'ఈ-పూజ' లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి: ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ: కరోనా వైరస్ కోవిడ్19 ను నిరోధించు చర్యలలో భాగంగా కేంద్ర, రాష్ట్రాలు మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సందర్భములో దేవాలయము నందు భక్తులకు అనుమతించడం లేదని, ఆయా దేవాలయాల్లో నిత్యకైంకర్యాలు పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల అభీష్టం మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో 'ఈ-పూజ'లను నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. భక్తులు 'ఈ-పూజ' లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో కిచెన్ కెపాసిటీ, ఆర్థిక వనరుల అనుమతి మేరకు నిరుపేదలకు అన్నప్రసాద పంపిణీపై ఆయా జిల్లా కలెక్టర్ తో చర్చించి, అవసరం మేరకు వారి ద్వారా అన్నప్రసాద పంపిణీ చేయాలని దేవదాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు.
అన్ని ప్రధాన దేవాలయాల్లో, ఇతర చోట్ల సాంప్రదాయం ప్రకారం, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేపట్టవలసిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. మే నెల 3 తర్వాత అన్ని ప్రధాన దేవాలయాల ప్రవేశ ద్వారాల వద్ద Disinfection tunnel ను, థర్మల్ స్కాన్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కానిపాక దేవాలయం, విజయవాడ దేవాలయాల అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.