గుండెపోటు ముప్పును తానే అంచనా వేసిన రోగి
* సహోద్యోగి సాయంతో ఆమోర్ ఆస్పత్రికి..
* 99% బ్లాక్ అయిన గుండె వెసెల్
* సమయానికి గుర్తించి స్టెంట్ అమర్చిన వైద్యులు
* సమస్య రాగానే వైద్యుని వద్దకు వెళ్లడమే ముఖ్యం
హైదరాబాద్, March 1st, 2024: ఎడమ చెయ్యి లాగడం, చెమట పట్టడం, గుండెల్లో ఇబ్బందిగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ఇలా సమయానికి తనకు ఏదో ఇబ్బంది ఉందనిపించి తమ వద్దకు వచ్చిన ఓ వ్యక్తిని అమోర్ ఆస్పత్రి వైద్యులు పరీక్షిస్తే.. అతడి గుండెలోని వెసెల్ ఏకంగా 99% బ్లాక్ అయింది! ఆ విషయం గుర్తించి, వెంటనే స్టెంటు వేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ కార్డియాలజిస్టు డాక్టర్ ఇమ్రాన్ ఉల్ హక్ తెలిపారు.
48 ఏళ్ల వయసున్న మధు అనే వ్యక్తికి మధుమేహం, రక్తపోటు లాంటివి ఏమీ లేవు. ఉదయం 10.30 గంటల సమయంలో కాస్త నొప్పిగా అనిపించడంతో మా దగ్గరకు వచ్చాడు. అతడికి అంతకుముందు గుండెనొప్పి కూడా చాలా తక్కువసేపు మాత్రమే ఉంది. కానీ ఇక్కడకు వచ్చేసరికి బీపీ చూస్తే 180/120 ఉంది. ఈసీజీ సాధారణంగా ఉంది. అందులో గుండెపోటు లక్షణాలు ఏమీ లేవు. మేం 2డీ ఎకో పరీక్ష చేస్తే, అందులో కొంత సమస్య ఉన్నట్లు అనిపించింది. ఒక వాల్వు సరిగ్గా కదలడం లేదు. లక్షణాలను బట్టి చూసి, యాంజియోగ్రామ్ చేయాలని సూచించాం. మొదట్లో రోగి దానికి అంత సుముఖంగా లేరు. కాసేపట్లో మళ్లీ అతడికి గుండెనొప్పి వచ్చింది. చెమట కూడా పట్టింది. ఆ సమయంలో ఆయనకు చాలా ఇబ్బందిగా అనిపించింది. రెండు నిమిషాల తర్వాత అంతా సర్దుకుంది. దాంతో సమయం వృథా చేయకుండా యాంజియోకు రోగి ఒప్పుకొన్నారు. యాంజియోలో చూస్తే.. గుండె వెసెల్ లో 99% పూడిక ఉంది. దాంతో వెంటనే వాళ్ల బంధువులతో మాట్లాడి స్టెంట్ వేశాము.
సాధారణంగా ఎవరికైనా కాస్త గుండెనొప్పి వచ్చినప్పుడు ఈసీజీ తీసుకుని, అంతా సాధారణంగా ఉందనుకుని వదిలేస్తారు. కానీ, నాలుగైదు గంటల వరకు పేషెంటును గమనించాలి. వాళ్ల లక్షణాలను బట్టి అవసరమైతే ఇతర పరీక్షలు చేసి పూర్తిగా అంచనా వేయాలి. మేం ఈ రోగి లక్షణాలను ఒక రోజంతా గమనించాం. ఒకవేళ అతడు ఇదంతా సాధారణమే అనుకుని ఆస్పత్రికి రాకపోయి ఉంటే, చాలా తీవ్రమైన గుండెపోటు వచ్చి ఉండేది. ఆస్పత్రికి వచ్చే దారిలోనే కుప్పకూలిపోతారు.
ఏది గుండెపోటు.. ఏది కాదు
సాధారణంగా 25 ఏళ్లలోపు వయసు ఉండి, మధుమేహం, బీపీ లేకుండా, ధూమపానం అలవాటు లేకుండా ఉన్నవారికి ఇలాంటి లక్షణాలు కనపడినా అది గుండెపోటు కాకపోవచ్చు. అదే 40లు దాటినవారిలో ఇలాంటి లక్షణాలొస్తే వెంటనే అనుమానించాలి. సాధారణంగా ఎడమవైపు కాస్త మంటగా గానీ, చెయ్యి లాగినట్లు గానీ ఉన్నా కూడా అది గుండెపోటు కావచ్చు. నొప్పి దవడల్లోకి కూడా వస్తుంది, వీపు భాగంలోకి వెళ్తుంది. కొద్ది అడుగులు నడిచినా, నొప్పి ఎక్కువ అవుతుంది. చెమటలు పడతాయి. ఇవన్నీ గుండెపోటుకు సంబంధించినవి. గుండెపోటు వచ్చినప్పుడు గుండె కొంత పాడవుతుంది. ఎంత త్వరగా ఆస్పత్రికి వచ్చారన్నదాన్ని బట్టి కోలుకోవడం ఉంటుంది. త్వరగా వస్తేనే కోలుకుంటారు. లేకపోతే ఎక్కువ భాగం పాడైపోతుంది. అప్పుడు ఏం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు అని డాక్టర్ ఇమ్రాన్ వివరించారు.
అసలు ఊహించలేదు: మధు
“నేను ఒక కర్మాగారంలో మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తాను. రోజూలాగే ఆరోజు కూడా ఉదయం 6 గంటలకు డ్యూటీకి వెళ్లాను. ఉదయం 10.30 సమయంలో ఎడమచెయ్యి కాస్త నొప్పిగా అనిపించింది. కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోయింది. పది నిమిషాల తర్వాత మళ్లీ అలాగే వచ్చి కాస్త చెమట పట్టింది. దాంతో ఆస్పత్రికి వెళ్దామనిపించి, సహోద్యోగి సాయంతో 10 నిమిషాల్లోనే అమోర్‌కు వచ్చాను. ఇక్కడ ఎమర్జెన్సీలో పరీక్షలు చేసి, వెంటనే స్టెంట్ వేశారు. వారం రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ చెకప్ కోసం రావాలని చెప్పారు. ఇంత జరుగుతుందని ఊహించలేదు. చికిత్స చాలా బాగా చేశారు.”