తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు: గవర్నర్ తమిళిసై పూర్తి ప్రసంగ పాఠం!

Related image

"గౌరవనీయులు శాసనమండలి అధ్యక్షులు, గౌరవ అసెంబ్లీ స్పీకర్, గౌరవ శాసనమండలి, శాసనసభ సభ్యులకు హృదయ పూర్వక నమస్కారాలు. 

ఆరు దశాబ్దాల పాటు పోరాటం కొనసాగించి, తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగింది. చాలా స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించి, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవడం మనందరికీ గర్వకారణం. 

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడే, సాకారమైన స్వరాష్ట్రానికి సారధి అయి ముందుకు నడిపించడం తెలంగాణకు కలిసొచ్చిన అంశం. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం ఫలితంగా కుదేలైన అన్ని రంగాలకు పునరుత్తేజం కల్పించడానికి దార్శనిక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరేళ్లుగా ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. 

రాష్ట్రం ఏర్పడిన నాడున్న పరిస్థితులతో నేటి పరిస్థితులను ఒక్కసారి పోల్చి చూసుకుంటే ఇంత తక్కువ వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి, యావత్ దేశం అబ్బురపడుతున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికున్న పరిస్థితులు:

2014 జూన్2న తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో అన్ని రంగాల్లో దుర్భర పరిస్థితులుండేవి. తెలంగాణ రాష్ట్రం తొలినాళ్లలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఎదుర్కొన్నది. నిత్య విద్యుత్ కోతలతో రాష్ట్రం గాఢాంధకారంలో ఉండేది. తెలంగాణ ఏర్పడే నాటికి పేద ప్రజలకు కనీస జీవన భద్రత లేకుండా పోయింది. ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు నిత్యకృత్యంగా ఉండేవి. రెండొందల రూపాయల చాలీచాలని పెన్షన్ పేదల అవసరాలు తీర్చలేకపోయింది. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయి ఉండేది. నిరాశా నిస్పృహకు లోనైన వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దుర్భర పరిస్థితులు నెలకొని ఉండేవి. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందక, కల్తీ విత్తనాలతో, ఎరువులతో రైతులు సతమతమయ్యారు.

పంటల సమయంలో రైతులు పెట్టుబడి కోసం పడరాని పాట్లు పడేవారు. అధికవడ్డీ చెల్లించి పెట్టుబడిని సమకూర్చుకోవాల్సిన దుర్భర పరిస్థితులు వుండేవి. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల సాగునీటి లభ్యత అగమ్య గోచరంగా ఉండేది. సమైక్య రాష్ట్రంలో నిరంతరం కొనసాగిన చెరువుల విధ్వంసం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఆరు, ఏడు, ఎనిమిదివందల అడుగుల లోతుకు బోర్లు వేసినా నీళ్లు లభించని దుస్థితులు వుండేవి. రోజుకు నాలుగైదు గంటలు కూడా విద్యుత్ సరఫరా లేకపోవడం, తద్వారా పంటలు ఎండిపోయేవి.

అతి కష్టం మీద పండించిన కొద్దిపాటి పంటలకు మార్కెట్లో సరైన ధర లభించేది కాదు. ఇటువంటి అనేక సమస్యలకు ఆలవాలంగా మారిన వ్యవసాయ రంగం కారణంగా తెలంగాణ రైతాంగంలో వ్యవసాయం దండగ అనే అభిప్రాయం ప్రబలి వుండేది. వ్యవసాయ అనుబంధ రంగాలైన చేతిపనులు, కులవృత్తులు కూడా కూలిపోయి ప్రజలు వలస బతుకులు బతికిన విషయం మన కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అటు వ్యవసాయం, ఇటు కులవృత్తులు రెండూ దెబ్బతినడంతో  రాష్ట్రం అవతరించే నాటికి తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనై అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా వుండేది. 

రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ సమాజం అనుభవించిన మంచినీటి గోస వర్ణనాతీతం.  విద్యావైద్య రంగాలు కూడా కుదేలయ్యాయి. ఆర్థిక స్థోమతలేని నిరుపేదలు సహితం ఆస్తులు అమ్మి, అప్పులపాలై, ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి కాన్పులు చేయించుకునే దుర్భర పరిస్థితులు వుండేవి. నగరాల్లో, పట్టణాలలో, బస్తీకి ఒక పేకాట క్లబ్, గ్రామాలలో గుడుంబా స్థావరాలు అనేకం వుండేవి. శాంతి భద్రతలు అదుపులో వుండేవి కాదు. కల్తీలు, నకిలీలు యధేచ్చగా కొనసాగేవి. తెలంగాణ భాషా సంస్కృతుల మీద తీవ్రమైన దాడి జరిగేది. మన పండుగలకు, దేవాలయాలకు, ఏమాత్రం ప్రాధాన్యత వుండేది కాదు.

ఇటువంటి దుర్భర పరిస్థితులు నెలకొన్న సందర్భంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి 2014 జూన 2 వ తేదీన ఉద్యమనాయకుడి సారధ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనా పగ్గాలను చేపట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రానికి వున్న వనరులు, వసతులు, అవసరాలు, అనుకూలతలు, ప్రతికూలతలు, బలాలు, బలహీనతలు, అన్నీ అంచనా వేసుకుని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాలికలు రూపొందించుకుని, రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 

సాంఘిక సంక్షేమం:
పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అత్యంత మానవీయ కోణంలో ఆలోచించి, తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల బతుకుకు భద్రత కల్పించాయి. 
  • దారిద్ర్య రేఖకు దిగువన (బిపిఎల్) ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి లక్షన్నరకు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచింది. దీంతో  ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సంక్షేమ పథకాలు అందుకోవడానికి అర్హత సాధించారు.

  • ఆసరా పెన్షన్ల ద్వారా ఇస్తున్న 2,016 రూపాయల పెన్షన్లతో పేదలందరు  ఎవరిమీద ఆధారపడకుండా ఎంతో సంతోషంగా బతుకుతున్నారు. వికలాంగుల పెన్షన్ ను 500 రూపాయల నుంచి 3016 రూపాయలకు పెంచి ప్రభుత్వం  అందిస్తున్నది. దేశంలో లక్షలాదిగా ఉన్న బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో ఇవ్వకపోయినా, తెలంగాణ రాష్ట్రంలో నెలకు 2016 రూపాయల చొప్పున పెన్షన్ అందుతున్నది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధి బాధితులకు కూడా ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. వృద్ద్యాప్య పెన్షన్ అర్హత వయసును 65సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన వారందరికీ ఆసరా పెన్షన్లు అందుతాయనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నారు.

  • కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్ల పెండ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం లక్షా 116 రూపాయల చొప్పున అందిస్తున్నది. 

  • గతంలో రేషన్ షాపుల ద్వారా ఒక్కొక్కరికీ నాలుగు కిలోల బియ్యం మాత్రమే అందితే, నేడు ఆరు కిలోల చొప్పున ఇంట్లో ఎంత మంది సభ్యులుంటే అంత మందికి ఎలాంటి పరిమితులు లేకుండా రూపాయికి కిలో చొప్పున ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తున్నది. 

  • విద్యార్థులకు పాఠశాలల్లో, హాస్టళ్లలో ప్రభుత్వం సన్నబియ్యంతో వండిన అన్నం వడ్డిస్తున్నది. 

  • దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్ విద్యాలయాలను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్వహిస్తున్నది.  

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖ ప్రసవాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కేసీఆర్ కిట్స్ పథకం అమలు చేస్తున్నది. 

  • యువత ఉపాధికోసం నడుపుకునే ఆటోలు, రైతులు ఉపయోగించే ట్రాక్టర్లపై రవాణా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. 

  • ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేసింది. ఆయా వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించి, ఖర్చు చేస్తున్నది. 

  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం చేతి పనులు, కులవృత్తులకు అవసరమైన ఆర్థిక ప్రేరణ అందించింది. 75 శాతం సబ్సిడీపై గొల్ల, కురుమలకు పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో ఉచితంగా చేప పిల్లలను వేసి, వాటిని పట్టి అమ్ముకునే హక్కులను మత్స్యకారులకు కల్పించింది. తాడిచెట్లపై ఉన్న చెట్ల రకం (పన్ను)ను ప్రభుత్వం రద్దు చేసింది. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా వారికి మార్కెట్ సదుపాయం కల్పిస్తున్నది. రంగులు, రసాయనాలు, నూలు కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ  ఇవ్వడం వల్ల నేత కార్మికులకు పెట్టుబడి వ్యయం తగ్గింది. నాయీ బ్రాహ్మణులకు మోడర్న్ సెలూన్లు పెట్టుకోవడానికి, రజకులకు బట్టలు ఉతికే  అధునాతన యంత్రపరికరాలు  కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం  ఆర్థిక సహాయం అందిస్తున్నది. సంచార కులాలు, ఆర్థికంగా బాగా వెనుకబడిన తరగతులు తదితర వర్గాల వారి కోసం ప్రభుత్వం  ఎం.బి.సి కార్పొరేషన్ ను  ఏర్పాటు చేసింది. బిసి కులాల వికాసానికి ఉపయోగపడే విధంగా ఉండడానికి హైదరాబాద్ నగరంలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. 

  • తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారంతో పాటు ప్రతీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.

  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం ఆరు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నది. 

  • ప్రమాద వశాత్తూ మరణించిన గీత కార్మికులు, మత్స్యకారులకు ప్రభుత్వం ఆరు లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తున్నది. 

  • వడగండ్లు, భారీ వర్షాలు, వరదల లాంటి  ప్రకృతి వైపరీత్యాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు, పిడుగుపాటుతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 6 లక్షలు  ఆర్థిక సహాయం అందిస్తున్నది. 

  • గుడుంబా తయారీపై ఆధారపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేసి, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించింది.

  • ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అంగన్ వాడీ కేంద్రాల్లో గర్ణిణీలు, బాలింతలు, శిశులకు ప్రతీరోజు పోషకాహారం అందిస్తున్నది. 

  • ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాలలోపు స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించింది. జి.ఓ.నెంబర్ 58 కింద రెగ్యులరైజేషన్ ప్రకారం రాష్ట్రం మొత్తం లక్షా 25 వేల మందికి భూమి పట్టాలు పంపిణీ జరిగింది. 

  • డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, 5 లక్షల ప్రమాదబీమా సౌకర్యాన్ని కల్పించింది. 

  • లాయర్లు, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది.

  • పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నెలకొల్పింది. దూప దీప నైవేధ్యం పథకం ద్వారా దేవాలయాల్లో పూజలు నిర్వహించే పూజారులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వం క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తున్నది.

  • మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజమ్ లకు నెలకు 5వేల చొప్పున భృతి అందిస్తున్నది. 

  • పేద యువతకు  స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా, రూ.50వేల వరకు, వంద శాతం సబ్సిడీతో  ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది. లక్ష రూపాయల రుణం తీసుకునే వారికి 80 శాతం సబ్సిడీ అందిస్తున్నది. రూ.2 లక్షలలోపు యూనిట్ కు 70 శాతం, రూ.5 లక్షలలోపు యూనిట్ కు 60 శాతం సబ్సిడీని అందిస్తున్నది.

  •  ఎస్సీ, ఎస్టీలు తమ ఇండ్లకు ఉపయోగించే విద్యుత్తును 101 యూనిట్ల వరకు ఉచితంగా అందించబడుతున్నది. గృహ వినియోగం కేటగిరీలో రూ.70 కోట్లకుపైగా ఉన్న ఎస్టీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది. గిరిజనులపై గతంలో నమోదు చేసిన విద్యుత్ విజిలేన్స్ కేసులన్నింటినీ ఎత్తివేసింది. 

  • సెలూన్లకు డొమెస్టిక్ కేటగిరీ విద్యుత్ సరఫరా చేయబడుతున్నది.  

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిభా ఫూలే పేర్లతో ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం అమలు చేస్తున్నది.

  • హోంగార్డులు, అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, ఐకెపి, సెర్ప్, నరేగా ఉద్యోగులు, 108 సిబ్బంది, 104 సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, విఆర్ఎలు, విఎఓలు, కాంట్రాక్టు లెక్చరర్లు, సిఆర్టిలు, అర్చకులు తదితర ఉద్యోగులందరి వేతనాలను ప్రభుత్వం పెంచింది. రేషన్ డీలర్ల కమిషన్ పెంచింది. 

  • పోలీసు ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటయించబడ్డవి. రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డులకు దేశంలో ఎక్కడా లేనంత అత్యదిక వేతనం తెలంగాణ రాష్ట్రంలో అందించబడుతున్నది. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనపు రిస్క్ అలవెన్సు అందిస్తున్నది. విధి నిర్వహణలో మరణించిన పోలీసు అమరుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్న ప్రభుత్వం భారీగా పెంచింది. 

  • సింగరేణి  కార్మికులకు లాభాల్లో 28 శాతాన్ని బోనస్ గా ప్రభుత్వం అందిస్తున్నది. ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 22,667 మంది ఆర్టిజాన్ల సర్వీసును ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 

  • సంక్షేమరంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబడింది. తెలంగాణ రాష్ట్రంలో నేడు పేదలు భవిష్యత్తుపై ఎంతో విశ్వాసంతో ముందడుగు వేస్తుండడం శుభ పరిణామం. 


విద్యుత్ విజయాలు:

విద్యుత్ రంగంలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా, చాకచక్యంగా వ్యవహరించింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో అనితర సాధ్యమైన విజయాలు సాధించింది. నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగం అధికంగా కలిగిన రాష్ట్రంగా నిలబడింది. 23 జిల్లాల సమైక్య రాష్ట్రంలో 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రంలో అంతకు మించి, 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చింది.  ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ ఏర్పడినప్పటికీ ఎక్కడా ఏమాత్రం కోత, లోటు లేకుండా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేసుకోగలగడం తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘన విజయం.

నేడు రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసుకోగలుగుతున్నాము. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా, రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 7778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం కలిగివుంటే, నేడు తెలంగాణ రాష్ట్రానికి 16,246 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. 

వ్యవసాయ రంగాభివృద్ధి:

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గత పాలకులు సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల, అసలు ఓ విధానమంటూ లేకపోవడం వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది. వ్యవసాయ రంగాన్ని కుదుట పర్చేందుకు, అన్నదాతల్లో ఆశావహ దృక్పథం కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చింది. రైతులకు కావల్సిన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సకాలంలో అందిస్తున్నది. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు అంటగట్టే వారిపై పిడి యాక్టు కింద చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం వల్ల తనకున్న భూమినంతా సాగులోకి తీసుకొచ్చి రైతులు అధిక దిగుబడులు సాధించగలుగుతున్నారు. 

నీటి పారుదల రంగం - ప్రాజెక్టుల నిర్మాణం:

కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేసింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీరందిస్తున్నది. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్దరించింది. దీనివల్ల తెలంగాణలో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. ప్రపంచంలోకెల్లా అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు దశల వారీగా పూర్తవుతున్నది.శరవేగంగా నడుస్తున్న పనులు తెలంగాణ ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తవుతుంది. ఈ ఏడాది వర్షాకాలం నుంచి గోదావరి నది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టిఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టుకు 365 రోజుల పాటు నీరందించడానికి సమ్మక్క బ్యారుజి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ వేసవిలోనే ఈ బ్యారేజి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుత దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతంలోనే సీతామరామ ప్రాజెక్టుకు నీరందించడానికి, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేవిధంగా ప్రభుత్వం సుమారు 40 టిఎంసిల సామర్థ్య్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజిని మంజూరు చేసింది. త్వరలోనే ఈ బ్యారేజి పనులు ప్రారంభం అవుతాయని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 

తెలంగాణాలో నీటిపారుదల రంగం అద్భుతమైన పురోగతి సాధించిందని చెప్పడానికి, ఇప్పటికిప్పుడు మన కళ్లముందు సాక్షాత్కారిస్తున్న నిలువెత్తు నిదర్శనం ఈ వేసంగిలో వరి సాగులో తెలంగాణ సాధించిన పురోగతి. తెలంగాణలో యాసంగి పంట సమయంలో వరి పంట సాధారణ విస్తీర్ణం 17,08,397 ఎకరాలు. నీటి పారుదల రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి వల్ల ఈ యాసంగి సీజన్ లో వరి పంట సాగు 38,19,419 ఎకరాలుగా వ్యవసాయశాఖ నమోదు చేసింది. యాసంగి సమయంలో 123.5 శాతం పెరిగిన వరి విస్తీర్ణం రాష్ట్రం సాధించిన విజయానికి సంకేతంగా నిలుస్తున్నది. 

రైతుబంధుతో పెట్టుబడి సాయం:

పంట సమయంలో పెట్టుబడి కోసం రైతులు పడే అగచాట్లను రూపుమాపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక పథకం ‘రైతుబంధు’ ఇప్పుడు భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమైంది. రైతులకు అండగా ఉండాలనే సత్సంకల్పంతో ఇప్పుడు ఎకరానికి పదివేల చొప్పున రెండు విడతల్లో అందిస్తున్నది. రైతుబంధు పథకం ఇప్పుడు దేశానికి ఓ రోల్ మోడల్ గా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన ముందడుగుతో స్పూర్తి పొందిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ‘రైతుబంధు’ తరహా పథకాలు అమలు చేయడం భారతదేశ రైతాంగం తలరాతను మార్చే పురోగామిక మలుపు. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో ‘రైతుబంధు’ ఒకటని ఐక్యరాజ్యసమితి ప్రకటించడం మన రాష్ట్రానికి, మన రైతులకు గర్వకారణం.  

రైతుబీమాతో రైతు కుటుంబాలకు దీమా:

దేశంలో మరెక్కడా లేని విధంగా ‘రైతుబీమా’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. రైతు ఏ కారణంతో మరణించినా సరే, ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల సహాయాన్ని కేవలం పది రోజుల్లోనే ప్రభుత్వం అందిస్తున్నది. 

వ్యవసాయ శాఖను బలోపేతం చేసేందుకు ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. రైతులు పరస్పరం చర్చించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం చేపట్టింది.

రైతు బంధు సమితులు:

ఇప్పటి వరకు రాష్ట్రంలో రైతు సమన్వయ సమితులుగా వ్యవహరించిన వ్యవస్థను ఇప్పటినుంచి రతు బంధు సమితులుగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రైతాంగాన్ని ఒక దృఢమైన సంఘటిత శక్తిగా తయారు చేయడం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.  రైతు  విత్తనం వేసిన దగ్గర నుంచి మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతు బంధు సమితులు కీలక బాధ్యతలు పోషించే విధంగా ప్రభుత్వం త్వరలోనే కార్యాచరణను ప్రారంభిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.

మిషన్ భగీరథతో మంచినీటి సమస్యలకు పరిష్కారం:

తెలంగాణ ప్రజలు దశాబ్దాల తరబడి ఎదుర్కున్న మంచినీటి సమస్యను ప్రభుత్వం చాలా తక్కువ వ్యవధిలోనే శాశ్వతంగా పరిష్కరించింది. రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందుతున్నది. మన రాష్ట్రంలో అమలవుతున్న మంచినీటి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి దేశంలోని 11 రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే మిషన్ భగీరథ పనులపై అధ్యయనం చేశాయి. అన్ని రాష్ట్రాలు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయడం మంచిదని నీతిఆయోగ్ సిఫారసు చేయడం మన పథకానికి దక్కిన ప్రశంస.

మెరుగైన ప్రజారోగ్యం:

తెలంగాణ రాష్ట్రంలో ప్రజావైద్యం గణనీయంగా మెరుగుపడింది. ప్రభుత్వ దవాఖానాలలో కావల్సిన వైద్య పరికరాలు, మందులు, ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మందుల కొనుగోలుకు కేటాయించే బడ్జెట్ ను మూడింతలు పెంచి, ప్రజలకు అవసరమైన మందులను ఉచితంగా అందివ్వడానికి అందుబాటులో ఉంచింది.  

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వాసుపత్రిలో కూడా డయాలసిస్ కేంద్రం గానీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ గానీ, స్టాండర్డైజ్డ్ లేబర్ రూమ్ గానీ, గర్భిణీలను తీసుకొచ్చే వాహనం కానీ, చికిత్స పొందుతూ మరణించిన వారిని ఇండ్లకు తరలించే వాహనం కానీ లేదు. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40 ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను,  20 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను, 305 స్టాండర్డైజ్డ్ లేబర్ రూములను, గర్భిణీలను ఆసుపత్రులకు తీసుకురావడానిక 200 అమ్మఒడి వాహనాలను, మరణించిన వారిని ఉచితంగా ఇంటికి పంపడానికి 50 పరమపద వాహనాలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పి.హెచ్.సి. కూడా నేషనల్ క్వాలిటీ అక్రిడిటేషన్ స్టాండర్డ్ కలిగిలేదు. కానీ నేడు రాష్ట్రంలోని 84 పి.హెచ్.సి.లు ఎన్.క్యూ.ఎ.ఎస్. స్థాయిని పొంది, దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది. 

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 22 మాత్రమే న్యూ బార్న్ కేర్ సెంటర్లుంటే, వాటి సంఖ్యను ప్రభుత్వం 42కు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే కొత్తగా ఆరు న్యూ బార్న్ కేర్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. మరో 14 సెంటర్లు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. 

రాష్ట్రంలో గతంలో కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా 4 మెడికల్ కాలేజీలు ప్రారంభించి, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యను 9కి పెంచింది. 

కేసీఆర్ కిట్స్ పథకం వల్ల ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగడంతోపాటు, సమర్థవంతంగా మాతా, శిశు సంరక్షణ  జరుగుతున్నది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రసవ సమయంలో లక్షకు 92 మంది తల్లులు మృత్యువాతన పడేవారు. ఆ సంఖ్య ఇప్పుడు రాష్ట్రంలో 76కు పడిపోయింది. ప్రసవ సమయంలో శిశువుల మరణాలు ప్రతీ వెయ్యిమందికి 39 నుంచి 29కి తగ్గింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల శాతం 22 శాతం పెరిగింది. తెలంగాణ వచ్చే నాటికి 68 శాతం మంది మాత్రమే వ్యాధి నిరోధక టీకాలు వేసుకునే వారు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం 96 శాతం ఇమ్యునైజేషన్ సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్ పేషంట్ల  సంఖ్య 20 శాతం పెరిగింది. 

‘కంటివెలుగు’ పేరుతో ప్రపంచంలోనే అతి భారీ స్థాయిలో ఐ స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం అరుదైన రికార్డు సాధించింది. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కోటి 54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 41 లక్షల మందికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందివ్వడం జరిగింది. 

కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించడానికి ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుంది.

హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేదలు ఎక్కువుండే బస్తీల్లో  ప్రభుత్వ పరంగా ఆరోగ్య సేవలు అందించడం కోసం బస్తీ దవాఖానాల సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలోని ప్రతీ డివిజన్ లో కనీసం రెండు బస్తీ దవాఖాలనాలు ఏర్పాటు చేయాలని, పేదలు ఎక్కువుండే బస్తీల్లో అదనంగా దవాఖానాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా హైదరాబాద్ నగరంలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని, అందులో పేదలకు ఉచితంగానే పరీక్షలు జరిపి, మందులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేశంలో మెరుగైన ప్రజావైద్యం అందిస్తున్నమొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కావడం మనందరికీ స్పూర్తిదాయకమైన విషయం.

పరిపాలనా సంస్కరణలు:

దేశ చరిత్రలో గతంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణను అత్యంత శాస్త్రీయంగా చేపట్టింది. రాష్ట్రంలో 10 జిల్లాలను 33 జిల్లాలు చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 73 కి పెంచుకున్నాం. 459 మండలాలను 590 మండలాలు చేసుకున్నాం. మున్సిపాలిటీల సంఖ్యను 52 నుంచి 128 కి పెంచుకున్నాం. కార్పొరేషన్ల సంఖ్యను 6 నుంచి 13కు పెంచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. గతంలో 8,690 గ్రామ పంచాయతీలుంటే, ఇప్పుడు తెలంగాణలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. శాంతి భద్రతలను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు అత్యంత శాస్త్రీయ పద్ధతిలో పోలీసుశాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది.

తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం రెండు పోలీస్ కమిషనరేట్లు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా ఏడు పోలీస్ కమిషనరేట్లన్లను నెలకొల్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది పోలీస్ కమిషనరేట్లున్నాయి. పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 164కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 719కు, పోలీస్ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 815కు ప్రభుత్వం పెంచింది. 

కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానికుల హక్కులు పరిరక్షించటం కోసం, ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.  లోకల్ కేడర్ ఉద్యోగాలలో 95 శాతం అవకాశాలు స్థానికులకే లభించే విధంగా చట్టం చేసింది. డిస్ట్రిక్ట్ కేడర్ తో పాటు ఏడు జోన్లు, రెండు  మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది.

కొత్త విధానాలు – కొత్త చట్టాలు:

అధికారులు, ప్రజా ప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచడం కోసం, స్థానిక సంస్థలను క్రియాశీలం చేయడం కోసం ప్రభుత్వం కొత్త గ్రామీణ విధానం, కొత్త పట్టణ విధానం తీసుకొచ్చింది. కొత్తగా పంచాయతీ రాజ్, కొత్త మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చింది. తెలంగాణ గ్రామాలు, పట్టణాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలు, పట్టణాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఎవరి ఊరిని వారు బాగు చేసుకోవాలనే స్పూర్తిని రగిలించడానికి రెండు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ఫలితాలు మన కళ్ల ముందు ఉన్నాయి.

తెలంగాణలో నేడు 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. 3,146 ఎస్టీ ప్రాంతాలు ప్రత్యేక పంచాయతీలుగా అవతరించాయి. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తీసుకున్న నిర్ణయాల కారణగా దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయతీ నేడు సొంత ట్రాక్టర్ కలిగి ఉంది. ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటయింది. ప్రతీ గ్రామంలో డంప్ యార్డు, స్మశాన వాటికలు ఏర్పాటవుతున్నాయి. పల్లెలు బాగుపడే కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం కలెక్టర్లకు ఎక్కువ బాధ్యతలు, అధికారాలు ఇచ్చింది. గతంలో ప్రభుత్వానికి, మంత్రులకుండే అధికారాలను తొలగించుకుని, వాటిని కలెక్టర్లకు ధారాదత్తం చేసింది.

తెలంగాణ పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తీసుకొచ్చిన తెలంగాణ పట్టణ విధానం అమలు కోసం ప్రభుత్వం మొన్న 4వ తేదీ వరకు రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించింది. పట్ణణాల్లో పచ్చదనం- పరిశుభ్రత పెంచే పనులు చేయడంతో పాటు, ప్రణాళికాబద్ధంగా పట్టణాలు అభివృద్ధి కావడానికి అవసరమైన పట్టణ ప్రగతి ప్రణాళికలు రూపొందించాయి.

గ్రామాల అభివృద్ధి కోసం ప్రతీ నెలా 339 కోట్లు, పట్టణాల అభివృద్దికి ప్రతీ నెలా 148 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందిస్తున్నది. 

అవినీతికి, జాప్యానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వని విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త భూ పరిపాలనా విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది.

పారిశ్రామికాభివృద్ది:

తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులిచ్చే టి.ఎస్ - ఐ.పాస్  సింగిల్ విండో విధానం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది. పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తున్నది. ఇప్పటి దాకా 12,427 పరిశ్రమలకు ఈ విధానం ద్వారా అనుమతులు పొందాయి. వీటివల్ల 2లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి  వచ్చినయి. 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.

ఐ.టి రంగంలో మేటి:

ఐ.టి రంగంలో తెలంగాణ రాష్ట్రం బలమైన శక్తిగా ఎదిగింది. విశ్వ విఖ్యాత ఐటి కంపెనీలు తెలంగాణలో తమ శాఖలు ప్రారంభిస్తున్నాయి. విరివిగా పెట్టుబడులు పెడుతున్నాయి.  2013-14 ఆర్థిక సంవత్సరంలో ఐ.టి ఎగుమతుల విలువ 57వేల కోట్ల రూపాయలుంటే, 2018-19 నాటికి లక్షా 9 వేల కోట్లకు పెరిగింది. గడిచిన ఏడాది ఐటి ఎగుమతుల వృద్దిరేటులో దేశ సగటు 8.9 శాతం కాగా, తెలంగాణ వృద్దిరేటు 16.89 శాతం కావడం ఐటి రంగంలో సాధించిన ప్రగతికి సంకేతం. మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఐటి రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరింపచేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. 

వేగంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం:

నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్ రూం ఇళ్ళను నిర్మించి ఇచ్చే పథకం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నది.   డబుల్ బెడ్ రూం ఇళ్ళ పథకం క్రింద ఇప్పటి వరకు 2, 72, 763 ఇళ్ళను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇండ్ల నిర్మాణం వేగంగా సాగుతున్నది. 

సజావుగా శాంతిభద్రతలు:

శాంతి భద్రతలు సజావుగా ఉంటేనే పౌర జీవనం ప్రశాంతంగా సాగుతుందని, ప్రగతి నిరాఘాటకంగా జరుగుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నది. పోలీసు శాఖను కాలానుగుణ అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దడంతో పాటు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ శాఖకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ వస్తున్నది. శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణలో 6 లక్షల సిసి కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. దేశం మొత్తం మీద ఉన్న సిసి కెమెరాల్లో 66 శాతం  తెలంగాణలోనే ఉన్నాయి.  అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ లో నిర్మిస్తున్న అంతర్జాతీయ స్థాయి పోలిస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానున్నది.

మహిళలకు భద్రత కల్పించే విషయంలో తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా షి టీమ్స్ అత్యంత క్రియాశీలకంగా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాయి. 

తెలంగాణది గంగా జమునా తహజీబ్:

తెలంగాణది గంగా జమునా తహజీబ్. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు శతాబ్దాల తరబడి ఇక్కడి కలిసి మెలసి సోదర భావంతో జీవిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల మధ్య ఐక మత్యాన్ని పెంచడానికి, లౌకిక స్పూర్తిని కాపాడడానికి త్రికరణ శుద్ధిగా పాటుపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. అన్ని మతాల విశ్వాసాలను ప్రభుత్వం గౌరవిస్తుంది. అన్ని మతాల పండుగలను ఆదరిస్తుంది. మత సామరస్యానికి విఘాతం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, కుట్రలను చేధించే విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని కూడా స్పష్టం చేస్తున్నాను. 

ఆర్థిక పరిస్థితులు:

దేశంలో గడిచిన కొద్ది నెలలుగా కొనసాగుతన్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడింది. అయినప్పటికీ పటిష్టమైన పరిపాలనా విధానాలతో, కట్టుదిట్టమైన ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ రాష్ట్రం నిలదొక్కుకోగలుగుతున్నది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆదాయ వృద్ధిరేటు తిరోగమనంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఆ దుస్థితిలో లేకపోవడం గుడ్డిల్లో మెల్ల అన్నట్లు కనిపించే అంశం. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్ధికాంశాలలో కఠినమైన క్రమశిక్షణ పాటించాలని నిర్ణయించుకుంది. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను నెరవేరుస్తూ, ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని పథకాలను యధాతధంగా అమలు చేస్తూ, స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకుంటూ అత్యంత ఆశావహ దృక్పథంతోనే ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది.    

అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత సాధిస్తూ, ప్రజల అవసరాల ప్రాతిపదికన పాలన సాగుతున్నది. కాబట్టే ప్రజలు సందర్భం వచ్చిన ప్రతీ సారీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, పాలనను ప్రజాస్వామ్య పద్ధతిలో బలపరుస్తూ వస్తున్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న అచంచల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలియ చేస్తున్నాను. 

“Urupasiyum Ovappiniyum Serupagayum

Sera Thiayalvathu Nadu”

“ఆకలి దప్పులు లేని, అనారోగ్యాలు లేని, శతృత్వ లేని రాజ్యమే గొప్ప రాజ్యం’’


జై హింద్    -  జై తెలంగాణ".

More Press Releases