పేదలు, వలస కూలీల ఆకలి తీరుస్తున్న జీహెచ్ఎంసీ
- నేడు 342 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 1,56,350 మందికి ఉచితంగా భోజనం అందించిన జీహెచ్ఎంసీ
- జీహెచ్ఎంసీ మానిటరింగ్ వింగ్‌కు ఉదారంగా అన్నదానం, నిత్యావసరాలు అందజేస్తున్న దాతలు, స్వచ్ఛంద సంస్థలు
- 692 మంది దాతల సహకారంతో ఇప్పటి వరకు 6,44,300 ఆహార ప్యాకెట్లను నేరుగా పంపిణీ చేసిన జీహెచ్ఎంసీ
- జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకొని ఇప్పటి వరకు 10,94,200 ఆహార ప్యాకెట్లను దాతల ద్వారా పంపిణీ చేయించిన జీహెచ్ఎంసీ
- అన్నపూర్ణ క్యాంటీన్లు, దాతలు అందించే భోజనం, నిత్యావసరాల పంపిణీని మానిటరింగ్ చేస్తున్న మేయర్ బొంతు రామ్మోహన్
అదే విధంగా అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేవిధంగా రెగ్యులర్ కేంద్రాలతో పాటు, మొబైల్ అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్యను కూడా 342కు పెంచడం జరిగింది. రెగ్యులర్, తాత్కాలిక అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా సోమవారం 1,56,350 మందికి ఆహారాన్ని అందించడం జరిగింది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి నేటి వరకు 41లక్షల 48వేల మందికి అన్నపూర్ణ భోజనం అందించారు. అన్నపూర్ణ క్యాంటీన్లు, దాతలు అందించే భోజనం, నిత్యావసరాల పంపిణీని నగర మేయర్ బొంతు రామ్మోహన్ రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నారు.
అదే విధంగా లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కార్మికులు, యాచకులను ఆదుకునేందుకు నగరంలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అన్నదానంతో పాటు నిత్యావసరాలను విరివిగా పంపిణీ చేశారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టుటకు సామాజిక దూరాన్ని పాటించాల్సిఉన్నందున, రోడ్లపైన దాతల ఇష్టానుసారం పంపిణీ చేస్తున్నట్లు ఏర్పడుతున్న పరిస్థితులను అదిగమించుటకై జీహెచ్ఎంసీ ద్వారానే అన్నదానం, నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆహారం, నిత్యావసరాలు తద్వారా అవసరమైన పేదలను గుర్తించి పంపిణీని క్రమబద్దం చేసేందుకు జీహెచ్ఎంసీకి వీలు కలిగింది. *ఏప్రిల్ 4 నుండి గత రెండు రోజులలో* జీహెచ్ఎంసీ సెంట్రల్ మానిటరింగ్ వింగ్‌కు 692 మంది దాతలు ఇప్పటి వరకు ఇచ్చిన 6,44,300 ఆహార ప్యాకెట్లను మొబైల్ వాహనాల ద్వారా జీహెచ్ఎంసీ అధికారులు పంపిణీ చేశారు.
దాతల నుండి ఆహారం, ఇతర నిత్యావసరాలు సేకరించి పంపిణీ చేసేందుకు పది మొబైల్ వాహనాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అయితే దాతల నుండి ఎక్కువ స్పందన రావడంతో అధికారుల కోరిక మేరకు 30 మంది వ్యాపారస్తులు తమ టాటా ఏస్ వాహనాలను జీహెచ్ఎంసీకి ఉచితంగా కేటాయించారు. దీంతో దాతలు ఇస్తున్న భోజనం, నిత్యావసరాలను సేకరించి, సులభంగా పంపిణీ చేయుటకు వెసులుబాటు కలిగింది. జీహెచ్ఎంసీ జారీచేసిన పాస్‌ల ద్వారా ఇప్పటి వరకు 10,94,200 ఆహార ప్యాకెట్లను అధికారులతో సమన్వయం చేసుకొని దాతలు ఆయా ప్రాంతాల్లో పంపిణీ చేయడం జరిగింది.
అయితే ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది ఆహారాన్ని, నిత్యావసరాలను పంపిణీ చేస్తుండడంతో అసలైన పేదలు, వలస కూలీలకు మాత్రమే భోజనాన్ని, నిత్యావసరాలను సరఫరా చేయాలని నిర్ణయిస్తూ దాతలకు ఉదారంగా పాస్‌లు జారీచేసే ప్రక్రియను నిలిపివేయడం జరిగింది. ఏప్రిల్ 23 నుండి దాతల సేవా దృక్పదాన్ని దృష్టిలో ఉంచుకొని రోజుకు ఐదారుగురికి మాత్రమే అధికారులతో అనుసంధానం చేసి ఆహార పంపిణీ పాస్‌లు జారీచేస్తున్నారు.
జీహెచ్ఎంసీ సెంట్రల్ మానిటరింగ్ విభాగంకు దాతలు ఉదారంగా బియ్యం, ఇతర నిత్యావసరాలను అందజేశారు. 520 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 2,864 రేషన్ కిట్స్, 60వేల బిస్కెట్స్ అండ్ కేక్స్, 4,500 లీటర్ల నూనె ప్యాకెట్లు, 2,500 లీటర్ల ఫ్లోర్ క్లీనర్, 3,100 గ్లౌజెస్, 32,000 మాస్కులు, 4,500 కేజీల గోధుమ పిండి, 5,600 ఓట్స్ ప్యాకెట్లు, 1,364 పి.పి.ఇ కట్లు, 5,550 శానిటైజర్ బాటీళ్లు, 7,500 లీటర్ల శానిటైజర్ క్యాన్లు, 30 మెట్రిక్ టన్నుల వాటర్ మిలాన్లను దాతలు అందజేశారు. వాటిని పేదలకు జీహెచ్ఎంసీ పంపిణీ చేసింది. 2,500 లీటర్ల ఫ్లోర్ క్లీనర్‌ను వలస కూలీలు, యాచకుల సంరక్షణకై నెలకోల్పిన షెల్టర్ హోంలను శుభ్రం చేసేందుకు వినియోగిస్తున్నారు.