మొబైల్ అన్నపూర్ణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 24: లాక్డౌన్ సమయంలో పనులు లేక ఏ కుటుంబం ఆకలితో ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతో మొబైల్ క్యాంటీన్ల ద్వారా కూడా అన్నపూర్ణ భోజనాన్ని అందిస్తున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాజేంద్రనగర్ సర్కిల్లోని ఆరాంఘర్ చౌరస్తాలో దినసరి కూలీలకు మొబైల్ అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా వచ్చిన భోజనాన్ని పంపిణీ చేశారు.
ఆకలిని తీర్చుకునేందుకు జీహెచ్ఎంసీలో నెలకోల్పిన కోవిడ్-19 కంట్రోల్ రూం కాల్ సెంటర్ 040-2111 11 11 ను ప్రజలు నేరుగా సంప్రదిస్తున్నారని తెలిపారు. కంట్రోల్ రూం ద్వారా అన్నపూర్ణ భోజన పథకం నిర్వాహకులతో పాటు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని భోజనాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. అలాగే ట్విట్టర్ ద్వారా కూడా వచ్చిన విజ్ఞప్తులకు స్పందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి శ్రీనివాస్‌రెడ్డి, చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, డిప్యూటి కమిషనర్ డి. ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.