లాక్‌డౌన్‌ను గౌరవిద్దాం... కరోనాను నిర్మూలిద్దాం: తెలంగాణ మంత్రి వేముల

Related image

  • కరోనా వ్యాప్తి నివారణలో అహర్నశలు శ్రమిస్తున్న మంత్రి

  • భీమ్‌గల్, బాల్కొండ కంటైన్మెంట్ క్లస్టర్ల పరిశీలన

  • ఇండ్లలోంచి బయటకు రావొద్దని ప్రజలకు వినతి

  • ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్ జిల్లా: కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రజలందరూ ఇండ్లలోనే ఉండి సహకరించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. బుధవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణంలో, బాల్కొండ మండల కేంద్రంలో కరోనా నేపథ్యంలో ఏర్పాటుచేసిన కంటైన్మెంట్ క్లస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలందరూ లాక్‌డౌన్‌ను గౌరవించి.. కరోనాను నిర్మూలించేందుకు లాక్‌డౌన్‌ను గౌరవించాలని కోరారు. 

ప్రజలు ఇండ్లలోంచి బయటకు రాకుండా ఉంటూ సహకరిస్తే చాలన్నారు. మిగతా బాధ్యతనంతా ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉన్న వారు ఇంటి నుంచి బయటకు రావొద్దని, వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇంటి వద్దకే తీసుకువచ్చి అదికారులు అందజేస్తారని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా ఏర్పాటు చేసి వ్యాధి వ్యాప్తి లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో ఇద్దరికి, భీమ్‌గల్ పట్టణంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని హైదరాబాద్‌కు తరలించామన్నారు. బాల్కొండలో కరోనా సోకిన ఇద్దరు మరో 25 మందిని కలిశారన్నారు. భీమ్‌గల్‌లో కరోనా సోకిన వ్యక్తి ఇతరులను కలిశాడన్నారు. ఇలా అతనితో దగ్గరగా కలిసిన వారిలో 53 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఇతరులకు వ్యాధి సోకరాదనే ఉద్ధేశంతో కంటైన్మెంట్ క్లస్టర్‌లో నలుగురు అధికారులతో ప్రజలకు ఇండ్ల వద్దకే సేవలందించే ఏర్పాట్లు చేశామన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన లాక్‌డౌన్‌ను ప్రజలందరూ ఎంతో క్రమశిక్షణతో పాటించడంతో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు. కానీ దూరదృష్టవశాత్తు ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లిన వారితో కరోనా ఇక్కడికి వచ్చిందని తెలిపారు. అధికారులు, సిబ్బంది కరోనా వ్యాప్తి నివారణ కోసం 24  గంటలు పని చేస్తున్నారని అభినందించారు. హోమ్‌గార్డు నుంచి ఏసీపీ వరకు, ఆశ కార్యకర్త నుంచి ై జిల్లా వైద్యాధికారి వరకు, వీఆర్‌ఏ నుంచి ఆర్డీవో వరకు అహర్నిశలు సేవలందిస్తున్నారన్నారు. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, పట్టణాల్లో కౌన్సిలర్లు సేవలు అందిస్తున్నారన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 1,167 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. మీ బిడ్డగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా చేతులెత్తి నమస్కరిస్తూ  ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా మీ గల్లీని, మీ గ్రామాలను, మీ ఏరియాను, మీ పట్టణాలను వ్యాధి బారి నుంచి కాపాడుకోవాలని కోరుతున్నానని అన్నారు. 

- కంటైన్మెంట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి...:

భీమ్‌గల్ కంటైన్మెంట్ క్లస్టర్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. కరోనా సొకిన వ్యకి ఇంటి నుంచి చుట్టూ అర కి.మీ నుంచి కి.మీ పరిధిలో ప్రధాన రోడ్ల వెంట తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడక్కడ పలువురు స్థానికులతో మాట్లాడారు. మీ కోసమే ఈ ఏర్పాట్లు చేశామని గుర్తించాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లతో వ్యాధి బారిన పడకుండా ఎలా ఉండవచ్చో వివరించారు. ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నింటినీ అధికారులకు సమాచారం ఇస్తే సమకూరుస్తారని వారితో చెప్పారు. ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తాను అవసరమైన ఏర్పాట్లు చేయిస్తానని భరోసా ఇచ్చారు. భీమ్‌గల్‌లోనే అవసరమైతే క్వారంటైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

బాల్కొండలో కంటైన్మెంట్ క్లస్టర్ ప్రాంతంలో పర్యటిస్తూ మైకు ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. కరోనా బారి నుంచి బయట పడటానికి పాటించాల్సిన పద్ధతులను వివరించారు. భీమ్‌గల్, బాల్కొండలో కంటైన్మెంట్ క్లస్టర్లలో, మిగతా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి నివారణ చర్యలు ఎలా సాగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి తనకు కరోనా పాజిటివ్ ఉందని తెలియకపోవడంతో భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో కొంత మందిని కలిసినట్లు సమాచారం ఉందన్నారు. బాబాపూర్‌లో క్వారంటైన్ ఏర్పాటు చేయాలని ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ  సిద్ధం చేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులకు సూచించారు. వైద్య సిబ్బందికి గ్లౌజులు, ఇతర కిట్లు అందించే ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్, ఆర్డీవో శ్రీనివాస్‌లకు సూచించారు.

మీడియా మిత్రులు తమ విధి నిర్వహణ సందర్భంగా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అంతకు ముందు వేల్పూర్‌లో తన నివాసంలో నియోజకవర్గంలో కరోనా నివారణ పై కొనసాగుతున్న చర్యల పై ఉన్నతాధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి...:

కరోనా వ్యాప్తి నివారణ కోసం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహిస్తూనే ఇటు ప్రజల్లోనూ భయపడాల్సిన అవసరం లేదంటూ భరోసా కల్పిస్తున్నారు. మంగళవారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కేంద్రాల్లో కరోనా పై సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేసిన మంత్రి బుధవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గం పై సమీక్షలు నిర్వహించారు. కరోనా ప్రభావం ఉన్న భీమ్‌గల్, బాల్కొండలో పర్యటించి ప్రజల్లో స్థైర్యం నింపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పూర్తిగా ఈ కార్యక్రమాల్లో మంత్రి నిమగ్నమయ్యారు.

More Press Releases