జాంబియా దేశానికి చెందిన ఏడేళ్ల చిన్నారి అన్న ప్రాణాలు కాపాడింది
* చిన్నవయసులో భయపడకుండా మూలుగ దానం
* 14 ఏళ్ల బాలుడికి అత్యంత తీవ్రమైన సికిల్‌సెల్ డిసీజ్
* జాంబియా నుంచి కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన కుటుంబం
* విజయవంతంగా మార్పిడి చేసిన డాక్టర్ నరేంద్రకుమార్ తోట
హైదరాబాద్, జనవరి 19, 2024: ఆమె వయసు ఏడేళ్లు. సాధారణంగా ఆ వయసులో ఇంజెక్షన్ చేయించుకోవాలంటేనే భయపడి ఏడుస్తారు. కానీ, తన అన్న ప్రాణాలు కాపాడవచ్చని అర్థం చేసుకున్న ఆ చిన్నారి ఏకంగా తన మూలుగ (బోన్‌మారో) దానం చేసింది. అత్యంత తీవ్రమైన సికిల్‌సెల్ డిసీజ్‌తో బాధపడుతున్న 14 ఏళ్ల అన్న ప్రాణాలను ఆమె నిలబెట్టింది. ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశానికి చెందిన ఈ కుటుంబం అక్కడి నుంచి తమ కుమారుడి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వచ్చింది. ఇక్కడ బాలుడికి పలురకాల పరీక్షలతో వ్యాధి నిర్ధారణ చేసిన బిఎంటి విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్, మూలుగ మార్పిడి నిపుణుడు డాక్టర్ నరేంద్రకుమార్ తోట ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
“జాంబియా దేశ రాజధాని లుసాకా నగరానికి చెందిన 14 ఏళ్ల బాలుడికి తీవ్రమైన సికిల్‌సెల్ డిసీజ్ ఉంది. దానివల్ల కీళ్ల నొప్పులు, హిమోగ్లోబిన్ పడిపోవడం, విపరీతమైన నీరసం లాంటి సమస్యలతో రోజువారీ జీవనానికి బాగా ఇబ్బంది తలెత్తింది. సాధారణంగా సికిల్‌సెల్ డిసీజ్‌కు రక్తం మూలుగ నుంచి మూలకణాలు సేకరించి, వాటిని వీళ్లకు ఎక్కించాల్సి ఉంటుంది. దాన్ని ఇవ్వడానికి ఎవరూ అంత త్వరగా ముందుకు రారు. కానీ ఈ కేసులో బాలుడి చెల్లెలు అయిన ఏడేళ్ల బాలిక చాలా ధైర్యంగా సహకరించింది. వాళ్ల దేశంలో అసలు ఈ వ్యాధిని గుర్తించడానికి కూడా సదుపాయాలు తక్కువ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చారు. అక్కడ చాలామందికి మూలుగ మార్పిడి చేస్తే వ్యాధి నయం అవుతుందని తెలియదు. అనేకమంది ఎనీమియా, ఇతర లక్షణాలతో చనిపోతూనే ఉంటారు. అది సికిల్ సెల్ డిసీజ్ అని, దాంతోనే చనిపోయారని కూడా ఎవరికీ తెలియదు. అయితే, ఈ బాబుకు సమస్య తీవ్రంగా ఉండటంతో కిమ్స్ ఆస్పత్రి గురించి తెలిసి ఇక్కడకు వచ్చారు. తల్లి బ్యాంక్ ఉద్యోగి, తండ్రి వ్యాపారంలో ఉన్నారు.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పాపకు కూడా సికిల్‌సెల్ డిసీజ్ ఉన్నా, ఆమెకు తక్కువ తీవ్రత ఉంది. అందువల్ల మూలుగ మూలకణం 100% మ్యాచ్ అయింది. ఇది మార్పిడి చేయడం వల్ల ఆ బాబుకు తీవ్రమైన వ్యాధి కాస్తా తక్కువ తీవ్రత గల వ్యాధిగా మారిపోతుంది. దాంతో ఇక ఎలాంటి సమస్యలూ ఉండవు. అసలు వ్యాధి ఉన్న విషయమే దాదాపు తెలియదు. వాళ్లు జీవితాంతం ఆరోగ్యకరంగానే ఉంటారు.
మార్పిడి ఎలా..?
మూలుగ మూలకణ మార్పిడికి ముందుగా దాత.. గ్రహీతలకు సంబంధించి మ్యాచింగ్ చూడాలి. ఇందుకు జన్యుపరంగా హెచ్ఎల్ఏ టైపింగ్ అనే పరీక్ష చేస్తాం. ఇందులో ఎంఆర్‌డీ (మ్యాచ్డ్ రిలేటెడ్ డోనార్) అంటే.. సమీప బంధువుల నుంచి దాతలు, ఎంయూడీ (మ్యాచ్డ్ అన్ రిలేటెడ్ డోనార్) అంటే.. బయటివారు ఉంటారు. ఇక్కడ ఇద్దరూ ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు కాబట్టి జన్యుపరంగా కలుస్తారు. అదే బయటివారైతే లక్షమందిలోనో, పది లక్షల మందిలోనో ఒకరికి మాత్రమే మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన దేశంలో ఇండియన్ మ్యారో స్టెమ్ సెల్ రిజిస్టర్ అని ఉంటుంది. అందులో పేర్లు నమోదుచేసుకున్నవారితో హెచ్ఎల్ఏ టైపింగ్ పరీక్ష ద్వారా చూస్తే ఎవరివి మ్యాచ్ అయ్యాయో తెలుస్తుంది.
ఎందుకు.. ఎక్కడ వస్తుంది?
సికిల్‌సెల్ డిసీజ్ ఎక్కువగా భద్రాచలం, ఏటూరునాగారం, నల్లమల, రంపచోడవరం లాంటి అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది. మలేరియా ఎక్కువగా ఉన్నప్పుడు.. దాన్నుంచి కాపాడేందుకు ప్రకృతి మనకిచ్చిన సహజసిద్ధమైన రక్షణే సికిల్‌సెల్. కానీ అది మనకు జబ్బుగా మారుతుంది. ప్రపంచపటం మొత్తం చూస్తే, మలేరియా ఎక్కువ తీవ్రంగా ఉన్నచోటల్లా సికిల్‌సెల్ డిసీజ్ ఉంటుంది. వాళ్ల దేశంలో సదుపాయాలు, అవగాహన ఏమీ లేవు కాబట్టి ఇక్కడవరకు రావాల్సి వస్తోంది” అని డాక్టర్ నరేంద్రకుమార్ తోట వివరించారు.