'మ్యాడ్ స్క్వేర్' నుంచి 'లడ్డు గాని పెళ్లి' గీతం విడుదల
విజయవంతమైన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'ను తీసుకురాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా "లడ్డు గాని పెళ్లి" అనే బరాత్ గీతం విడుదల చేసింది చిత్ర బృందం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా "లడ్డు గాని పెళ్లి"ని ఈ రోజు (సెప్టెంబరు 20) విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'మ్యాడ్' చిత్రంలో భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన "కళ్ళజోడు కాలేజీ పాప" అనే పాట యువతను విశేషంగా ఆకట్టుకొని చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' కోసం ఆయన స్వరపరిచిన "లడ్డు గానీ పెళ్లి" గీతం అంతకుమించిన ఆదరణ పొందుతుందని అనడంలో సందేహం లేదు. తీన్మార్ బీట్ లతో థియేటర్లలో ప్రతి ఒక్కరూ కాలు కదిపేలా ఈ గీతం వుంటుంది. గాయని మంగ్లీతో కలిసి భీమ్స్ సిసిరోలియో స్వయంగా ఈ గీతాన్ని ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. అందరూ మెచ్చుకునేలా 'మ్యాడ్' చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్.. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. 'మ్యాడ్' కోసం పని చేసిన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు 'మ్యాడ్ స్క్వేర్' కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి.. ప్రముఖ ఛాయాగ్రాహకుడు షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు' అన్నారు.
శ్రీకరా స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.