మంచి ధాన్యానికి తరుగుతీసే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు బుక్ చేసి లైసెన్సులు రద్దు చేస్తాం: తెలంగాణ మంత్రి వేముల
- రైస్ మిల్లర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
- మే 7 వరకు ప్రజలు తప్పనిసరిగా లాక్ డౌన్ పాటించాలి
- నిత్యావసర వస్తువులు, మటన్, చికెన్ అమ్మేవారు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజ్ లు వాడాలి
- కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం బాగా పని చేస్తుంది
- ఐకేపీ సంఘాల ద్వారా గుడ్డ మాస్కులు తయారు చేయించి జిల్లా ప్రజలందరికి అందజేయాలని కలెక్టర్ ను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి జిల్లాలో కరోనా వ్యాధి విస్తరించట్లేదన్నారు మంత్రి.అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేస్తున్నారన్నారు.
జిల్లాలో మొత్తం 12 పాజిటివ్ కేసులకు ట్రీట్మెంట్ తరవాత 5 గురుకి నెగెటివ్ వచ్చి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారని.. మిగతా 7 గురికి ట్రీట్మెంట్ జరుగుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జిల్లా ప్రజలు తప్పనిసరిగా లాక్డౌన్ ని మే 7 వ తారీఖు వరకు సంపూర్ణగా పాటించాలన్నారు. ఇంకా కొన్ని రోజులు ప్రజలు ఇండ్లలోనే ఉండి కరోనా వైరస్ ని జిల్లా నుండి పూర్తిగా తరిమి కొడుదామని పిలుపునిచ్చారు.
ఐకేపీ సంఘాల ద్వారా కామారెడ్డి జిల్లా ప్రజలకు సరిపడా గుడ్డ మాస్కులను తయారు చేయించాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.
ఈ మాస్క్ లను దాతల ద్వారా కానీ గ్రామ పంచాయతీల ద్వారా కొనుగోలు చేయించి గ్రామంలో ప్రతి ఒక్కరికి రెండు గుడ్డ మాస్కులను అందజేయాలని సూచించారు. నిత్యావసర సరుకులు కానీ మెడికల్ షాప్ లు కానీ, మటన్ చికెన్ సెంటర్ లలో అమ్మేవారు తప్పని సరిగా మాస్కులు, చేతికి గ్లౌస్ లు ధరించాలని, అలా చేయని వారిపై కేసులు బుక్ చేయాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలు ఇండ్ల నుండి వస్తే మాస్క్ లు కచ్చితంగా ధరించాలన్నారు.
షాప్ లలో నిత్యావసర వస్తువులు కొనేవారు కూడా మాస్కు లు విధిగా ధరించాలని నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మంచి ధాన్యానికి కూడా అడ్డగోలుగా తరుగు తీసే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టి, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని మీరు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.శరత్, ఎస్పీ శ్వేతా రెడ్డి, జేసీ యాదిరెడ్డి, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.