కర్నూలు కిమ్స్‌లో తొలిసారిగా స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ
* డయాలసిస్ రోగికి గుండె రక్తనాళాల్లో కాల్షియం పూడిక
* రిస్క్ ఉండటంతో పీటీసీఏకు అంగీకరించని ఆస్పత్రులు
* అత్యాధునిక చికిత్సతతో సమస్యకు పరిష్కారం
కర్నూలు, ఏప్రిల్ 16, 2024: వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటూ, దీర్ఘకాల కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 68 ఏళ్ల వ్యక్తికి గుండెల్లో సమస్య తలెత్తింది. అయితే, ఈ కేసులో రిస్కు ఎక్కువ ఉండటంతో యాంజియోప్లాస్టీ చేసేందుకు కొందరు వైద్యులు అంగీకరించలేదు. అత్యాధునిక పరికరాలతో పాటు అత్యంత నైపుణ్యం ఉన్న వైద్యులు ఉండటంతో కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో ఈ రోగికి విజయవంతంగా స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ అనే చికిత్స చేసి, స్టెంట్లు వేసి నయం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట తెలిపారు.
“కర్నూలు జిల్లాలోని కొండాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి, 68 ఏళ్ల వయసున్న ఓంకారం సత్యనారాయణ రాజు దీర్ఘకాల కిడ్నీ వ్యాధి (సీకేడీ)తో బాధపడుతున్నారు. ఆయన వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. ఆయన గుండె కండరాలకు తగినంతగా ఆక్సిజన్‌తో కూడిన రక్తసరఫరా అందకపోవడంతో పాటు విపరీతంగా ఆయాసం వస్తోంది. 2డీ ఎకో చేస్తే గుండె నుంచి రక్తసరఫరా తగ్గిందని తేలింది. దాంతో యాంజియోగ్రామ్ చేసి చూస్తే ఎడమవైపు గుండె రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోయి, రెండు బ్లాక్‌లు ఏర్పడినట్లు తెలిసింది. అయితే, ఈయన కేసులో మూత్రపిండాల వైఫల్యం వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుందని వేరే ఆస్పత్రులలో పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లుమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ (పీటీసీఏ) చేయడానికి అంగీకరించలేదు.
దాంతో ఆయన కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడకు రాగానే తొలుత డయాలసిస్ చేసి, తర్వాత స్కోరింగ్ బెలూన్ అనే ఒక రకం ప్రత్యేకమైన బెలూన్‌తో ఆయనకు పీటీసీఏ చేశాం. ఈ బెలూన్ ఎడమవైపు గుండె రక్తనాళాల్లో పేరుకున్న కాల్షియంను పూర్తిగా పగలగొట్టింది. దాంతో రెండు డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు విజయవంతంగా వేశాం. తద్వారా ఆయన గుండె కండరాలకు రక్తసరఫరా పూర్తిగా పునరుద్ధరించగలిగాం. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో మరో రెండు డయాలసిస్ సెషన్లు అయిన తర్వాత రోగిని డిశ్చార్జి చేశాం. ఈ అత్యాధునిక ప్రక్రియను ఎంప్లాయీస్ హెల్త్ స్కీంలో పూర్తి ఉచితంగా చేయడం గమనార్హం” అని డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట వివరించారు.
ఏమిటీ స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ:
స్కోరింగ్ బెలూన్లలో ప్రత్యేకంగా కాల్షియంను తొలగించడానికి కత్తిరించే టోమ్‌లు లేదా వైర్లు ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా కాల్షియం పేరుకున్నప్పుడు లేదా ఫైబ్రోటిక్ లీజన్స్ ఉన్నప్పుడు ఉపయోగించేందుకే రూపొందించారు. ఇవి వాడటం వల్ల పేరుకున్న కాల్షియం పూర్తిగా పగిలిపోయి, అక్కడ స్టెంట్ వేయడం వీలవుతుంది. రోటాబ్లేషన్, ఆర్థెరెక్టమీ లాంటి ప్రొసీజర్ల కంటే ఇది బాగా సులభం, చవకైనది కూడా. అయితే కాల్షియం కొద్దిపాటి నుంచి ఒక మాదిరిగా పేరుకున్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించగలం. అది బాగా మందంగా పేరుకుపోతే రోటాబ్లేషన్ లాంటివి చేయాల్సి ఉంటుంది.