అవగాహనతో సెర్వికల్ క్యాన్సర్‌ని నిర్మూలిద్దాం-సెర్వికల్ క్యాన్సర్ అవగాహాన మాసం
డాక్టర్. వసుంధర చీపురుపల్లి
సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రోబోటిక్ & లాపరోస్కోపిక్ సర్జన్,
కాస్మోటిక్ గైనకాలజిస్ట్ & ఒబెస్ట్రిక్
కిమ్స్ కడల్స్, సికింద్రాబాద్
సెర్వికల్ క్యాన్సర్ అనేది గర్భాశయం ముఖద్వారం లేదా గర్భాశయం యొక్క మొదటి భాగంలో వచ్చే క్యాన్సర్. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ఇది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రతి సంవత్సరం, సుమారు 1,24,000 మంది మహిళలు ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు మరియు వారిలో సగం మంది ఒక సంవత్సరం లోపు మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ వల్ల ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ మరణిస్తోంది.
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) రకాలు 16 మరియు 18తో నిరంతర జననేంద్రియ సంక్రమణం ప్రధాన కారకంగా ఉంది.
ఇతర కారణాలు చూస్తే తక్కవు వయసులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములు,ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లల్ని కనడం, ధూమపానం మరియు మద్యపానం ఈ క్యాన్సర్‌కు దారితీసే కొన్ని అంశాలు. ఇది ప్రధానంగా 40 మరియు 50 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలను ప్రభావితం చేస్తుంది.
ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు
1. సాధారణ ఋతుక్రమం కాకుండా యోని నుండి రక్తస్రావం
2. లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం
3. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్)
4. దుర్వాసన మరియు రక్తంతో కూడిన గడ్డలు యోని నుంచి రావడం
5. మూత్రం మరియు మల విసర్జనలో ఆటంకాలు
ఈ సెర్వికల్ క్యాన్సర్ అనేది నివారించదగిన క్యాన్సర్.
2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది.
1. 90% కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు HPV వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి.
2. 70% మంది మహిళలు 35 మరియు 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఖచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి.
3. గర్భాశయ పూర్వ క్యాన్సర్ లేదా క్యాన్సర్‌తో బాధపడుతున్న 90% మంది మహిళలు తగిన చికిత్స పొందాలి.
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, జనవరిని మాసాన్ని "సర్వికల్ క్యాన్సర్ అవేర్‌నెస్ నెల"గా హైలైట్ చేశారు.
సమాచారం తెలుసుకొండి: ఈ క్యాన్సర్ ని నివారించాలంటే మనకు ముందస్తుగా గుర్తించడం అనేది చాలా కీలకం.
స్క్రీనింగ్ చేయించుకోవాలి: 30 సంవత్సరాల వయస్సు నుండి లైంగికంగా చురుకుగా ఉన్న మహిళలందరూ 3 నుండి 5 సంవత్సరాలకు ఒకసారి HPV సంక్రమణ కోసం పరీక్షించేయించుకోవాలి.
టీకాలు వేయించుకోవాలి: 9 నుండి 26 సంవత్సరాల వయస్సు గల బాలికలందరికీ HPV టీకాలు వేయాలని సూచించాలి.
నయం చేయడం కంటే నివారణ ఉత్తమం మరియు క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు.