పెదనాన్న రవితేజ సపోర్ట్ నాకు ఎప్పుడూ వుంటుంది: హీరో మాధవ్
కథానాయకుడు రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశాడు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రవితేజ గారు ఇండస్ట్రీలో ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు. నన్ను కూడా ఆయన ఎంకరేజ్ చేశారు. ఈ ఫంక్షన్ కు పిలిచినప్పుడు మాధవ్ ను సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి వచ్చాను. నేనే కాదు ఇండస్ట్రీలో చాలా మంది మాధవ్ ను సపోర్ట్ చేస్తారు. సీసీఎల్ కు వెళ్లినప్పుడు రఘు గారు ఒక సాంగ్ చూపించారు. అది "మిస్టర్ ఇడియట్" లో మాధవ్ చేసిన సాంగ్. చాలా బాగుంది ఎవరు హీరో అని అడిగితే మా అబ్బాయి అని చెప్పారు. టైటిల్ మిస్టర్ ఇడియట్ అని చెప్పగానే నాకు ఇడియట్ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చాయి. నేను కూడా చంటిగాడిలా ఫీలయ్యేవాడిని. ఆ సినిమాలో హీరోయిజం కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. మాధవ్ సినిమాకు మిస్టర్ ఇడియట్ అనే పేరు పెట్టడం బాగుంది. చాలా ఎనర్జిటిక్ గా నటించాడు మాధవ్. రవితేజ గారి స్థాయికి మాధవ్ చేరుకోవాలని కోరుకుంటున్నా' అన్నారు.
హీరో మాధవ్ మాట్లాడుతూ ఈ సినిమా విడుదల కొంత ఆలస్యమైనా పర్పెక్ట్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రంలో అనూప్ గారి మ్యూజిక్ హైలైట్ అవుతుంది. మా పెదనాన్న రవితేజ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. చిత్రాన్ని నవంబరులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.