డాలస్ లోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే యార్లగడ్డ
డాలస్, టెక్సాస్: గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు డాలస్ (ఇర్వింగ్ నగరం) లో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని మంగళవారం సందర్శించి బాపూజీకి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ “ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తగా నా ప్రస్థానం ఇక్కడే డాలస్ నగరంలో కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభం అయిందని, ఈ పరిసర ప్రాంతాలు, ప్రజలు అందరూ సుపరిచతమేనని, కేవలం భారతదేశంలోనే గాక ప్రపంచ ప్రజల మన్ననలను పొందిన ఏకైక నాయకుని మహాత్మాగాంధీ విగ్రహం ఇక్కడ స్థాపించడం ముదావహం అన్నారు. దాదాపు నాల్గు దశాబ్దాలగా ఎన్నో సంస్థలకు నాయకత్వం వహిస్తున్న ప్రవాస భారతీయనాయకులు డా. ప్రసాద్ తోటకూర ఇక్కడి అధికారులను ఒప్పించడంలో చూపిన చొరవ, నాల్గున్నర సంవత్సరాల అవిరళ కృషివల్ల ఈ మహాత్మాగాంధీ స్మారకస్థలి నిర్మాణం సాధ్యమైందని, ఇది స్థానిక ప్రవాస భారతీయులందరికీ గర్వకారణమైన ప్రధాన కేంద్రంగావడం, డా. తోటకూర ప్రసాద్, ఈ మహత్మాగాంధీ విగ్రహశిల్పి బుర్రా శివ వరప్రసాద్ ఇద్దరూ కూడా నా నియోజకవర్గ వ్యక్తులుగావడం నాకు మరింత గర్వంగా ఉందన్నారు.”
మహాత్మాగాంధీ స్మారకస్థలి వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “విజయవంతంఅయిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తగా డాలస్ లో స్థిరపడి, సుఖమయ జీవితాన్ని వదులుకుని, మాతృదేశంపై అనురక్తితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రవేశించి, ప్రస్తుతం ప్రతిష్టాత్మక గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికై అక్కడి ప్రజలకు సేవలందించడంలో తన పూర్తిసమయాన్ని వెచ్చిస్తున్న యార్లగడ్డ వెంకట్రావుని ప్రసాద్ తోటకూర అభినందించారు. చిరకాలంగా పరిచయంఉన్న మిత్రులు వెంకట్రావును నా జన్మస్థలం, విద్యాబుద్దులు నేర్చుకున్న పట్టణం అయిన గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యునిగా ఈరోజు ఇక్కడకు ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు.”
మహాత్మాగాంధీ స్మారకస్థలి కార్యదర్శి రావు కల్వాల ప్రత్యేక శ్రద్ధతో బాపూజీకి పుష్పాంజలి ఘటించడానికి విచ్చేసిన శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మహాత్మాగాంధీ స్మారకస్థలి గవర్నింగ్ బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు, వ్యాపారవేత్త సురేష్ గొట్టిపాటితో సహా పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.