తెల్ల రేషన్ కార్డు ఉండి బియ్యం అవసరం లేనివారికి చేతులెత్తి కోరుతున్నా.. ఆ బియ్యం కార్డు లేని పేదవారికి అందివ్వండి: తెలంగాణ మంత్రి విజ్ఞప్తి
కరోనా వైరస్ కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాల చర్యలు చేపట్టారు
మన కోసం, మన గ్రామ, పట్టణం కోసం లాక్ డౌన్ పాటిద్దాం
రైతులు ఎవరూ అధైర్య పడొద్దు.. కొనుగోలు కేంద్రాలు పెంచైనా పండించిన ప్రతి గింజ కొంటాం -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కట్టడి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని చాలా వరకు కట్టడి చేయగలిగామని,దీనిపై కామారెడ్డి జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా పనిచేస్తోందన్నారు. కామారెడ్డి జిల్లాలో లాక్ డౌన్ పక్కగా అమలు అవుతుందని, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో విదేశాల నుంచి,ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారిని హోమ్ క్వారన్ టైన్ లో ఉంచడం వలన ఒక్కరికీ కూడా కరోనా పాజిటివ్ కేస్ నమోదు కాలేదన్నారు.జిల్లాలో నమోదైన 8 కరోనా పాజిటివ్ కేసుల్లో 7 కేసులు ఢిల్లీ మర్కజ్ వెళ్ళి వచ్చిన వారి వలన రావడం జరిగిందన్నారు. ఇంకా 10 నుండి 15 రోజులు మన కోసం,మన కుటుంబం కోసం,మన గ్రామం,మన పట్టణం కోసం లాక్ డౌన్ పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.
మర్కజ్ వెళ్ళి వచ్చిన వారి ద్వారా బాన్సువాడ లో కరోనా పాజిటివ్ రావడం జరిగిందని, ఇతరులకు వ్యాధి రాకుండా అన్ని రకాల చర్యలు జిల్లా యంత్రాంగం చేపట్టిందని చెప్పారు. బాన్సువాడ లో నమోదైన 7 పాజిటివ్ కేసుల వ్యక్తులతో సంబంధమున్న 90 మందిని పరీక్షలకు పంపించామని, అందులో 27 మంది పలితాలు వచ్చాయన్నారు. అందులో 24 మందికి నెగిటివ్ రాగా,ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు.ఇంకా 63 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందన్నారు. జిల్లాలో 15 నుండి 20 రోజుల వరకు సరిపడా నిత్యావసర వస్తువుల నిలువలు ఉన్నాయని,జిల్లాలో రేషన్ ద్వారా 10,400 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా మంగళవారం వరకు 9000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసామని వెల్లడించారు.
తెల్లకార్డు లబ్ధిదారులై ఉండి, రేషన్ బియ్యం అవసరం లేని వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా అని..ఆ బియ్యం రేషన్ కార్డు లేని అర్హులైన పేదవారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్య పడవద్దని, కొనుగోలు కేంద్రాలు పెంచి మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శరత్,ఎస్పీ శ్వేత, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు,ఇతర అత్యవసర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.