'కన్జూరింగ్ కన్నప్పన్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

Movie Name: Conjuring Kannappan

Release Date: 2024-01-05
Cast: Sathish,Regina Cassandra, Nassar, Anandara, Saranya Ponvannan, VTV Ganesh,Redin Kingsley
Director: Selvin Raj Xavier
Producer: Kalapathi S. Aghoram
Music: Yuvan Shankar Raja
Banner: AGS Entertainment
Rating: 2.75 out of 5
  • తమిళంలో రూపొందిన 'కన్జూరింగ్ కన్నప్పన్'
  • డిసెంబర్ 8న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 5వ తేదీ నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్
  • కొంచెం భయపెడుతూ .. మరి కొంచెం నవ్విస్తూ సాగే కథ  

తమిళంలో క్రితం ఏడాది కామెడీ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సినిమాలలో ' 'కన్జూరింగ్ కన్నప్పన్' ఒకటిగా కనిపిస్తుంది. సతీశ్ - రెజీనా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సెల్విన్ రాజ్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం. 

హైదరాబాదులో కన్నప్ప (సతీశ్) ఓ మధ్య తరగతి యువకుడు. తండ్రి ఆంజనేయులు( వీటీవీ గణేశ్) తల్లి లక్ష్మీ (శరణ్య) మేనమామ శేఖర్ (నమో నారాయణ) ఇదీ అతని కుటుంబం. తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బుతోనే ఇల్లు గడుస్తూ ఉండటంతో, సాధ్యమైనంత త్వరగా తాను ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనే పట్టుదలతో కన్నప్ప ఉంటాడు. అందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తుంటాడు. ఒక ఇంట్రెస్టింగ్ వీడియో గేమ్ ను డిజైన్ చేయాలనేది అతని ఆశయం. 

 ఒక రోజున ఇంట్లో వాటర్ మోటర్ పనిచేయకపోవడంతో పెరట్లోని బావిలో నుంచి నీళ్లు తోడుకోవడానికి కన్నప్ప సిద్ధమవుతాడు. పురాతనకాలం నాటి ఆ బావికి పైన గ్రిల్స్ బిగించి .. లాక్ వేసే ఉంటుంది. తుప్పు పట్టిన కీస్ తో లాక్ ఓపెన్ చేసి నీళ్లు తోడటానికి అతను ప్రయత్నించగా, బక్కెట్టుకు పట్టుకుని ఒక చిత్రమైన వస్తువు పైకి వస్తుంది. తిరిగి దానిని బావిలోనే పడేసి వచ్చేస్తాడతను. ఆ తరువాత ఆ వస్తువు తన బెడ్ రూమ్ లో ఉండటం చూసి షాక్ అవుతాడు. అతనికి ఏదో తేడా కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. 

ఆ రాత్రి అతనికి ఒక కల వస్తుంది. ఒక పెద్ద ప్యాలెస్ లోకి కన్నప్ప వెళతాడు. అక్కడ 1930 కాలానికి చెందిన ఫొటోలు .. వస్తువులు చూస్తాడు. ఒక దెయ్యం తనని తరుముతున్నట్టుగా అనిపించడంతో, భయంతో ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. కలలో తనకి దెబ్బ తగిలిన చోట నిజంగానే గాయమై ఉండటం .. కలలో షర్ట్ చిరిగిన చోట నిజంగానే షర్టు చిరిగి ఉండటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ ప్యాలెస్ కి సంబంధించిన కల ప్రతిరోజూ వచ్చి, అతనికి నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది.

ఆత్మలు - ప్రేతాత్మలపై పరిశోధన చేసే ఏడుకొండలు (నాజర్)ను కన్నప్ప కలిసి తనకి ఎదురైన అనుభవం గురించి చెబుతాడు. కన్నప్పకి బావిలో దొరికిన వస్తువు పేరు 'డ్రీమ్ క్యాచర్' అనీ, దానిని దుష్ట శక్తి ఆవహించడం వలన ఇబ్బంది పెడుతోందని ఏడుకొండలు చెబుతాడు. అతనికీ .. కలలో కనిపించే ఆ ప్యాలెస్ కి ఏదో సంబంధం ఉందనీ, అదేమిటో తెలుసుకోవాలని అంటాడు. డ్రీమ్ లోకి వెళ్లినప్పుడు 'డ్రీమ్ క్యాచర్'కి సంబంధించిన 'కీ'ని సంపాదించమని చెబుతాడు. అలా చేస్తే దెయ్యం బారి నుంచి బయటపడొచ్చని సెలవిస్తాడు.

అప్పుడు కన్నప్ప ఏం చేస్తాడు? అతనికి కలలో కనిపించే ప్యాలెస్ ఎక్కడిది? ఆ ప్యాలెస్ తో కన్నప్ప కు గల సంబంధం ఏమిటి? దెయ్యాలుగా మారినదెవరు? 'డ్రీమ్ క్యాచర్'కి సంబంధించిన 'కీ'ని సంపాదించడంలో అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అతను చెబుతున్నా వినిపించుకోకుండా ఎవరెవరు దెయ్యాల బారిన పడతారు? అనేవి ఈ కథలో ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి. 

హైదరాబాద్ లో సాధారణమైన జీవితాన్ని గడుపుతున్న కన్నప్ప ఫ్యామిలీకి, స్వప్నంలో ప్యాలెస్ కి చెందిన దెయ్యాలకి మధ్య నడిచే కథ ఇది. ఈ కథను సెల్విన్ రాజ్ రాసుకుని ... తాను అనుకున్నట్టుగా తెరకెక్కించాడు. డ్రీమ్ లో ఏదైతే జరుగుతుందో బయట అది నిజమవుతూ ఉండటం .. తరుణోపాయాన్ని తెలుసుకుని డ్రీమ్ లోకి అడుగుపెట్టడం అనే రెండు అంశాలు ఈ కథలో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.

అలాగే 1930లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ .. కన్నప్పకి వచ్చే డ్రీమ్ లోని ప్యాలెస్ కీ ... అతనికి గల సంబంధం అనే అంశాలు ఆసక్తికరంగానే అనిపిస్తాయి. ఇది హారర్ కామెడీ .. అందుకు తగినట్టుగానే అటు డ్రీమ్ లో .. ఇటు బయట హాస్యభరితంగానే ఈ కథ నడుస్తుంది. హీరోతో పాటు ఒక్కో పాత్ర డ్రీమ్ లో దెయ్యాల ప్యాలెస్ కి వెళ్లే సందర్భాలు నవ్వు తెప్పిస్తాయి. నిద్రపోతే కల వస్తుంది .. కలలోకి వెళితే దెయ్యాలు వస్తాయి .. అందువలన నిద్రపోకుండా పడే పాట్లకు సంబంధించిన సీన్స్ సరదాగా అనిపిస్తాయి. 

లాజిక్కులు పక్కన పెట్టేస్తే, అక్కడక్కడా కాస్త భయపెడుతూ .. అప్పుడప్పుడు సరదాగా నవ్వించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. వీటీవీ గణేశ్ .. శరణ్య .. రేడిన్ కింగ్స్లే కామెడీ పేలింది. రెజీనా ఉన్నప్పటికీ హీరోయిన్ స్థానంలో కాకుండా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తుంది. యువ ఫొటోగ్రఫీ .. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. హారర్ కామెడీ జోనర్ సినిమాలను ఇష్టపడేవారు, ఈ సినిమా చూడొచ్చు. 


More Movie Reviews