'పద్మిని' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

Movie Name: Padmini

Release Date: 2023-08-11
Cast: Hunchaco Boban, Aparna Balamurali, Vincy, Madonna Sebastian, Althaf Salim, Malavika Menon
Director: Senna Hegde
Producer: Suvin K Varkey
Music: Jekes Bejoy
Banner: Little Big Films
Rating: 3.00 out of 5
  • మలయాళంలో జులై 14న విడుదలైన సినిమా
  • సరదాగా సాగేపోయే సహజమైన కథ
  • హడావిడి లేకుండా ఆకట్టుకునే కథనం
  • తక్కువ పాత్రలతో నడిచే ఇంట్రెస్టింగ్ కంటెంట్ 
  • ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణ

తక్కువ పాత్రలు .. ఆసక్తికరమైన మలుపులతో సహజత్వానికి చాలా దగ్గరగా మలయాళ సినిమాలు ఉంటాయి. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేని కథలనే అక్కడి ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. ఆ తరహా కథలు కొన్ని ఇక్కడి ప్రేక్షకులకు కూడా కనెక్టు అవుతూ వస్తున్నాయి. అలాంటి ఒక సింపుల్ కంటెంట్ తో వచ్చిన సినిమాగా 'పద్మిని' కనిపిస్తుంది. జులై 14వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, మంచి ఆదరణ పొందింది. రీసెంటుగా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా, ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

రమేశ్ (కుంచాకో బోబన్) ఒక కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాడు. కవితలు రాయడం అతని హాబీ. తల్లి .. ఓ తమ్ముడు .. ఇది అతని కుటుంబం. అతను స్మృతి (విన్సీ) అనే ఒక యువతిని పెళ్లి చేసుకుంటాడు. వారి ఫస్టు నైట్ సమయంలో పవర్ పోతుంది. తనకి వెన్నెల అంటే చాలా ఇష్టమని చెప్పి, రమేశ్ ను ఆమె ఆరుబయటికి తీసుకుని వస్తుంది. పచ్చని పొలాల గట్లపై నడుస్తూ కొంత దూరం వెళతారు. అక్కడ కారుతో సిద్ధంగా ఒక యువకుడు ఉండటం చూసిన రమేశ్, అతను ఎవరని స్మృతిని అడుగుతాడు. 

అతను తన లవర్ అనీ ... అతనితో తన పెళ్లి జరిపించడం తండ్రికి ఇష్టం లేదని స్మృతి చెబుతుంది. తాను 'సిజూ' తో వెళ్లిపోతున్నానని చెప్పి ఆ కారు ఎక్కేస్తుంది. ఈ సంఘటనను ఒక ఇద్దరు వ్యక్తులు చూస్తారు .. వాళ్లే ఊరంతా టామ్ టామ్ చేస్తారు. దాంతో అందరూ కూడా రమేశ్ ను చూసి నవ్వుతూ ఉంటారు. లవర్ తో కలిసి ఆమె పారిపోయింది 'పద్మిని' ప్రీమియర్ కారులో కావడం వలన, అతనిని 'పద్మిని' అనే పేరుతో పిలుస్తూ ఆటపట్టిస్తూ ఉంటారు. దాంతో సాధ్యమైనంత త్వరగా మరో పెళ్లి చేసుకోవాలని అతని నిర్ణయించుకుంటాడు. 

అలా పెళ్లి చూపుల కోసం లాయర్ శ్రీదేవి (అపర్ణ బాలమురళి) ఇంటికి వెళ్లిన రమేశ్, ఆ ఇంటి ముందు పద్మిని ప్రీమియర్ కారును చూసి, లోపలికి కూడా వెళ్లకుండా వెనుదిరిగి వచ్చేస్తాడు. దాంతో అతణ్ణి అపార్థం చేసుకున్న శ్రీదేవి గొడవ పడుతుంది. అలా రోజులు గడుస్తున్న సమయంలోనే రమేశ్ పని చేస్తున్న కాలేజ్ లో 'పద్మిని' ( మడోన్నా సెబాస్టియన్) లెక్చరర్ గా చేరుతుంది. 'పద్మిని' పేరు అంటే రమేశ్ కి అస్సలు పడదని గ్రహించిన ఆమె, అసలు విషయం తెలుసుకుంటుంది. ఆ తరువాత వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు .. పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

అయితే పద్మినిని పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్య అయిన స్మృతి నుంచి విడాకులు తీసుకోవాలని ఆమె మేనమామ షరతు పెడతాడు. విడాకుల కోసం శ్రీదేవి దగ్గరికి రమేశ్ వెళ్లవలసి వస్తుంది. అప్పటికే ఆమె జయన్( సాజిన్) ప్రేమలో ఉంటుంది. అతను చాలా శ్రీమంతుడు .. కానీ శ్రీదేవిని అనుమానిస్తూ ఉంటాడు. అతని ధోరణి ఆమెకి చిరాకు కలిగిస్తూ ఉంటుంది. ఆమె రమేశ్ తరఫున వాదన వినిపించినా, అతనికి విడాకులు కావాలంటే స్మృతి వచ్చి ఆ మాట చెప్పవలసిందే అంటుంది కోర్టు.

ఈ సారైనా .. ఈ కేసైనా గెలవాలనే పట్టుదలతో,  స్మృతి ఆచూకీ తెలుసుకోవడం కోసం రమేశ్ తో కలిసి తిరగడం మొదలుపెడుతుంది శ్రీదేవి. వాళ్లను జయన్ అనుమానించడమే కాకుండా, రమేశ్ పై పద్మినికి కూడా అనుమానం వచ్చేలా చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అలాంటి పరిస్థితుల్లో రమేశ్ ఏం చేస్తాడు? అతని విషయంలో పద్మిని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? జయన్ తీరు పట్ల శ్రీదేవి ఎలా స్పందిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. 

దీపు ప్రదీప్ రాసిన కథ ఇది .. సెన్నా హెగ్డే ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. నిజానికి ఇది చాలా తక్కువ పాత్రలతో కూడిన ఒక చిన్న కథ. అందమైన లొకేషన్స్ లో సహజంగా ఆవిష్కరించడం వలన మరింత అందం వచ్చింది. రమేశ్ .. పద్మిని .. జయన్ .. శ్రీదేవి .. సిజూ .. స్మృతి .. అనే మూడు జంటల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. మిగతా పాత్రలు అలా నామమాత్రంగా వచ్చి వెళుతూ ఉంటాయి. కథ సరదాగా సాగిపోతూ .. అక్కడక్కడా చిన్న చిన్న ట్విస్టులతో నవ్విస్తూ ఉంటుంది.

కథను కలుపుకుపోతూ సందర్భాను సారం వచ్చే పాటలు కూడా బాగున్నాయి. ప్రధానమైన పాత్రధారులంతా కూడా చాలా సహజంగా చేశారు. కథను అలంకరించకుండా వదిలేయడం వల్లనే, తొందరగా కనెక్టు అవుతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు సాగుతుంది. అవసరాన్ని బట్టి .. అవకాశాన్ని బట్టి మనుషులు ఎలా మారిపోతారు? కొంతమంది తమకి అనుకూలంగా అవకాశాలను ఎలా మార్చుకుంటారు? ఎక్కువైన ప్రేమ ఎలా అనుమానంగా మారుతుంది? అనే సందేశాన్ని ఈ సినిమా ఇచ్చింది.

సువిన్ వార్కే నిర్మించిన ఈ సినిమా, పెద్దగా బడ్జెట్ బాధలేని ఇంట్రెస్టింగ్ కథగా కనిపిస్తుంది. జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీరాజ్ రవీంద్రన్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. గ్రామీణ నేపథ్యంలో అందమైన లొకేషన్స్ ను గొప్పగా ఆవిష్కరించాడు. పెద్దగా ట్విస్టులు .. భారీ మలుపులు లేని సినిమా కావడం వలన, ఎడిటింగ్ పరంగా కూడా ఓకే. సంభాషణలు కూడా సహజంగా అనిపిస్తాయి. కాకపోతే ఒకటి రెండు చోట్ల కోర్టులో జడ్జి వ్యంగంగా మాట్లాడటం ఇబ్బందిగా అనిపిస్తుందంతే! 


More Movie Reviews