'డిమోంటి కాలనీ 2' (జీ 5) మూవీ రివ్యూ!

Movie Name: Demonte Colony 2

Release Date: 2024-09-27
Cast: Arulnidhi, Priya Bhavani Shankar, Arun Pandian, Muthukumar
Director: Ajay Gnanamuthu
Producer: Bobby Balachandran
Music: Sam CS
Banner: BTG Universal
Rating: 3.00 out of 5
  • ఆగస్టులో విడుదలైన తమిళ సినిమా 
  • అక్కడ భారీ వసూళ్లను రాబట్టిన కంటెంట్
  • ఈ రోజునే అందుబాటులోకి వచ్చిన సినిమా 
  • హారర్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే కథ  
  

తమిళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'డిమోంటి కాలనీ' మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. అందువలన 'డిమోంటి కాలనీ 2' రూపొందింది. అజయ్ జ్ఞానముత్తు దర్శత్వం వహించిన ఈ సినిమా, అక్కడ ఆగస్టు 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగులో ఆగస్టు 23న విడుదలైంది. అరుళ్ నిధి .. ప్రియాభవాని శంకర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.

డెబ్బీ (ప్రియా భవాని శంకర్) సామ్ ( సర్జానో ఖలీద్)ను ప్రేమిస్తుంది. ఒక వ్యాధి బారిన పడి, బ్రతకాలని ఆరాటపడిన అతను, ఆ వ్యాధి నుంచి కోలుకున్నాక ఆత్మహత్య చేసుకుంటాడు. అతను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆమెకి అర్థం కాదు. దాంతో 'దౌషి' అనే ఒక మత గురువును ఆమె ఆశ్రయిస్తుంది. తనకి సామ్ ఆత్మతో మాట్లాడాలని ఉందని అంటుంది. ఈ విషయంలో సామ్ తండ్రి కూడా ఆమెకి సహకరిస్తాడు.

'దౌషి' దగ్గర ప్రేతాత్మలను నియంత్రించే ఒక ఆయుధం ఉంటుంది. అందువలన అతను దానిని ఉపయోగించి ఆమెకి సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. సామ్ ఆత్మ వేరే లోకంలో చిక్కుకుందని చెప్పి, ఆమె ఆత్మనే అక్కడికి పంపిస్తాడు. అక్కడ వేరే ప్రేతాత్మ ఆమెకి కనెక్ట్ అవుతుంది. అది గ్రహించిన దౌషి, వెంటనే ఆమె ఆత్మను వెనక్కి పిలుస్తాడు. అయితే ఆ ప్రేతాత్మ అప్పటికే రంగంలోకి దిగుతుంది. 

ఇక రఘు (అరుళ్ నిధి) శ్రీనివాసన్ (అరుళ్ నిధి) కవల సోదరులు. ఇద్దరూ శ్రీమంతుడైన అమృతలింగం కొడుకులు. అమృతలింగం తన 2,500 కోట్ల ఆస్తిలో 25 శాతం రఘుకి .. 70 శాతం శ్రీనివాసన్ కి రాస్తాడు. మిగతా 5 శాతం రెండో భార్య కూతురు ఐశ్వర్యకి రాస్తాడు. అయితే శ్రీనివాసన్ కి ఎక్కువ ఆస్తి వెళ్లడం ఇష్టం లేని రఘు, కోపంతో రగిలిపోతాడు. అప్పటికే ఒక ప్రమాదానికి లోనైన శ్రీనివాసన్, చెన్నెలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటాడు.          

శ్రీనివాసన్ కి చికిత్స చేసే డాక్టర్, డెబ్బీ తండ్రి. అతన్ని రఘు కలిసినప్పుడు డెబ్బీ .. ఆమె ఆశ్రయించిన దౌషి అక్కడే ఉంటారు. ఆస్తి తనకు మాత్రమే దక్కాలనే ఉద్దేశంతో, శ్రీనివాసన్ ను చంపేయమని రఘు కోరతాడు. అలా చేస్తే రఘుకి కూడా మరణం  తప్పదని దౌషి చెబుతాడు. అందుకు గల కారణం ఏమిటనేది వివరిస్తాడు. అతను ప్రాణాలతో ఉండాలంటే, ప్రేతాత్మ బారి నుంచి శ్రీనివాసన్ ను కాపాడాలని అంటాడు.

శ్రీనివాస్ చావుబతులో ఉండటానికీ .. అతని స్నేహితుడు చనిపోవడానికి లైబ్రరీలోని ఒక బుక్ కారణమని డెబ్బీ .. రఘు ... దౌషి తెలుసుకుంటారు. ఆ బుక్ చదివినవారు సరిగ్గా జూన్ 6వ తేదీన అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఆ బుక్ దేనికి సంబంధించినది? శ్రీనివాసన్ ను వాళ్లు కాపాడుకోగలుగుతారా? అనేది మిగతా కథ. 

ఒక వైపున ప్రేతాత్మ చేసే హడావిడి .. ఒక వైపున మతగురువు మంత్రశక్తితో చేసే విన్యాసాలు .. ఇంకోవైపున ప్రేతాత్మను కట్టడి చేయడానికి అవసరమైన అన్వేషణ .. ఇలా కథ అన్ని వైపుల నుంచి ఆసక్తికరంగా నడుస్తూ ఉంటుంది. ప్రధానమైన పాత్రలు డిమోంటి ఇంట్లోకి చేరుకున్న తరువాత ఉత్కంఠ పెరిగిపోతుంది. గబ్బిలాలు దాడి చేయడం వంటి సీన్స్ భయపెడతాయి. దర్శకుడు పూర్తి అవగాహనతో చేసిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కంటెంట్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది.

హరీశ్ కన్నన్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం, కథకి మరింత బలంగా మారింది. కుమరేష్ ఎడిటింగ్ కూడా ఓకే. సాధారణ ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాలు అయోమయాన్ని కలిగించినప్పటికీ, కాస్త ఆలోచన చేస్తే అర్థమవుతుంది. భయంకరమైన మేకప్పు లేకుండానే భయపెట్టిన దెయ్యం కథగా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు. హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. 


Trailer

More Movie Reviews