మహిళా సదస్సుకు విస్తృత ఏర్పాట్లు
హైదరాబాద్, మార్చ్ 11:: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మంగళవారం నిర్వహించనున్న రాష్ట్ర మహిళా సదస్సు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో సి.ఎస్ మాట్లాడుతూ ఈ మహిళా సదస్సుకు దాదాపు ఒక లక్ష మంది స్వయం సహాయక మహిళా సభ్యులు పాల్గొంటున్నందున వారికి ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సదస్సు ప్రాంగణంలో సరిపడ సీట్లు, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్స్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. ప్రాంగణ సమీపంలో ఆయా జిల్లాల నుండి వచ్చే బస్సులకు పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని, గేట్ ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రాంగణంలో వారికి సిద్ధంగా ఉంచిన సీట్ల వద్దకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. సదస్సులో పాల్గొనే ప్రజా ప్రతినిధులకు, పాల్గొంటున్న మహిళలకు సరిపడ సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆమె పేర్కొన్నారు. మైక్ సిస్టం ఏర్పాటు, బ్యారికేడింగ్, ప్రత్యేక క్యూ లైన్లు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు..
ఈ సమావేశంలో డిజిపి రవి గుప్త, అడిషనల్ డీజీ అభిలాష బిస్త్, సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానీయా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రోనాల్డ్ రోస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ దివ్య, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హైదరాబాద్ , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్లు అనుదీప్ ,గౌతమ్ , సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరి కృష్ణ, సిటీ అదనపు పోలీసు కమిషనర్ విక్రమ్ జిత్ మాన్, రోడ్లు భవనాలు శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.