25 వేల లోపు రైతు రుణాల ఏక మొత్తం మాఫీ కింద 1200 కోట్లు విడుదల: తెలంగాణ ఆర్థిక శాఖ
- వెను వెంటనే రైతు ఖాతాల్లో రుణ మాఫీ మొత్తాన్ని జమ చేయాలి
- వానాకాల పంటకు రైతు బంధు మొత్తాన్ని విడుదల చేసిన తెలంగాణ ఆర్థిక శాఖ
- ఆర్థిక, వ్యవసాయ శాఖ సంయుక్త సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
ఇవాళ అరణ్య భవన్ లో ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో ఇరువురు మంత్రులు సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. 25 వేల లోపు రుణం ఉన్న వారికి వెను వెంటనే రుణ మొత్తాన్ని వారి బ్యాంకు అక్కౌంట్లో జమ చేయాలన్నారు. 25 వేల రూపాయల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణ చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఇందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు మంత్రులకు తెలిపారు.
దీంతో పాటు వానా కాల పంటకు రైతు బంధు సాయంపైన మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు. జూన్ మాసంలో వానాకాల పంటకు ఇవ్వాల్సిన 7 వేల కోట్ల రైతు బంధు నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు కింద డబ్బులను వారి అక్కౌంట్లలో జమ చేయనున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గత క్యాబినెట్ లో నిర్ణయించిన ప్రకారం రైతు బంధు కింద 7 వేలకోట్లును ఈ నెల రోజుల్లో పంట సీజన్ ఆరంభమయ్యే నాటి కల్లా రైతులకు అందించాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకరాం ఇతర ఖర్చులు తగ్గించుకోనైనా రైతులు పంటలు వేసే సమయాని కన్నా ముందే రైతుల ఖాతాలలో డబ్బులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ ఏడాది కోటి 40 లక్షల ఎకరాలకు రైతు బంధు నిధులు చెల్లించడం జరిగిందన్నారు. 51 లక్షల మంది రైతులకు ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే వెళుతుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థిక, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలు ఆదేశించారు. రైతులకు అందించే రుణమాఫీ మొత్తాలను వెంటనే వారి అక్కౌెంట్లలో జమ అయ్యే విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఇరువురు మంత్రులు సమీక్షా సమావేశంలో పాల్గొన్న బ్యాంకు అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, ఆర్థిక, వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.