వలస కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది: మేయర్ బొంతు రామ్మోహన్
- పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్‌తో కలిసి మైహోం హబ్ పని ప్రదేశాన్నిసందర్శించిన మేయర్
- సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వలస కార్మికులకు పని ప్రదేశాల్లోనే రిజిస్ట్రేషన్
- ఈ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి - ప్రతిరోజు 6వేల మంది వలస కార్మికుల తరలింపు
- ఇక్కడ ఉన్నంత కాలం ప్రశాంతంగా పనులు చేసుకోండి
ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులు హైదరాబాద్‌లో వివిధ నిర్మాణ సంస్థలలో పని చేస్తున్నారని తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ -19 వైరస్ ప్రభావాన్ని అరికట్టేందుకు లాక్‌డౌన్‌తో పాటు కంటైన్‌మెంట్ జోన్లను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని వివరించారు.
ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 4 కోట్ల నిధులను రైల్వే శాఖకు చెల్లించినట్లు తెలిపారు. అయితే ఒకే రోజు ఎక్కువ రైళ్లను ఆయా రాష్ట్రాలకు పంపుటకు మనం సిద్దంగా ఉన్నామని తెలిపారు. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిఒక్కరిని స్క్రీనింగ్ చేయుటకు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నందున దశల వారిగా వలస కార్మికులను పంపుతున్నట్లు తెలిపారు.
వలస కార్మికులను పంపుటకు నిర్మాణ ప్రదేశాల్లోనే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రకారం తమ వంతు వచ్చేవరకు ఓపికతో వేచి ఉండాలని విజ్ఞప్తి చేశారు. మాకు రైలు దొరకదు అనే ఆందోళన వద్దని సూచించారు. ఈ నెలాఖరు వరకు అన్ని రాష్ట్రాలకు తెలంగాణ నుండి వలస కార్మికుల ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. వలస కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.
నిర్మాణ సంస్థలతో మాట్లాడి జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ పరిధిలో 288 పని ప్రదేశాల్లో వలస కార్మికుల క్యాంపులు ఏర్పాటుచేసి భోజనం, వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులను ప్రభుత్వం తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.సి.ఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్ లు రెగ్యులర్‌గా సమీక్షిస్తున్నట్లు మేయర్ తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ నుండి ఇప్పటి వరకు 16 రైళ్లను ఏర్పాటు చేసి తమ సొంత రాష్ట్రాలకు వలస కార్మికులను పంపినట్లు తెలిపారు. ప్రతిరోజు ఐదు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భౌతిక దూరం అమలు చేయాల్సి ఉన్నందున ప్రతి రైలులో 1200 మంది చొప్పున ప్రతిరోజు 6వేల మంది వలస కార్మికులను పంపుతున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయని తెలిపారు.
తమ సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వలస కార్మికులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు 6వేల మందిని మాత్రమే తరలించేందుకు అవకాశం ఉన్నందున, వరుస క్రమంలో రిజిస్ర్జేషన్ చేసుకున్న ప్రతి వలస కార్మికుడిని రైళ్లలో పంపుతామని వివరించారు. కాబట్టి మీ వంతు వచ్చే వరకు వేచి ఉండాలని కోరారు. లక్నో, పాట్నా, జైపూర్, భోపాల్, కోల్‌కత, భువనేశ్వర్ తదితర నగరాలకు రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు.
కోవిడ్-19 నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, తమ సొంత ఊర్లలో ఉన్న పరిస్థితుల గురించి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి ముందస్తుగా తెలుసుకోవాలని సూచించారు. సొంత ఊర్లపై ఉన్న ప్రేమను గుర్తించిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రతిరోజు ఎక్కువ రైళ్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన డిమాండ్ మేరకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రైళ్లనే కేటాయించినట్లు తెలిపారు.
అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగంలో పనులు తిరిగి మొదలైనట్లు తెలిపారు. సొంత రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో అవకాశం వచ్చేంత వరకు నిర్మాణ పనులలో నిమగ్నం కావాలని సూచించారు. వలస కార్మికులకు సదుపాయాలు కల్పించి, జీతాలు ఇచ్చేందుకు క్రేడాయి, బిల్డర్స్ అసోసియేషన్, లేబర్ కాంట్రాక్టర్లతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్ ఐదు సార్లు ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. కాబట్టి వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.
ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందనే ఆలోచన మానుకోవాలని, తమ వంతు వచ్చే వరకు పనులలో నిమగ్నమై జీతాలు పొందాలని వివరించారు. హైదరాబాద్ నగరంలో నిర్మాణ పనులు మొదలైనందున, ఆ రంగంతో అనుబంధం కలిగిన రంగాలలో పనులు ఉన్నాయని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి వలస కార్మికుడికి రైలు సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.
అలాగే పనిప్రదేశాలు, రైళ్లలో వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కోవిడ్-19 లక్షణాలు వివరిస్తూ చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవాలని తెలిపారు. అలాగే వైరస్ వ్యాప్తి నివారణకు కళ్లు, ముక్కు, నోటిని తాకరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో సిసిపి దేవేందర్‌రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావిణ్య, మైహోం నిర్మాణ సంస్థ ప్రతినిధి జూపల్లి శ్యాం తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల అభివృద్ది పనులను తనిఖీ చేసిన మేయర్ బొంతు రామ్మోహన్, ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్:
రూ.23 కోట్లతో నిర్మిస్తున్న పంజాగుట్ట ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్. స్మశానవాటిక వైపు రోడ్ల విస్తరణ కు చేపట్టిన పనులను తనిఖీ చేశారు. అనంతరం లెదర్ పార్క్ నుండి రోడ్డు నెంబర్ 45 వరకు, ప్రశాసన్ నగర్ లో నిర్మిస్తున్న స్లిప్ రోడ్లు, మిస్సింగ్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో సిసిపి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.