ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ లాక్ డౌన్ ను విజయవంతం చేయాలి: తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్
కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో... ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ...లాక్ డౌన్ విజయవంతం చేయాలి
లాక్ డౌన్ వల్ల క్వారంటైన్ నుంచి డిశ్చార్జి అవుతున్నారు
వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు
లాక్ డౌన్ అమలు చేయడంలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారు
గ్రామాల్లో కూడా ప్రజలు బాగా సహకరిస్తున్నారు.
కొంతమంది ఆదేశాలు అతిక్రమించి ప్రమాదంగా తయారవుతున్నారు
గ్రామాల్లో ముళ్ల కంచెల వల్ల అత్యవసర సేవలకు విఘాతం కలుగుతోంది
ములుగు, మహబూబాబాద్ జిల్లా పర్యటనల్లో
కరోనా నివారణపై తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్/ములుగు, మార్చి 27 : ప్రపంచాన్నంతటిని నేడు లాక్ డౌన్ చేసి, విశ్వ మహమ్మారిగా మారిన కరోనా వైరస్ కట్టడికి అమలు చేస్తున్న నివారణ చర్యలను మహబూబాబాద్, ములుగు జిల్లాలో పర్యవేక్షించి, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ లాక్ డౌన్ ను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మహబూబాబాద్ జిల్లాలోని కంబాలపల్లిలో పారిశుద్ధ్య పనులు, కరోనా శానిటైజేషన్ చర్యలను పరిశీలించి, గూడురు కమ్యునిటీ హెల్త్ సెంటర్ లో కరోనా వైరస్ బాధితుల కోసం తీసుకునే ముందస్తు చర్యలను, మల్లంపల్లి చౌరస్తా వద్ద లాక్ డౌన్ అమలు విధానాన్ని నేడు మంత్రి పర్యవేక్షించారు.
కరోనా వైరస్ నివారణలో, చికిత్స చేయడంలో భాగంగా వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని, అదేవిధంగా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్ డౌన్ అమలు చేయడంలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, జిల్లా యంత్రాంగం ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు బాగా పనిచేస్తోందని అభినందించారు.
అన్ని విభాగాల అధికారులతో పాటు ప్రజలు కూడా బాగా సహకరించడం వల్ల నేడు క్వారంటైన్ లో ఉన్నవారు కూడా డిశ్చార్జి అవుతున్నారని, ఇదే స్పూర్తిని ఏప్రిల్ 14వ తేదీ వరకు కొనసాగించాలని విజ్ణప్తి చేశారు.
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు చాలా వరకు స్వచ్ఛందంగా కొన్ని గ్రామాల్లో బాగా సహకరిస్తుండగా, మరికొన్ని చోట్ల ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి, వారికి, ఇతరులకు కూడా ప్రమాదకరంగా తయారవుతున్నారని చెప్పారు. ఇలాంటి వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా...అది తప్పని పరిస్థితి అన్నారు.
కొన్ని గ్రామాల్లో ఇతరులు ఎవరూ తమ గ్రామానికి రాకూడదనే సదుద్దేశ్యంతో ముళ్ల కంచెలు వేస్తున్నారని, దీనివల్ల ఆ గ్రామంలో పౌరులకు అత్యవసర సేవలు అందించే విషయంలో అధికారులకు ప్రమాదకరంగా ఆ కంచెలు తయారవుతున్నాయని చెప్పారు.
అనంతరం ములుగు జిల్లాలో మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, జిల్లా కలెక్ట్ కృష్ణ ఆదిత్య, ఇతర అధికారులు నేతలు పాల్గొన్నారు.