ప్రియమణి ప్రధానమైన పాత్రగా 'గుడ్ వైఫ్' సిరీస్ రూపొందింది. రేవతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 6 ఎపిసోడ్స్ గా 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ .. బెంగాలి .. మరాఠి భాషలలో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ కథేమిటనేది చూద్దాం. 

కథ: గుణశీలన్ (సంపత్ రాజ్) అడిషనల్ అడ్వకేట్ జనరల్. భార్య తరుణిక (ప్రియమణి) లాయర్ గా పనిచేసి, ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటుంది. వారి పిల్లలే రితీశ్ .. రితన్య. విలాసవంతమైన జీవితాన్ని వారు గడుపుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే గుణశీలన్ సెక్స్ స్కాండల్ లో చిక్కుకుంటాడు. అందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చి .. వైరల్ గా మారుతుంది. ఏ కేసు విషయంలో అతను అరెస్టు అవుతాడు. అంతా కలలో మాదిరిగా జరిగిపోతుంది. 

గుణ చేసిన పని కారణంగా సమాజంలో తరుణిక .. ఆమె పిల్లలకు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. జైల్లో గుణ ఉండటం .. బ్యాంకు స్కౌంట్స్ ఫ్రీజ్ చేయడం వలన తరుణిక ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. దాంతో తరుణిక జాబ్ చేయాలని నిర్ణయించుకుంటుంది. గతంలో తనకి తెలిసిన హరిదీపక్ ఫర్మ్ లో జూనియర్ లాయర్ గా చేరుతుంది. అక్కడి నుంచి నిదానంగా ఒక్కోమెట్టు ఎక్కడం మొదలుపెడుతుంది.      

గుణ తప్పు చేశాడనే కోపంతో తరుణిక ఉంటుంది. అయినా అప్పడప్పుడు జైలుకి వెళ్లి అతణ్ణి కలిసి వస్తూ ఉంటుంది. జరిగిన దాంట్లో తన తప్పు లేకపోలేదనీ, అయితే కొంతమంది ప్లాన్ చేసి తనని ఇరికించారని ఆమెతో గుణ చెబుతాడు. తనని జైల్లోనే చంపాలనే ఆలోచనలో ఉన్నారని అంటాడు. ఒక లాయర్ గా తనని కాపాడటానికి ప్రయత్నం చేయమని కోరతాడు. అప్పుడు తరుణిక ఏం చేస్తుంది? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? నిజంగానే గుణ తప్పు చేశాడా? అనేది కథ. 

విశ్లేషణ: గతంలో లాయర్ గా పనిచేసిన తరుణిక, పిల్లల బాగోగులు చూడటం కోసం ఇంటిపట్టునే ఉండిపోతుంది. అయితే భర్త జైలుకు వెళ్లడంతో, తప్పనిసరి పరిస్థితులలో ఆమె మళ్లీ నల్లకోటు వేయవలసి వస్తుంది. ఒకవైపున భర్తను .. మరో వైపున పిల్లలను .. ఇంకో వైపున పరువు ప్రతిష్ఠలను కాపాడుకునే ప్రయత్నంలో ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

జైలుకి వెళ్లిన భర్తను కాపాడటం కోసం తరుణిక ఎలాంటి పోరాటం చేస్తుంది? ఆ ప్రయత్నంలో ఆమె ఎలాంటి ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ నడుస్తుందని ప్రేక్షకులు భావిస్తారు. కానీ ఒక్కోకేసు గెలుస్తూ తరుణిక ముందుకు వెళుతోందనే విషయాన్ని చూపించడం కోసం దర్శకుడు మరికొన్ని కేసులను మధ్యలోకి తీసుకుని వచ్చాడు. అదే ఈ సిరీస్ కి మైనస్ అయింది. 

తరుణిక మిగతా కేసులను పూర్తిచేసి వచ్చేటప్పటికే, కథ చివరిలోకి వచ్చేస్తాం. ఆ తరువాత అసలు అంశం దగ్గరే హడావిడి చేశారు. భర్తను విడిపించడంలో తన శాయశక్తులా ప్రయత్నం చేసిన భార్య అనిపించుకోలేకపోతుంది. భర్తకు సంబంధించిన కేసుపైనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ కథను నడిపించి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. 

పనితీరు: లైన్ ఆసక్తికరమైనదేగానీ, మధ్యలో అనవసరమైన సన్నివేశాలతో కాలయాపన చేశారు. స్క్రీన్ ప్లే వైపు నుంచి కూడా అద్భుతాలేమీ జరగలేదు. ప్రియమణి .. సంపత్ రాజ్ తదితరులు బాగా చేశారు. నిర్మాణ పరమైన విషయాలకు వంక బెట్టనవసరం లేదు. సిద్ధార్థ్ రామస్వామి ఫొటో
గ్రఫీ బాగుంది. కిషన్ కుమార్ ఎడిటింగ్ తో పాటు, నేపథ్య సంగీతం కూడా ఫరవాలేదనిపిస్తుంది. 

ముగింపు: కథ ఎత్తుకున్న తీరు బాగుంది. కానీ మధ్యలో అనవసరమైన సన్నివేశాలు ప్రధానమైన కథకు అడ్డు తగులుతాయి. ఆ సన్నివేశాల కారణంగా అసలు కథనే బలహీనపండిందని చెప్పచ్చు. అలా కాకుండా మెయిన్ లైన్ పైనే దృష్టిపెట్టి ఉంటే బాగుండేదేమో.