పదేళ్ల బాలుడికి జన్యుకారణాలతో డెన్స్ డిపాజిట్ డిసీజ్
* లక్ష మందిలో ఒకరికే వచ్చే అత్యంత అరుదైన సమస్య
* ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలకు ఇదే మొదటి కేసు
* కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా చికిత్స
కర్నూలు, ఫిబ్రవరి 09, 2023: ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన చరణ్ అనే పదేళ్ల బాలుడికి కాళ్లు, ముఖం వాపు, అధిక రక్తపోటు, దానికితోడు మూత్రంలో రక్తం వచ్చి ఇబ్బంది పడ్డాడు. తొలుత ఎమ్మిగనూరు, కర్నూలు ప్రాంతాల్లో వివిధ ఆస్పత్రులలో చూపించుకుని, అక్కడ ఫలితం లేకపోవడంతో కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. బాలుడిని నిశితంగా పరీక్షించి, సమస్యను గుర్తించిన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కె.అనంతరావు ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
“బాలుడిని పరీక్షించగా, తొలుత మూత్రంలో ప్రోటీన్, రక్తం పోతున్నట్లు తెలిసింది. ప్రోటీన్లు పెద్దమొత్తంలో పోవడంతో రక్తంలో ఆల్బుమిన్ స్థాయి తగ్గిపోయి, దానివల్ల కాళ్ల వాపులు వచ్చాయి. దీన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. మూత్రంలోనే రక్తం పోవడంతో పాటు అధిక రక్తపోటు కూడా ఉంది. దీనివల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటోంది. దీన్ని నెఫ్రిటిక్ సిండ్రోమ్ అంటారు. ఈ బాలుడికి నెఫ్రోటిక్, నెఫ్రిటిక్ సిండ్రోమ్‌లు రెండూ ఉన్నాయి. దాంతో అసలు ఈ సమస్యకు మూలకారణం ఏంటో తెలుసుకోవడానికి అతడికి కిడ్నీ బయాప్సీ చేశాం. దాంతోపాటు ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ అనే ప్రత్యేకపరీక్ష కూడా చేశాం. దాంతో అతడికి డెన్స్ డిపాజిట్ డిసీజ్ అనే అత్యంత అరుదైన సమస్య ఉందని తెలిసింది. దీనికి కారణాలేంటని తెలుసుకునేందుకు యాంటీ ఫ్యాక్టర్ హెచ్ యాంటీబాడీ స్థాయి, సీ3ఎన్ఈఎఫ్ స్థాయి, జన్యు పరీక్షలు చేశాం. బాలుడికి జన్యుపరమైన లోపం ఉన్నట్లు అందులో తెలిసింది. మూలకారణాలు తెలిసిన తర్వాత బాలుడికి ముందుగా ఇమ్యునో సప్రెసెంట్లతో చికిత్స మొదలుపెట్టాం. దానికి చాలా త్వరగా స్పందించాడు” అని డాక్టర్ కె. అనంతరావు వివరించారు.
దక్షిణ భారతంలో ఇప్పటికి 9 కేసులే!
డెన్స్ డిపాజిట్ డిసీజ్ అనేద అత్యంత అరుదైన వ్యాధి. ఇది ప్రతి లక్ష మంది పిల్లల్లో ఒక్కరికే వస్తుంది. దీన్ని కనుక్కునేందుకు ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ అనేది చాలా అత్యవసర పరీక్ష. ఈ వ్యాధి ఉన్న పిల్లలు ఇప్పటివరకు దక్షిణ భారతంలో తొమ్మిదిమందే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలకు రావడం ఇదే మొదటి కేసు. ఇంతకుముందు ఈ వ్యాధి కనుక్కోవాలంటే పరీక్షల కోసమే హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు ఉండటంతో ఇక్కడే అన్నీ సాధ్యమవుతున్నాయి. చాలావరకు కిడ్నీ వ్యాధులను త్వరగా గుర్తిస్తేనే అవి నయమవుతాయి. ఇందుకు కిడ్నీ బయాప్సీ చాలా ముఖ్యం. గుర్తించడంలో ఆలస్యమైతే కిడ్నీల పనితీరు పూర్తిగా దెబ్బతిని, డయాలసిస్ చేయాల్సి వస్తుంది. త్వరగా గుర్తించి, చికిత్స ప్రారంభిస్తే కిడ్నీని కాపాడుకోగలం. ఎవరికైనా కిడ్నీలు సరిగా పనిచేయనట్లు అనుమానం వస్తే వెంటనే నెఫ్రాలజిస్టు వద్దకు వెళ్లాలి. డాక్టర్ అనంతరావుకు ఇప్పటివరకు 500కు పైగా కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం ఉంది.