ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్ మీట్ కు సిద్ధమైన తెలంగాణ క్రీడాకారులు
భువనేశ్వర్ లో జరగనున్న 25వ ఫారెస్ట్ స్పోర్ట్ మీట్- 2020
తెలంగాణ నుంచి పాల్గొననున్న 67 మంది క్రీడాకారులు
స్పోర్ట్ కిట్ లను పంపిణీ చేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ
ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్ మీట్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటి, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు 25వ జాతీయ ఫారెస్ట్ స్పోర్ట్ మీట్ జరగనుంది. దీనిలో తెలంగాణ నుంచి 67 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులైన పీ.రఘువీర్, లోకేష్ జైస్వాల్, మోహన్ చంద్ర పర్గెయిన్ తో పాటు డీఎఫ్ఓ, రేంజ్, సెక్షన్, బీట్ అధికారులు, సిబ్బంది వివిధ ఈవెంట్స్ లో పోటీలో ఉన్నారు. రన్నింగ్, జావెలిన్ త్రో, రైఫిల్ షూటింగ్, గోల్ఫ్, షటిల్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ లాంటి ఈవెంట్స్ లో తెలంగాణ క్రీడాకారులు పాల్గొంటున్నారని, గత నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్ మీట్ లో పథకాలు సాధించిన వారిని, జాతీయ పోటీలకు పంపుతున్నామని పీసీసీఎఫ్ ఆర్.శోభ వెల్లడించారు. అందరు క్రీడాకారులకు స్పోర్ట్ కిట్ లను రాజేశ్వర్ తివారి, శోభ చేతుల మీదుగా అందించారు.
కార్యక్రమంలో స్పోర్ట్ మీట్ కో ఆర్డినేషన్ అధికారి ఎం.పి. పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.