పిగ్ బ్రీడింగ్ పాలసీని రూపొందించాలి.. వినోద్ కుమార్ ను కోరిన కెనడా, తెలంగాణ ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిగ్ బ్రీడింగ్ పాలసీని రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కెనడా దేశం పోలార్ జెనెటిక్స్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడ్ వాల్, తెలంగాణ రాష్ట్ర సౌజన్య ఫార్మ్స్ అధినేత సాగర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కోరారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో వినోద్ కుమార్ ను కలిసి వారు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
రాష్ట్ర పిగ్ బ్రీడింగ్ పాలసీ ఖరారు అయితే లైవ్ పిగ్స్, వాటి వీర్యాన్ని కెనడా నుంచి దిగుమతి చేసుకునేందుకు, పిగ్స్ మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు వాణిజ్య పరమైన లైసెన్సు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుందని ఆల్ఫ్రెడ్ తెలిపారు. పిగ్ బ్రీడింగ్ పాలసీని రూపొందించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిగ్ బ్రీడింగ్ పాలసీని ఖరారు చేసి కేంద్రానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కెనడా, తెలంగాణ ప్రతినిధులు బోయినపల్లి వినోద్ కుమార్ ను కోరారు.
పిగ్ ఫార్మింగ్ కోసం తెలంగాణ ఎంతో అనువైన ప్రాంతమని, తెలంగాణలో వాతావరణం సమశీతోష్ణస్థితి కలిగి ఉందని ఆల్ఫ్రెడ్ వివరించారు. పిగ్ ఫార్మింగ్ ద్వారా వాటి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ ల రూపంలో ఆదాయం సమకూరుతుందని ఆయన తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన బోయినపల్లి వినోద్ కుమార్.. పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. సత్వరమే పిగ్ బ్రీడింగ్ పాలసీని రూపొందించాలని వినోద్ కుమార్ సూచించారు.