మాతృభూమి సేవ‌ను మ‌ర‌వొద్దు: ఉప‌ రాష్ట్ర‌ప‌తి వెంకయ్యనాయుడు

Related image

  • క‌ర్మ‌భూమిలో ప‌నిచేస్తూనే త‌ల్లి భార‌తిని గుర్తుచుకోవాల‌ని పిలుపు
  • ఆరోగ్య భద్రత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది
  • అమెరికాలో ప‌నిచేస్తున్న భార‌త సంత‌తి వైద్యుల స‌ద‌స్సులో పాల్గొన్న‌ఉప‌రాష్ట్ర‌ప‌తి
  • భార‌త వైద్యుల‌తో క‌లిసి యాంటి బ‌యోటిక్స్ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై ప‌నిచేయాల‌ని సూచ‌న‌

అమెరికాలో సేవ‌లందిస్తున్న భార‌తీయ వైద్యులు మాతృభూమి సేవ‌కు ముందుకు రావాల‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు పిలుపునిచ్చారు. క‌ర్మ‌భూమి అయిన‌ అమెరికాలో ఉండి అత్యుత్త‌మ సేవ‌లిందిస్తున్నార‌ని ప్ర‌శంసిస్తూనే.. మాతృభూమి భార‌త్‌లో గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని సేవ‌లందించ‌డంపై దృష్టిసారించాల‌ని సూచించారు. ఆపి (అమెరికాలో సేవ‌లందిద‌స్తున్న భార‌త సంత‌తి వైద్యులు) 13వ స‌ద‌స్సు సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోట‌ల్‌లో ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న అమెరికాలో సేవ‌లందిస్తున్న భార‌త సంత‌తి డాక్ట‌ర్ల‌నుద్దేశించి ఆయ‌న ప్రసంగించారు.

భార‌త్‌లో యాంటిబ‌యోటిక్స్ నిరోధ‌క వ్య‌వ‌స్థ క్షీణించ‌డంపై ఆందోళ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు భార‌త వైద్యుల‌తో క‌లిసి అమెరికాలో సేవ‌లందిస్తున్న భార‌తీయ సంత‌తి వైద్యులు ప‌నిచేయాల‌ని ఈ స‌వాల్‌ను అధిగ‌మించేందుకు కృషిచేయాల‌ని కోరారు. అమెరికాకు వెళ్లి చ‌దువుకోవ‌డం అక్క‌డ ప‌నిచేయ‌డం త‌ప్పుకాద‌ని.. అయితే మాతృభూమికి కొంతైనా రుణం చెల్లించేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. త‌ల్లిని, పుట్టిన ప్రాంతాన్ని, మాతృభాష‌ను, మాతృదేశాన్ని గురువును ఎన్న‌టికీ మ‌ర‌వొద్ద‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి సూచించారు.

ప్ర‌పంచ‌వైద్య వ్య‌వ‌స్థ‌కు భార‌త్ దీప‌స్తంభమ‌ని అభివ‌ర్ణించిన ఉప‌రాష్ట్ర‌ప‌తి..  వ‌రాహ‌మిహురుడు, శుశ్రుతుడు, చ‌ర‌కుడు వంటి మ‌హానుభావులు వేల ఏళ్ల క్రిత‌మే వైద్యాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశార‌న్నారు. నాటినుంచి నేటి వ‌ర‌కు భార‌త వైద్యవ్య‌వ‌స్థ‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌మ్మ‌కం పెరుగుతోంద‌న్నారు. చాలా దేశాల నుంచి భార‌త్‌కు వైద్య‌సేవ‌ల‌కోసం వ‌చ్చేవారి సంఖ్య పెరుగుతోంద‌న్నారు. గతంతో పోలిస్తే, భారతీయుల ఆయుర్థాయం 69 సంవత్సరాలకు పెరిగిందని, ఇదంతా వైద్యుల కృషి ఫలితమేనని, మెడికల్ సోషల్ రెస్పాన్స్ బులిటీతో ఆరోగ్య భారత్ లక్ష్యం సులువుగా సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.

అమెరికాలో ప్ర‌తి ఏడుగురిలో ఒక‌రికి భార‌త వైద్యులే సేవ‌లందిస్తున్నార‌ని తెలిపారు. అయితే ఇదంతా నాణేనికి ఒక‌వైపేన‌ని ఇంకా చాలాచోట్ల  గ్రామీణ ప్రాంతాల్లో క‌నీస‌ వైద్య సేవ‌లంద‌డం లేద‌నే విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్ద‌న్నారు. ప్రజలకు సరిపడ వైద్యులు లేకపోవడమే ఆయన ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అన్న ఆయన, అసంక్ర‌మిక వ్యాధులు పెనుస‌వాల్‌గా మారాయ‌ని వీటి బారినుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వైద్యులు చొర‌వ‌తీసుకోవాల‌న్నారు. ఈ స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మైన జీవ‌న‌శైలిలో మార్పు, ఆహార‌పు అల‌వాట్లను స‌రిదిద్దుకోవ‌డం ద్వారా స‌మ‌స్య‌కు కొంత‌వ‌ర‌కైనా ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌న్నారు.

వైద్య‌రంగంలో ప్రైవేట్ ద్వారా వైద్య‌సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేసేందుకు వీలుంద‌న్నారు. గ్రామీణ ప్రాంతాల‌వ‌ర‌కు వైద్య‌సేవల‌ను విస్త‌రించేందుకు ఒక్క ప్ర‌భుత్వం ప‌నిచేస్తేనే స‌రిపోద‌ని ప్రైవేటురంగం కూడా దీనిపై చొర‌వ‌తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి పేర్కొన్నారు. గ‌త నెల్లో త‌న వియ‌త్నాం ప‌ర్య‌ట‌న‌ను గుర్తుచేస్తూ.. ప‌దేళ్ల క్రితం త‌ను అక్క‌డ చూసిన ప‌రిస్థితుల‌కు.. నేటికి ఆ దేశంలో గ‌ణ‌నీయ‌మైన మార్పులు వ‌చ్చాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇందుకు అక్క‌డ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే కార‌ణ‌మ‌న్నారు. వైద్య‌రంగంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తున్న‌ కేంద్ర ప్ర‌భుత్వం ఇందులో భాగంగానే ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇప్ప‌టికే 10ల‌క్ష‌ల మంది ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొందార‌ని వెల్ల‌డించారు.

ఆరోగ్య‌మే మ‌హాభాగ్య‌మ‌ని మ‌హాత్ముడు, గౌత‌మ‌బుద్ధుడు చెప్పిన విష‌యాన్ని గుర్తుచేస్తూ.. ఆర్థికంగా బ‌లంగా ఉన్న దేశాల్లోనూ అనారోగ్య స‌మ‌స్య‌లు ప‌ట్టిపీడిస్తున్న విష‌యాన్ని మ‌ర‌వొద్ద‌న్నారు. భార‌త నాగ‌రిక‌త గొప్ప‌ద‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి పేర్కొన్నారు. ప్ర‌పంచంలోని అతి పురాత‌న నాగ‌రిక‌తలైన బాబిలోనియా, ఈజిప్టు వంటి ప్రాంతాలు ఇప్పుడు ఏ ప‌రిస్థితుల్లో ఉన్నాయో అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. నాటినుంచి నేటి వ‌ర‌కు భార‌త సంస్కృతి, చ‌రిత్ర గొప్ప‌గా ఉండేందుకు కార‌ణం.. మ‌న‌కు సామ్రాజ్యకాంక్ష లేక‌పోవ‌డమేన‌న్నారు. స‌ర్వేజ‌నః సుఖినోభ‌వంతు, వ‌సుదైవ కుటుంబ‌కం అనే మూల‌మంత్రాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నందునే ఇంకా భార‌త్ ఈ స్థాయిలో ఉంద‌ని గుర్తుచేశారు.  

ప్ర‌పంచంలో భార‌త్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ అన్న ఉప రాష్ట్ర‌ప‌తి దేశంలో సంస్క‌ర‌ణ‌లు వేగం పుంజుకున్నాయ‌ని తెలిపారు. ఇదే వేగంతో ముందుకెళ్తే భార‌త్ త్వ‌ర‌లోనూ మూడో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మార‌డం పెద్ద విష‌యం కాద‌ని ప్ర‌పంచ‌బ్యాంకు, అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి, మూడీస్ రేటింగ్ తదిత‌ర సంస్థ‌లు చెబుతున్నాయ‌న్నారు.  భార‌త్‌లో మాన‌వ వ‌న‌రుల‌కు కొర‌త‌లేద‌ని స‌గం జ‌నాభా 25ఏళ్ల‌లోపు వారేన‌న్నారు. దేశంలో జ్ఞాన సంప‌దకు కొర‌త‌లేద‌ని అయితే దీన్ని స‌రిగ్గా వినియోగించుకోలేకపోతున్నామన్నారు. ప్ర‌పంచానికి మాన‌వ‌వ‌న‌రుల‌ను స‌ర‌ఫ‌రా చేసే స‌త్తా ఉన్న భార‌త్‌వైపే అంద‌రూ చూస్తున్నార‌ని.. ప్ర‌పంచ ప్ర‌ముఖ సంస్థ‌లు కూడా భార‌త్‌లో పెట్టుబ‌డుల‌కు ముందుకొస్తున్నాయ‌న్నారు.  ఇందుకోసం ప్ర‌భుత్వంతోపాటు వ్యాపార‌వేత్త‌లు, వైద్యులు, ఇలా ప్ర‌తిరంగంలోని వారు దేశం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన సావనీర్ ను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. అనంత‌రం రేషికేష‌న్ కౌన్సిల్ వారు రూపొందించిన కాంప్ర‌హెన్సివ్ కార్డియో లైఫ్ స‌పోర్ట్ (సీసీఎల్ఎస్‌) మాన్యువ‌ల్‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తి ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో అపోలో గ్రూప్ చైర్మ‌న్ ప్ర‌తాప్ సీ రెడ్డి, ఆపి అధ్య‌క్షుడు డాక్ట‌ర్ సురేశ్ రెడ్డి, ప్ర‌ముఖ వైద్యులు కాక‌ర్ల సుబ్బారావు, నోరి ద‌త్తాత్రేయుడు, అమెరికాలో భార‌త సంత‌తి వైద్యులు పాల్గొన్నారు.

More Press Releases