమ్' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలోని కథను ఒకసారి పరిచయం చేసుకుందాం.

కథ: ఈ కథ 1992లో  జరుగుతూ ఉంటుంది. అది 'చిట్టి జయపురం' అనే ఊరు. ఆ గ్రామానికి సుబ్బరాజు (శుభలేఖ సుధాకర్) పెద్ద మనిషి. ఆయన కూతురే అపూర్వ (కీర్తి సురేశ్). ఒక రోజున హఠాత్తుగా సుబ్బరాజు చనిపోతాడు. గ్రామస్తులంతా కలిసి ఆయనను ఖననం చేస్తారు. ఆయన వారసురాలిగా .. ఊరు పెద్దగా అపూర్వ వ్యవహరించాలని కోరతారు. ఇష్టం లేకపోయినా అందుకు ఆమె ఒప్పుకుంటుంది. 

అయితే ఆ గ్రామపెద్దగా పెత్తనం చేయాలనే కోరిక భీమయ్య (బాబూ మోహన్) మధుబాబు (శత్రు)కి బలంగా ఉంటుంది. అందువలన అనుభవం లేని అపూర్వను కంగారుపెట్టేసి, ఆమె నుంచి ఆ కుర్చీని లాక్కోవాలని చూస్తుంటారు. ఆ గ్రామానికి సంబంధించిన స్మశానంలో చిన్నా (సుహాస్) పనిచేస్తూ ఉంటాడు. తన తల్లి కొండమ్మ ( తాళ్లూరి రామేశ్వరి)తో కలిసి అతను ఆ స్మశానం పక్కనే గుడిసె వేసుకుని జీవిస్తూ ఉంటాడు. 

స్మశానానికి సంబంధించిన ప్రదేశంలో ఇంకో నలుగురికి మాత్రమే చోటు ఉందనీ, ఆ తరువాత నుంచి అక్కడ ఎవరినీ ఖననం చేయడానికి అవకాశం ఉండదని అతను అపూర్వకి చెబుతాడు. తాను ఎప్పుడు చనిపోయినా తన గ్రామంలోనే ఖననం జరగాలని భీమయ్య, తన తండ్రి చనిపోతే ఆ గ్రామంలోనే పూడ్చాలని మధుబాబు పట్టుపడతారు. తన తల్లి కొండమ్మ చివరి కోరిక కూడా అదేనని అపూర్వతో చిన్నా చెబుతాడు. అప్పుడు అపూర్వ ఏం చేస్తుంది? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది కథ. 

విశ్లేషణ
: ఒక చిన్న గ్రామం ..  ఆ గ్రామస్తుల ఖననం కోసం ఉపయోగించే స్మశానం నిండిపోవడం. ఎప్పుడైతే  అది నిండిపోయిందో, తమని తమ గ్రామంలోనే ఖననం చేయాలనే గ్రామస్తుల ఎమోషన్స్ .. దాంతో మొదలైన గొడవల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.

తాను ఉన్నప్పుడే కాదు .. పోయినప్పుడు కూడా గొప్పగానే ఉండాలనీ, తన సమాధి అందరికంటే పెద్దగా ఉండాలనే భీమయ్య, తన ఊరిలో తన తండ్రి ఖననం జరగకపోవడం అవమానంగా భావించే మధుబాబు .. తన ఊరిలోనే పూడ్చి వేయాలనే తల్లి చివరికోరిక తీర్చాలనే చిన్నా  ఆరాటం .. ఇలా గ్రామస్తుల అమాయకత్వంతో కూడిన స్వభావాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. కానీ ఈ కథలో ఆత్మ లోపించిందని అనిపిస్తుంది. 

కృతకంగా అనిపించడమనేది స్మశానం కోసం వేసిన సెట్ దగ్గర నుంచే మొదలవుతుంది. అలాగే బాబూ మోహన్ .. శత్రు వంటి పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది. చివర్లోని ట్విస్ట్ బాగుంది. కానీ ఇది సినిమా .. కొంత వినోదం అవసరమే. అలా కాకుండా ఒక సంకలనంలో కొస మెరుపున్న చిన్న కథను చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. 

పనితీరు
: దర్శకుడు ఒక చిన్న కథను ఎంచుకుని, దానిని ఒక కొస మెరుపుతో ఎండ్ చేయాలనుకోవడం బాగానే ఉంది. స్మశానంలో కూడా తమ గొప్పతనం చాటుకోవాలనే స్వభావం ఉన్నవారినీ, ఆ మట్టిలోనే కలిసిపోవాలనే ఆరాటం ఉన్నవారిని చూపించే ప్రయత్నం జరిగింది గానీ, ఆ రెండు కోణాలను బలంగా ఆవిష్కరించలేదు. ఉప్పు - కర్పూరం ఒకేలా కనిపించినా, దేని స్వభావం దానిది .. దేని గొప్పదనం దానిది అంటూ టైటిల్ వైపు నుంచి ఇచ్చిన క్లారిటీ బాగానే ఉంది.   

కీర్తి సురేశ్ మరీ సన్నబడటం వలన కాస్త కళ తగ్గిందేమో అనిపిస్తుంది. 1992 కాలం నాటి గ్రామీణ  కట్టూ బొట్టూ కావడం వలన లుక్ కొత్తగా అనిపిస్తుంది. సుహాస్ .. బాబూ మోహన్ .. శుభలేఖ సుధాకర్ .. తాళ్లూరి రామేశ్వరి అంతా బాగానే చేశారు. దివాకర్ మణి ఫొటోగ్రఫీ .. రాజేశ్ మురుగేశన్ నేపథ్య సంగీతం .. కథకి తగినట్టుగానే సాగాయి. 

ముగింపు: సాధారణంగా మలయాళం వైపు నుంచి ఈ తరహా కథలు వస్తుంటాయి. ఇలాంటి ఒక ప్రయత్నం మన వైపు నుంచి చేయడం నిజంగా ప్రయాగమే. అయితే కథలోని ఎమోషన్స్ కనెక్ట్ కాలేదు. ఒక చిన్న కథను చదువుతున్న అనుభూతిని మాత్రమే ప్రేక్షకులు పొందుతారు.