సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన సీఎస్!
తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా రూపుదిద్దటానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆశయ సాధనలో పాలు పంచుకొంటున్నందుకు ఎంతో ఆనందనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సోమవారం సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని సంజీవయ్య పార్క్ లో హెచ్.ఎం.డి.ఏ ఏర్పాటు చేసిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో, సీఎస్ తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు మొక్కలు నాటారు. పొన్న, మోదుగ, నాగలింగం మొక్కలను నాటారు. సీఎస్ పొన్న చెట్టును నాటారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకువచ్చి పంచాయతీలకు, మున్సిపాలిటీలకు 10 శాతం గ్రీన్ బడ్జెట్ ను కేటాయించి మొక్కలు నాటేకార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. నాటిన మొక్కలు 85 శాతం బతికేలా ప్రజాప్రతినిధులకు బాధ్యత నివ్వడంతో పాటు, మొక్కలను సంరక్షించని వారిని అవసరమైతే విధుల నుండి తొలగించేలా చట్టంలో ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ లో పాల్గొనే అవకాశంతో పాటు, తెలంగాణలో అడవులు 33 శాతం పెంచడంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారులు హరితహారానికి ప్రాధాన్యతనిచ్చి తెలంగాణను మోడల్ స్టేట్ గా రూపుదిద్దాలన్నారు. హైదరాబాద్ నగరంలో గ్రీనరీని పెంచి వాతావరణాన్ని కాపాడాలన్నారు. సి.యం గారు రాష్ట్రానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. వారి ఆశయం ప్రతి ఒక్కరికి స్పూర్తి నిస్తుందన్నారు.
ప్రభుత్వ ముఖ్యసలహాదారు డా.రాజీవ్ శర్మ మాట్లాడుతూ పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడటంలో భాగస్వాములు కావాలన్నారు. పట్టణ ప్రాంతాలలో అర్బన్ పార్కులు, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటడానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రతి సంవత్సరం 30 కోట్లకు పైగా మొక్కలను నాటుతున్నామన్నారు. గతంలో జాతీయజెండా ఆవిష్కరణకు సంజీవయ్య పార్కును సందర్శించామన్నారు. ఇది శాఖల కార్యక్రమం కాదని అందరు స్వచ్ఛంగా పాల్గొనాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతకోసం పెద్ద ఎత్తున మొక్కలను నాటాలన్నారు. వైద్య,ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హరితహారంలో పాల్గొనాలన్నారు.
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా అధికారులందరు మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితరాష్ట్రంగా రూపుదిద్దటానికి భాగస్వాములు కావాలన్నారు. నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంరక్షించాలన్నారు.
జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ తమ పరిధిలో 1.26 లక్షల మొక్కలు నాటుతున్నామన్నారు. మున్సిపల్ శాఖ కమీషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో 8.84 లక్షల మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యకార్యదర్శులు రజత్ కుమార్, వికాస్ రాజ్, సునీల్ శర్మ, జగధీశ్వర్ లతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.
పౌరసరఫరాల భవన్ లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్న పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పి. సత్యనారాయణ రెడ్డి
పౌరసరఫరాల ఆవరణలో మొక్కలు నాటుతున్న పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులు, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్
అధ్యక్షులు నాగేందర్, తదితరులు.