ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టండి

Related image

డల్లాస్ (యుఎస్ఏ): పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ డల్లాస్‌లో భేటీ అయ్యారు. పెరోట్ జూనియర్ రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, డాటా సెంటర్, ఎనర్జీ రంగాల్లో  విభిన్న పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో ఆయన అగ్రగామిగా ఉన్నారు. అలయన్స్ టెక్సాస్‌తో సహా యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని విజయవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెరోట్ కీలక భూమిక వహించారు. 27,000 ఎకరాల మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీ అలయన్స్ టెక్సాస్‌ను అభివృద్ధి చేయడంలో రాస్ పెరోట్ జూనియర్ విశేషమైన గుర్తింపు పొందారు. రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ ఏవియేషన్‌ రంగాల్లో పెరోట్ రూపొందించిన వెంచర్లు అమెరికాలో బిలియన్ల మేర ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపాయి. తన ప్రాజెక్ట్‌లలో అధునాతన సాంకేతికతలు, అంతరిక్ష ఆవిష్కరణలతో పెరోట్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు.  

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ‘‘ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్ & పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మీ వినూత్న విధానాలు మా రాష్ట్ర ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి తోడ్పడతాయి. మీ దార్శనిక ప్రాజెక్టులైన అలయన్స్‌టెక్సాస్ వంటివి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల వృద్ధి వ్యూహంతో బాగా సరిపోతాయి. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీలోని తీరప్రాంతంలో అనువైన వాతావరణం నెలకొని ఉంది. ఏపీలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లు, పెద్ద పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించండి. 

విశాఖపట్నంలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఏరోస్పేస్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు నెరేవేర్చడం, ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో మీ అనుభవం, సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. మా ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టం ఉంది. ఈ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రదేశం. నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, ఏరోస్పేస్‌లో గ్లోబల్ ప్లేయర్‌లను ఆకర్షించడానికి మీ వంటి అనుభవజ్ఞుల  నైపుణ్యం మాకు ఉపయోగపడుతుంది. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పీపీపీ ప్రాతిపదికన భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించండి’’ అని పెరోట్ జూనియర్‌ను మంత్రి లోకేశ్ కోరారు. ఆయ వెంట బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ ఉన్నారు.

More Press Releases