వికటకవి’ వెబ్ సీరిస్ ట్రైలర్ విడుదల!
నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సీరిస్ ‘వికటకవి’. ఈ సీరిస్ నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. తాజాగా మేకర్స్ ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు.
టీజర్‌ను గమనిస్తే.. హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. అమరిగిరిలోని దేవతల గట్టుకి వెళ్లటానికి ప్రజలు భయపడుతుంటారు. దాన్ని దేవత శపించిన గ్రామమని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. అయితే ఆ గ్రామానికి చెందిన ప్రొఫెసర్ మాత్రం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పని చేస్తుంటాడు. అమరగిరిలో ఎవరూ చేదించలేని సమస్య ఉందని భావించి, దాని పరిష్కారానికి తన శిష్యుడైన రామకృష్ణను పంపిస్తాడు. అమరగిరి ప్రాంతానికి వెళ్లిన రామకృష్ణ ఏం చేస్తాడు.. అక్కడి సమస్యను ఎలా గుర్తిస్తాడు.. ఎలా పరిష్కరిస్తాడు.. అనే అంశాలను ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రామకృష్ణకు ఈ ప్రయాణంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అమరిగిరి ప్రాంతంతో రామకృష్ణకు ఉన్న అనుబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా...
నరేష్ అగస్త్య మాట్లాడుతూ ‘‘వికటకవిలో డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నటించటం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. నాకు చాలెంజింగ్‌గా అనిపించటంతో పాటు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. రామకృష్ణ అనే యంగ్ డిటెక్టివ్ ఓ నిజాన్ని కనిపెట్టటానికి తెలివిగా ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడు.. ఎలా విజయాన్ని సాధిస్తాడనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. పాత్రలో చాలా డెప్త్ ఉంటుంది. ఇందులో రామకృష్ణ ఊరిలోని సమస్యను పరిష్కరించటమే కాదు.. తన సమస్యను కూడా పరిష్కరించుకుంటాడు. తప్పకుండా నా పాత్ర అందరినీ మెప్పిస్తుంది. నేను కూడా స్ట్రీమింగ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మేం క్రియేట్ చేసిన మిస్టరీ ప్రపంచం ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ ‘‘వికటకవి వంటి డిటెక్టివ్ సిరీస్‌ను నిర్మించటం మేకర్స్‌గా సంతోషాన్నిచ్చింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన తొలి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇది. థ్రిల్లింగ్ కథాంశమే కాదు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన గొప్ప సంస్కృతిని ఈ సిరీస్ ఆవిష్కరిస్తుంది. అలాగే రానున్న రెండు సినిమాలు మట్కా, మెకానిక్ రాకీ చిత్రాల కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఈ రెండు చిత్రాలు జీ5తో అనుబంధం ఏర్పరుచుకున్నాయి. జీ 5 వంటి ఓటీటీతో కలిసి పని చేయటం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. కచ్చితంగా మా సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు.
దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ ‘‘వికటకవి సిరీస్ అమరగిరి అనే ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. అక్కడి మిస్టీరియస్, థ్రిల్లింగ్ అంశాలే కాదు.. గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను కూడా ఇది ఎలివేట్ చేసేలా రూపొందించాం. 1970 ప్రాంతంలో తెలంగాణలో సంస్కృతి, సాంప్రదాయాలను చూపించాం. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ సహా నటీనటులు, సాంకేతిక నిపుణుల అద్భుతమైన సహకారంతో మంచి సిరీస్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. కథలో ఆసక్తికరమైన మలుపులు, కథ సాగే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌లో చూసింది కొంతే. సిరీస్‌లో ఇంకా ఆసక్తికరమైన అంశాలెన్నో ఉంటాయి. నవంబర్ 28న ఈ థ్రిల్లింగ్ డిటెక్టివ్ సిరీస్‌ను చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.