'టైగర్ నాగేశ్వరరావు' - మూవీ రివ్యూ

Movie Name: Tiger Nageshwara Rao

Release Date: 2023-10-20
Cast: Ravi Teja, Nupur Sanon, Gayatri Bharadwaj , Anupam Kher, Renu Desai, Jisshu Sengupta, Hareesh Peradi
Director: Vamsee
Producer: Abhishek Agarwal
Music: G. V. Prakash Kumar
Banner: Abhishek Agarwal Arts
Rating: 2.75 out of 5
  • 'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ 
  • యాక్షన్ .. ఎమోషన్స్ ఎక్కువ
  • రొమాన్స్ .. కామెడీలకు లేని ఛాన్స్ 
  • విపరీతమైన హింస - రక్తపాతం
  • ఎంటర్టైన్ మెంట్ పాళ్లు తగ్గడమే మైనస్
రవితేజ కథానాయకుడిగా రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాకి వంశీ దర్శకత్వం వహించాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, ఒక గజదొంగ బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథ 1970లలో జరిగింది కావడం .. రవితేజ లుక్ డిఫరెంట్ గా ఉండటం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అలాంటి ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఎంతవరకూ ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

ఈ కథ 1970లలో మొదలవుతుంది. 'స్టూవర్టుపురం' గ్రామానికి సంబంధించి ఎవరు ఏ దొంగతనానికి వెళ్లినా ఎలమంద ( హరీశ్ పెరాడి)కి చెప్పి వెళ్లాలి. దొంగిలించిన దానిలో కొంత వాటా అతనికి ఇవ్వాలి. అతని ధనబలం .. అంగబలానికి భయపడి అందరూ ఆ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు. అతని ఆగడాలను చూస్తూనే నాగేశ్వరరావు పెరుగుతాడు. దొంగతనానికి వెళ్లిన తన తండ్రి పోలీసులకు దొరికినా గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో, కన్న తండ్రి తలను నరికినవాడు నాగేశ్వరరావు. 

నాగేశ్వరరావు ఆ గ్రామంలో ఎలమంద అధికారానికి ఎదురువెళుతూ ఉంటాడు. ఎలమంద తమ్ముడు 'కాశీ'( సుదేవ్ నాయర్)కి ఇది ఎంతమాత్రం నచ్చదు. ఇక ఆ గ్రామంలో తన అధికారాన్ని ఎంతమాత్రం లెక్కచేయని నాగేశ్వరరావు పట్ల పోలీస్ ఆఫీసర్ మౌళి ( జిషుసేన్ గుప్తా) కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో 'సారా' (నుపుర్ సనన్) ఫ్యామిలీకి నాగేశ్వరరావు అండగా నిలబడతాడు. దాంతో ఆమె ఆయన ప్రేమలో పడిపోతుంది. అతనినే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. 

ఆ చుట్టుపక్కల ఎక్కడ ఏ హత్య .. దోపిడీ జరిగినా పోలీసులు స్టూవర్టుపురం గ్రామస్తులనే అరెస్టు చేసి తీసుకువెళుతుంటారు. దాంతో ఆ గ్రామం అన్నివిధాలా వెనకబడిపోతోంది. ఈ విషయాన్ని గ్రహించిన నాగేశ్వరరావు, గ్రామంలోని యువత భవితకు విద్య .. ఉద్యోగం అవసరమని భావిస్తాడు. అందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమనే విషయం అతనికి అర్థమవుతుంది. 

అప్పటివరకూ చేస్తూ వచ్చిన చిన్న చిన్న దొంగతనాలకు నాగేశ్వరరావు ఫుల్ స్టాప్ పెట్టేసి, భారీ దోపిడీలకు తెరతీస్తాడు. పెద్ద మొత్తంలో రైల్లో తరలించబడుతున్న బంగారాన్ని దోచేస్తాడు. ఆ బంగారాన్ని స్టూవర్టుపురం యువత భవిష్యత్తు కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకుంటాడు. ఒక వైపున పోలీసులు .. మరో వైపున ఎలమంద గ్యాంగ్ ఆ బంగారం కోసం గాలిస్తుంటారు. అప్పుడు నాగేశ్వరరావు ఏం చేస్తాడు? ఆయన కల నిజమవుతుందా? సారాతో అతని వివాహమవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.

 ఇది స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు కథ .. సినిమాకి తగినట్టుగా వంశీ - శ్రీకాంత్ విస్సా దీనిని రాసుకున్నారు. చిన్నప్పటి నుంచే నాగేశ్వరరావు పాత్రను చూపిస్తూ వెళ్లారు. ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది .. అలాగే అక్కడ స్థానికంగా విలనిజం చెలాయించే 'ఎలమంద పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. అలాగే ఇద్దరు నాయికల పాత్రలను ఆవిష్కరించిన తీరు కూడా కనెక్ట్ అవుతుంది. స్టూవర్టుపురం గ్రామం .. అందుకు సంబంధించిన వాతావరణం సహజంగానే అనిపిస్తుంది.
 
ఈ కథ 1970లలో నడుస్తుంది .. అందువలన ప్రేక్షకులకు తరచూ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ వెళ్లాలి. అందుకు అవసరమైన వస్తువులు .. కాస్ట్యూమ్స్ విషయంలో అంతగా శ్రద్ధ పెట్టలేదేమోనని  అనిపించకమానదు. ఇది గజదొంగ జీవితకథ .. ఆయన చేసిన మంచి - చెడు రెండూ కలిపి చెప్పిన కథ. గజదొంగ కథ గనుక ఆయన చేసిన భారీ దొంగతనాలను చూపించారు. గూడ్స్ లో వెళతున్న ఆహార నిల్వలను కొట్టేసే ఎపిసోడ్ తో అటు నాగేశ్వరరావు .. ఇటు దర్శకుడు మంచి మార్కులు కొట్టేశారు. అలా చేయడం సాధ్యమవుతుందా? లేదా? అనేది తరువాత విషయం. ఇక ఆ తరువాత ఈ స్థాయిలో డిజైన్ చేసిన దోపీడీ సీన్స్ మాత్రం కనిపించవు.

స్టూవర్టుపురం గ్రామస్థుల వైపు నుంచి ఎమోషన్ .. హీరో వైపు నుంచి యాక్షన్ .. హీరో - హీరోయిన్ వైపు నుంచి లవ్ ఉన్నాయిగానీ, రొమాన్స్ వైపు మాత్రం వెళ్లలేదు. పాటల ద్వారా ఆ లోటును భర్తీ చేయడానికి కూడా ట్రై చేయలేదు.  అలాగే అవకాశం ఉన్నప్పటికీ కామెడీ వైపు చూడను కూడా చూడలేదు. ఇక ప్రధాని బంగాళాలోకి నాగేశ్వరరావు ప్రవేశించడం .. తప్పించుకుపోవడం, ట్రైన్ లోని బంగారాన్ని కొట్టేసే సీన్ ను ఉత్కంఠ భరితంగా చూపించకుండా 'మమ' అనిపించారు.

నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడినట్టుగా కనిపించదు. జీవీ ప్రకాశ్ కుమార్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. 'ఏక్ దమ్' .. ' ఇచ్చేసుకుంటాలే' బాణీలు ఆకట్టుకుంటాయి. మధి ఫొటోగ్రఫీ బాగుంది ... ఛేజింగ్ సీన్స్ .. యాక్షన్ సీక్వెన్స్ లను గొప్పగా చిత్రీకరించాడు. ఎడిటింగ్  పరంగా చూసుకుంటే, యూత్ ను విలన్ గ్యాంగ్  .. గ్రామస్థులను పోలీసులు హింసించే సీన్స్ ట్రిమ్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది.

శ్రీకాంత్ విస్సా రాసిన డైలాగ్స్ బాగున్నాయి. 'కొట్టేముందు .. కొట్టేసేముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు' .. 'ఊళ్లో కుక్క తరిమిందని అడవిలోకి పరిగెత్తకూడదురా' .. 'తాళాలు తెరవడం ... తలలు తరగడం నాకు బాగా తెలుసు' .. చావడమంటే మనిషి పోవడం కాదురా, వాడి కల నెరవేరకపోవడం' వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి. 

రవితేజ యాక్షన్ కి వంక బెట్టడానికి లేదు .. నుపుర్ సనన్ చాలా గ్లామరస్ గా కనిపించింది. గాయత్రి భరద్వాజ్ బాగా చేసింది. ఇక మిగతా వాళ్లంతా ఎవరి పాత్రకి వాళ్లు న్యాయం చేశారు. యాక్షన్ ను .. ఎమోషన్ ను భారీ బడ్జెట్ తోనే టచ్ చేశారుగానీ, ఎంటర్టైన్ మెంట్ కు కాస్త దూరంగా వెళ్లడమే అసంతృప్తిగా అనిపిస్తుందంతే. 

ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. మాటలు .. ఎమోషన్ .. యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్: రొమాన్స్ ని .. కామెడీని పట్టించుకోకపోవడం. కొన్ని సీన్స్ అవసరానికి మించి ఉండటం. హింస .. రక్తపాతం ఎక్కువైపోవడం .. ఎంటర్టైన్మెంట్ తక్కువైపోవడం. 1970ల కాలం నాటి అంశాలపై అంతగా శ్రద్ధ పెట్టకపోవడం.  

Trailer

More Movie Reviews