'ఖూఫియా' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

Movie Name: Khufiya

Release Date: 2023-10-05
Cast: Tabu, Ali Fazal, Wamiqa Gabbi, Ashish Vidyarthi, Azmeri Haque Badhon,Atul Kulkarni, Navnindra Behl, Shataf Figar
Director: Vishal Bhardwaj
Producer: Vishal Bhardwaj
Music: Vishal Bhardwaj
Banner: VB Films
Rating: 2.75 out of 5
  • టబూ ప్రధానమైన పాత్రను పోషించిన 'ఖూఫియా'
  • స్పై థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • ఎలాంటి ట్విస్టులు లేకుండా నడిచే కథనం 
  • భారీతనం పరంగా మంచి మార్కులు 
  • వెబ్ సిరీస్ లా అనిపించడమే ప్రధానమైన లోపం

ఈ మధ్య కాలంలో స్పై థ్రిల్లర్ జోనర్ కి మరింత ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఈ తరహా కంటెంట్ తో వెబ్ సిరీస్ లు .. సినిమాలు రావడం ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి కంటెంట్ కి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై మంచి క్రేజ్ ఉండటంతో, కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. అలా 'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన సినిమానే 'ఖూఫియా'. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టబూ .. వామికా గబ్బీ .. ఆశిష్ విద్యార్థి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కృష్ణ మెహ్రా (టబూ) .. జీవ్ ( ఆశిష్ విద్యార్థి) 'రా' అధికారులుగా పనిచేస్తూ ఉంటారు. ఢిల్లీలోని 'రా' ప్రధాన కార్యాలయంలో రవి మోహన్ (అలీ ఫజల్) డెస్క్ జాబ్ చేస్తూ ఉంటాడు. అతని తల్లి లలిత (రవీంద్ర బెహెల్) భార్య చారూ (వామికా గబ్బీ) కొడుకు కునాల్ .. ఇది అతని ఫ్యామిలీ. ఇక కృష్ణ మెహ్రా విషయానికి వస్తే, ఆమె తన భర్త శశాంక్ (అతుల్ కులకర్ణి) నుంచి విడాకులు తీసుకుని చాలా కాలమే అవుతుంది. వాళ్ల సంతానమే విక్రమ్. తన కొడుకు కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నాననే ఒక అసంతృప్తి ఆమెను వెంటాడుతూ ఉంటుంది.

ఇదే సమయంలో బ్రిగేడియర్ మీర్జా .. ఉగ్రవాద శక్తులతో చేతులు కలుపుతాడు. దేశ రహస్యాలకు సంబంధించిన సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేస్తూ ఉంటాడు. అతనికి సంబంధించిన ఆపరేషన్ లో కృష్ణ మెహ్రా స్నేహితురాలు హీనా రెహ్మాన్ పాల్గొంటుంది. మీర్జా ప్రాణాలు తీయాలనే లక్ష్యంతోనే ఆమె అతని బర్త్ డే వేడుకకి హాజరవుతుంది. అయితే అప్పటికే డబ్బు కోసం దారి తప్పిన రవి మోహన్, ఈ విషయాన్ని లీక్ చేయడం వలన హీనా రెహ్మాన్ ప్రాణాలు కోల్పోతుంది.  

ఈ సమాచారం 'రా' అధికారి 'జీవ్' దృష్టికి వెళుతుంది. అతని ఆదేశం మేరకు తన టీమ్ తో కలిసి కృష్ణ మెహ్రా రంగంలోకి దిగుతుంది. రవిమోహన్ కదలికలపై నిఘాపెడుతుంది. రవి మోహన్ - చారు ఇంట్లో లేని సమయం చూసి, కృష్ణమెహ్రా తన టీమ్ తో ఆ ఇంట్లో సీక్రెట్ కెమెరాలను అమర్చుతుంది. ఇక అప్పటి నుంచి ఆ ఇంట్లో ఏం జరుగుతుందనే గమనించడం మొదలుపెడతారు. రవి మోహన్ చేస్తున్న పనులు అతని భార్యకు తెలియవు అనే విషయం వాళ్లకు అర్థమవుతుంది. వాళ్లు అనుమానించినట్టుగా ఆ ఇంట్లో ఏమీ జరక్కపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 


అయితే ప్రతి సోమవారం రోజున రవి మోహన్ తన ఇంట్లోకి నేరుగా రాకుండా ముందుగా గ్యారేజ్ కి వెళ్లి .. ఆ తరువాత ఇంట్లోకి రావడం జీవ్ కి అనుమానాన్ని కలిగిస్తుంది. దాంతో కృష్ణ మెహ్రా తన టీమ్ తో గ్యారేజ్ లోను సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేయిస్తుంది. అప్పుడు కృష్ణ మెహ్రా టీమ్ కి ఏం తెలుస్తుంది? గ్యారేజ్ లో ఏం జరుగుతుంది? రవి మోహన్ ను పట్టుకోవడానికి కృష్ణ మెహ్రా వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? శత్రు దేశాలతో చేతులు కలిపిన బ్రిగేడియర్ మీర్జా పరిస్థితి ఏమిటి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

విశాల్ భరద్వాజ్ దర్శక నిర్మాతగాను .. సంగీత దర్శకుడిగాను వ్యవహరించిన సినిమా ఇది. బ్రిగేడియర్ మీర్జా పుట్టినరోజు వేడుకలు .. అతని అంతం చేయడానికి వెళ్లిన హీనా రెహమాన్, అతని చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఈ కథ మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి 'రా' అధికారుల హడావిడి .. ఉరుకుల పరుగుల వ్యవహారం .. శత్రువుకి చెమటలు పట్టించే వ్యూహాలు .. ఛేజింగులు ... కాల్పులు ఉంటాయని అంతా భావిస్తారు. అంత టెన్షన్ అవసరం లేదన్నట్టుగా కూల్ గా నడిచిన కథ ఇది.

ఈ తరహా కథల్లో 'రా' అధికారుల స్పీడ్ ను వాళ్ల ఎదురుగా ఉన్న వ్యక్తులు గానీ, తాము గాని ఊహించకూడదనే ఉద్దేశంతో ప్రేక్షకులు ఉంటారు. శత్రువు గన్ తీసేలోగా అతనితోపాటు అతని చుట్టూ ఉన్న పదిమంది నేలకి ఒరిగిపోవాలి అని ఆశిస్తారు. కానీ అలా కాకుండా పావురాల కోసం వల పన్నీ .. అవి ఎప్పుడు వచ్చి దాన్లో చిక్కుకుంటాయా అన్నట్టుగా తాపీగా వెయిట్ చేయడం ప్రేక్షకులకు కాస్త అసహనాన్ని కలిగిస్తుంది.

రవిమోహన్ కదలికలపై సీక్రెట్ కెమెరాలతో నిఘాపెట్టడం .. అతని కదలికలను పసి గట్టడం వంటి ఎపిసోడ్స్ లో ఆడియన్స్ చాలా ఆశిస్తారు. కానీ అక్కడ రవి మోహన్ భార్య డాన్సులు చూసి కృష్ణ మెహ్రా టీమ్ నవ్వుకుంటుంది. అది చూసి ఆడియన్స్ కూడా నవ్వుకోవాలంతే.  ఇక మీర్జాను లేపేయడానికి పన్నిన వ్యూహం .. రవిమోహన్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. అంతా నాటకీయంగా అనిపిస్తాయి. 

గ్యారేజ్ లో రవిమోహన్ కి సంబంధించిన సీన్ .. ఆయన నుంచి బ్యాగ్ అందుకున్న వ్యక్తిని కృష్ణ మెహ్రా టీమ్ ఫాలో కావడం వంటి సీన్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఒక 'రా' ఆఫీసర్ అనగానే ఆ వ్యక్తి ధైర్యసాహసాలు .. సమయస్ఫూర్తి .. హుందాతనానికి ఆడియన్స్ ఎక్కువ మార్కులు ఇస్తూ ఉంటారు. అయితే ఒక రకమైన బలహీనత ఉన్న వ్యక్తిగా కృష్ణ మెహ్రాను చూపిస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేశారు. అలాగే వామికా గబ్బి వైపు నుంచి కూడా అభ్యంతరకరమైన సీన్ ఒకటి హఠాత్తుగా స్క్రీన్ పైకి వస్తుంది. అందువలన ఫ్యామిలీతో కలిసి చూసేటప్పుడు కాస్త జాగ్రత్తగానే ఉండాలి. 

గతంలో అమర్ భూషణ్ రచించిన 'ఎస్కేప్ టు నో వేర్' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నిర్మాణ విలువల పరంగా వంకబెట్టవలసిన పనిలేదు. ఫర్హద్ అహ్మద్ ఫొటోగ్రఫీ బాగుంది. విశాల్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫరవాలేదు. శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఓకే. అయితే ఈ తరహా కంటెంట్ కి ఉండవలసిన స్పీడ్ .. ఈ కథలో మనకి కనిపించదు. అలాగే ఎక్కడా కూడా ఎలాంటి ట్విస్టులు లేకుండా నడిచే సాదా సీదా స్క్రీన్ ప్లే ఒక మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇది ఒక సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ లా నడవడం ప్రధానమైన లోపంగా అనిపిస్తుంది.
Trailer

More Movie Reviews