విద్యారంగంపై తెలంగాణ సీఎస్ ఎస్.కె.జోషి సమీక్షా!
జాతీయ నూతన విద్యావిధానం 2019 కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి, పటిష్ఠతకు దోహదపడే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఉండేలా ముసాయిదా నివేధికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సచివాలయంలో విద్యారంగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిత్తల్, పాఠశాల విద్యా కమీషనర్ విజయ్ కుమార్, ఇంటర్మీడియేట్ బోర్డు కమీషనర్ అశోక్, TSCHE వైస్ ఛైర్మన్ వి. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లడుతూ ప్రాధమిక విద్యకు సంబంధించి అంగన్ వాడీ కేంద్రాలను వినియోగించుటతో పాటు అవసరమైన శిక్షణను అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఒకేషనల్ ట్రైనింగ్ కు ప్రాధాన్యత నివ్వాలన్నారు. నాణ్యమైన విద్య అందాలన్నారు. పరిశోధనలకు ప్రాముఖ్యతనివ్వాలన్నారు. విద్యారంగానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు తీసుకోవలసిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి స్కూల్ కాంప్లెక్స్ లు, యూనివర్సిటీలు, కాలేజీల హేతుబద్ధీకరణ, 3 నుండి 6 సం.ల పిల్లలకు విద్యను అందించడం, ఒకేషనల్ ట్రైనింగ్, పరీక్షల నిర్వహణ, Curriculum Flexibility, ఉన్నత విద్యలో మల్టిడిసిప్లినరీ ఇన్ స్టిట్యూషన్స్, సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఏర్పాటు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు.
రాష్ట్రీయ శిక్ష అయోగ్, నేషనల్ రీసెర్చ్ పౌండేషన్, లిబరల్ ఎడ్యుకేషన్, అక్రిడిటేషన్ జారీ పద్దతి, క్యాపబుల్ ఫ్యాకల్టి, గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో, స్కిల్ డెవలప్ మెంట్, స్టేట్ లెవల్ ప్లాన్, లోక విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య తదితర అంశాలపై చర్చిస్తూ రాష్ట్ర ప్రాధాన్యతలకు అనుగుణంగా తగు అబ్జర్వేషన్ లతో పాటు, సూచనలు, అంగీకారాలు, అభ్యంతరాలు, కొత్త ప్రతిపాదనలతో ముసాయిదా నివేధికను సిద్ధంచేయాలన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలుపుతు ప్రస్తుత అవసరాలకనుగుణంగా కోర్సుల రూపకల్పన చేయాలని అన్నారు.
యూనివర్సిటీలకు పరిశ్రమలతో అనుసందానంతోపాటు పరిశోధనకు ప్రాధాన్యత ఉండాలన్నారు. నిపుణుల కన్సల్టెన్సీ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మానవ వనరులు సద్వినియోగం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాల వివరాలతో పాటు చదివే విద్యార్ధుల సంఖ్యను తెలపాలన్నారు. Credit Based Curriculum పై దృష్టి సారించాలన్నారు. పరిశోధనలు, బోధనకు ప్రాధాన్యత ఉండేలా విద్యా సంస్ధలు ఉండాలన్నారు.