'కర్మ కాలింగ్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

Movie Name: Karmma Calling

Release Date: 2024-01-26
Cast: Raveena Taandon, Namratha Seth, Rohith Roy, Gourav Sharma, Varun Sood, Viraf Patel, Devanshi Sen
Director: Ruchi Narayan
Producer: Ashutish Shah - Taher Shabbir
Music: -
Banner: RAT Film Production
Rating: 3.25 out of 5
  • రవీనా టాండన్ నుంచి 'కర్మ కాలింగ్'
  • నిన్నటి నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్ 
  • 7 ఎపిసోడ్స్ తో రూపొందించిన కథ  
  • నిర్మాణ విలువల పరంగా మంచి మార్కులు 
  • స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకునే సిరీస్ 

రవీనా టాండన్ ప్రధానమైన పాత్రగా 'కర్మ కాలింగ్' రూపొందింది. యూఎస్ ఒరిజినల్ సిరీస్ 'రివేంజ్' ఆధారంగా ఈ సిరీస్ నిర్మితమైంది. రుచి నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా ఈ నెల 26వ తేదీ నుంచి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. అశుతోష్ షా - తాహెర్ షబ్బీర్ - రుచి నారాయణ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ ముంబై నేపథ్యంలో జరుగుతుంది. అక్కడికి సమీపంలోని 'అలీభాగ్' లో రాణి ఇంద్రాణి (రవీనా టాండన్) కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉంటారు. భర్త కౌశల్ (గౌరవ్ శర్మ) కొడుకు అహాన్ (వరుణ్ సూద్) కూతురు మీరా (దేవాన్షి సేన్) ఇది ఆమె కుటుంబం. పిల్లలిద్దరూ పెళ్లీడుకొస్తారు. బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా దాదాపు ఇంద్రాణి కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటాయి. బిజినెస్ కి సంబంధించిన డీల్స్ సెట్ చేయడానికి గాను తరచూ ఆమె పార్టీలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అలాగే మీడియా కవరేజ్ ను ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది. 

 ఇంద్రాణి భర్త కౌశల్ తమ సంస్థకి సంబంధించిన బోర్డు మెంబర్స్ లో ఒకరైన 'డాలి' ప్రేమలో పడతాడు. వాళ్లిద్దరి మధ్య చాలా కాలంగా అక్రమ సంబంధం నడుస్తూ ఉంటుంది.  ఆ విషయం తెలిసి తరచూ అతనితో ఇంద్రాణి గొడవపడుతూ ఉంటుంది. 'డాలి'ని తన భర్త నుంచి దూరంగా పంపించడానికి ప్రయత్నిస్తుందిగానీ, ఆమెను కౌశల్ సీక్రెట్ గా వేరే ఫ్లాట్ లో ఉంచుతాడు. ఈ విషయం ఇంద్రాణికి తెలియకుండా జాగ్రత్తపడుతూ ఉంటాడు. 

ఆ ఇంటి పక్కనే ఉన్న 'ఆషియనా' బంగ్లాను కూడా ఇంద్రాణి కొనుగోలు చేయాలనుకుంటుంది. అయితే ఆ బంగ్లాను 'కర్మ' అలియాస్ అంబిక ( నమ్రత సేథ్) సొంతం చేసుకుంటుంది. పాతికేళ్ల లోపు వయసున్న ఆ యువతి ఒంటరిగా ఆ బంగ్లాలోకి దిగుతుంది. తన ఎనిమిదేళ్ల వయసులో ఆమె తన తండ్రి సత్యజిత్ ( రోహిత్ రాయ్)తో కలిసి ఆ బంగ్లాలో నివసించేది. గతంలో అతను ఇంద్రాణి సంస్థలో సీఈవో గా పనిచేసేవాడు. ఆ సమయంలో ఇంద్రాణికి అతనితో ప్రేమ వ్యవహారం నడుస్తుంది. 

అయితే వ్యాపార సంబంధమైన కొన్ని కారణాల వలన కౌశల్ .. అతని భాగస్తులు కలిసి సత్యజిత్ ను జైలుకు పంపిస్తారు. ఆ సమయంలో ఇంద్రాణి కూడా మౌనంగా ఉండిపోతుంది. తండ్రి జైలుకు వెళ్లడంతో అంబిక అనాథ అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయే 'కర్మ' పేరుతో ఇంద్రాణి పక్కింటిని కొనుగోలు చేస్తుంది. చేయని తప్పుకి తన తండ్రిని జైలుపాలు చేసిన ఇంద్రాణి కుటుంబ సభ్యులపై .. వారికి సహకరించినవారిపై పగ తీర్చుకోవడమే ఆమె ముందున్న ప్రధానమైన లక్ష్యం.

అందుకోసం ఇంద్రాణి కుటుంబంతో పరిచయం పెంచుకోవడం .. ఆమె కొడుకు 'అహాన్' ను ముగ్గులోకి దింపడం .. కౌశల్ బృందానికి తగిన బుద్ధి చెప్పడం .. ఇంద్రాణి కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉండే సమీర్ కళ్లుగప్పడం ..  తన పని పూర్తయ్యేవరకూ తాను ఎవరనేది ఎవరికీ తెలియకుండా చూసుకోవడం అవసరమని ఆమె భావిస్తుంది. అందుకోసం కర్మ ఏం చేస్తుంది? ఆ ప్రయత్నాల్లో ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఆమె తన ప్రతీకారాన్ని తీర్చుకోగలిగిందా? లేదా? అనే ఆసక్తికరమైన మలుపులు ఈ కథలో కనిపిస్తాయి.

ఎవరైనా సరే చేసిన పాపానికి తగిన ఫలితాన్ని అనుభవించవలసిందే. ఆ 'కర్మ' వదిలిపెట్టినా ఈ 'కర్మ' వెతుక్కుంటూ వచ్చి వేటాడుతుందనేదే ప్రధానమైన కథాంశం. దేవుడు క్షమించినా నేను క్షమించను అంటూనే 'కర్మ' తన పని తాను చేస్తూ వెళుతూ ఉంటుంది. ఇది పూర్తిస్థాయిలో కొనసాగే రివేంజ్ డ్రామా. తన బాల్యంలో తన తండ్రి జైలుపాలు కావడానికి కారణమైన ఒక్కొక్కరినీ ఆ పాప గుర్తుపెట్టుకుని, తాను పెద్దయిన తరువాత వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ కథ.

తన కుటుంబానికి అన్యాయం చేసినవారిపై ప్రతీకారం తీర్చుకోవడమనే కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే ట్రీట్మెంట్ పరంగా ఈ కథ ఆకట్టుకుంటుంది. కథ నిదానంగా నడుస్తూ ఉంటుంది .. ఎపిసోడ్స్ నిడివి కూడా ఎక్కువగానే అనిపిస్తుంది. అయినా 'కర్మ' ఒక్కొక్కరినీ తన ఉచ్చులోకి లాగే వ్యూహాలు ఆసక్తికరంగా అనిపిస్తూ .. చివరివరకూ కూర్చోబెడతాయి. సంపన్న కుటుంబాలవారి ఆడంబరాలు .. విలాసాలు .. వారి జీవితాల్లోని చీకటి కోణాలను ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.  

నిర్మాణ విలువలకి వంకబెట్టవలసిన పనిలేదు. కాన్సెప్ట్ కి తగిన ఖర్చు పెట్టడం వల్లనే ఈ సిరీస్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. రవీనా టాండన్ - నమ్రత సేథ్ ల మధ్యనే ప్రధానమైన వార్ నడుస్తూ ఉంటుంది. ఇద్దరూ కూడా పోటీపడి నటించారు. ముఖ్యమైన పాత్రలలో 'సమీర్' పాత్ర ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ సీజన్ వరకూ మాత్రం, వేదాంత్ - ఆదర్శ్ ట్రాక్ అనవసరమైనదిగానే కనిపిస్తుంది. ఆ ట్రాక్ లేకపోయినా కథకి ఎలాంటి ఇబ్బంది లేదు. అసభ్యకరమైన డైలాగ్స్ లేవుగానీ, లిప్ లాకులు మాత్రం గట్టిగానే కనిపిస్తాయి. 

భూషణ్ కుమార్ జైన్ ఫొటోగ్రఫీ ఈ సిరీస్ కి మరింత రిచ్ నెస్ తీసుకొచ్చింది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకి తగినట్టుగా సాగుతూ కథలోకి తీసుకెళుతుంది. ఎడిటింగ్ వర్క్ కూడా ఓకే. సిరీస్ కనుక,  ఆ స్టైల్లోనే కథను నిదానంగా చెప్పడానికి ట్రై చేశారు. కొత్త కథ .. కొత్త జోనర్ కాకపోయినా, భారీతనం పరంగా .. రిచ్ నెస్ పరంగా ..  ముఖ్యంగా స్క్రీన్ ప్లే పరంగా ఈ సిరీస్ ఆసక్తికరంగానే అనిపిస్తుంది. 

Trailer

More Movie Reviews