విలేకరుల సేవలు ఎనలేనివి: తెలంగాణ మంత్రులు
- సమాజం కోసం పరితపించే వారి నిస్వార్థ సేవలు నిరుపమానం
- కొడకండ్లలో మీడియా విలేకరులకు నిత్యావసర సరుకులు, మాస్కులు, సానిటైజర్లు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్
ఈ సందర్భంగా మంత్రలు మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అత్యంత కష్ట కాలంలో ఉన్నాన్నారు. ప్రభుత్వం ప్రజల యోగ క్షేమాల కోసం నిరంతరం పని చేస్తున్నదన్నారు. సిఎం కెసిఆర్ అందరికంటే ముందే లాక్ డౌన్ ప్రకటించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కరోనా నిర్మూలన విషయంలో ప్రజలను చైతన్య పరుస్తూ, అవగాహన పెంచుతూ, ప్రపంచ సమాచారాన్ని సమాహారంగా అందిస్తూ, ఎప్పటికప్పుడు నిరంతరం పని చేస్తున్న విలేకరుల శ్రమని తక్కువ అంచనా వేయలేమన్నారు. అయితే విలేకరులు కూడా జాగ్రత్తగా పని చేయాలని, కరోనా కవరేజీ సమయాల్లో ఆ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో అదృష్ట వశాత్తు సమస్యలు పెద్దగా లేవని, నగరాల్లో మాత్రం వైరస్ తీవ్రత ఉందని, దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు వహించాలని మీడియాని కోరారు. ఇదే సమయంలో ఇంటిని, పిల్లల్ని, కుటుంబాల్ని కూడా పట్టించుకోవాలని హితవు పలికారు. కరోనా కవరేజీలో బిజీగా ఉంటున్న మీడియా మిత్రులకు ఎంతో కొంత ఊతంగా ఉండే విధంగా నిత్యావసర సరుకులు, మాస్కులు, సానిటైజర్ల పంపిణీ చేస్తున్నట్లు వారు ప్రకటించారు.
అంతకుముందు ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ అత్యంత మేధావి అని, ఆయన వల్లే ఇవ్వాళ దేశం ప్రజాస్వామికి సర్వసత్తాక దేశంగా మనగలుగుతున్నదని చెప్పారు. రాజ్యాంగాన్ని రచించి, అనేక భాషలు, శాస్త్రాలు నేర్చిన గొప్ప దార్శనికుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.