సిక్కంతో మామిడి కాయలను కోసిన మంత్రి ఎర్రబెల్లి
- జనగామ జిల్లా పెద్ద పహాడ్ లో ఐకేపీ మామిడి కాయల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- మామిడికాయలను పరిశీలించి, మామిడి రైతులు, ఐకేపీ మహిళా గ్రూప్స్ తో మాట్లాడిన మంత్రి
- మామిడి కాయలను కోసిన మంత్రి
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:
- ధాన్యం కొనుగోలు, మాస్కుల తయారీ, ఇప్పుడు మామిడి కాయల కొనుగోలు.. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు
- మహిళా శక్తి అమూల్యమైనది. మహిళలు అన్ని రంగాల్లో నూ ముందున్నారు. రాణిస్తున్నారు
- రాష్ట్రంలో 3 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యంతో SERP ఆధ్వర్యంలో ఐకేపీ మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నది
- మొత్తం 13 కొనుగోలు కేంద్రాలు మొదలు కానున్నాయి. అందులో ఖమ్మం, నాగర్ కర్నూలు, సిద్దిపేట, వికారాబాద్, జగిత్యాల సెంటర్లు పని చేస్తున్నాయి
- జనగామ 6వ కొనుగోలు కేంద్రం. మిగతా కేంద్రాలు త్వరలోనే ప్రారంభమవుతాయి
- మంచిర్యాల, సూర్యాపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి
- ఇప్పటి వరకు 300 మెట్రిక్ టన్నుల మామిడి కాయలు కొనుగోలు జరిగింది
- వీటితో పాటు పుచ్చ, అరటి, పాపాయ వంటి పండ్ల కాయలను కూడా కొనుగోలు చేస్తున్నాం
- ఈ కాయలను సహజంగా పండించి మార్కెటింగ్ చేస్తున్నారు
- మంచి పౌష్టికహారంగా ఈ పండ్లను ఉపయోగించవచ్చు
- ప్రజలు ఐకేపీ పండ్లను కొనుగోలు చేసి ఉపయోగించండి. ఆరోగ్యంగా జీవించండి
- మహిళలను ప్రోత్సహించండి. వాళ్ళు ఇంటి ఆర్థిక వ్యవస్థ లాగే, వాళ్ళ ఈ మార్కెటింగ్ వ్యవస్థను లాభాల్లో నడపగల సమర్థులు
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి:
ఎల్ల రాయని తొర్రూరు, పాలకుర్తి, కొండూరు, గన్నారం (పాలకుర్తి, రాయపర్తి మండలాలు-జనగామ, వరంగల్ రూరల్ జిల్లా), మే 12:
మనకు మనమే ఒకరినొకరు ఆదుకునే ఆప్తులం కావాలి. పేదలను ఆదుకోవడం ద్వారా దాతలు తమ ధాతృత్వాన్ని చాటుకోవాలి. ఏ గ్రామానికి ఆ గ్రామం ఇదే స్ఫూర్తితో నడచుకోవాలి. కరోనా కష్టాలు తీరే వరకు ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలి. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా ఎల్లరాయని తొర్రూరులో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులకు, పాలకుర్తి లో పలువురి దాతల సహకారంతో పారిశుద్ధ్య కార్మికులు, నిరుపేదలకు కూరగాయలు, అలాగే, వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు, గన్నారం గ్రామాల్లో కొందరు ఆ గ్రామాల దాతల సహకారంతో నిరుపేదలకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కష్టాలు, కన్నీళ్ళు కలకాలం ఉండవు. కష్టాలు వచ్చినప్పుడే మనోళ్ళు ఎవరో, మంది ఎవరో తెలిసిపోతుంది. మన గ్రామాలను మనమే బాగు చేసుకుంటున్న విధంగా, మన గ్రామాల్లోని ప్రజలను మనమే ఆదుకోవాలి. ఒకరికొకరం ఆసరా కావాలి. పేదలను ఆదుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా కష్టాలు తీరే వరకు నిరుపేదల కష్టాలను తీర్చేందుకు దాతలు ముందుకు రావాలని, వారి ధాతృత్వాన్ని చాటుకోవాలని మంత్రి తెలిపారు. తాను స్వయంగా తమ కొడుకు, బిడ్డల నుంచి సేకరించినవేగాక, అనేక మంది స్నేహితుల నుంచి సేకరించిన డబ్బులు, నిత్యావసర వస్తువులను, ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా మరికొందరికి విరివిగా పంపిణీ చేశామన్నారు. అయితే తనలాంటి ఏ ఒక్కరి వల్లా అందరినీ ఆదుకోవడం సాధ్యం కాదన్నారు. అందుకే గతంలో ఎలాగైతే గ్రామాలు స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందాయో, అలాగే, గ్రామాల్లోని ప్రజలే గ్రామంలోని నిరుపేదలను ఆదుకునే నిజమైన దాతలు కావాలని అన్నారు. మరికొద్ది రోజులు ఓపిక పడితే, కరోనా మటు మాయం అవుతుందని, అయితే, కరోనాకు స్వీయ నియంత్రణ, మనకు మనమే నియమించుకునే కట్టడి తప్ప మరోదారి లేదన్నారు. సామాజిక, భౌతిక దూరాన్ని పాటిస్తూ, లాక్ డౌన్ ని పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి ప్రజలకు ఉద్బోధించారు.
ఇక సిఎం కెసిఆర్ రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరుగుతున్నా సరే, ప్రజల ప్రాణాలే ముఖ్యమని, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కెసిఆర్ నిర్ణయాల కారణంగానే ప్రపంచాన్ని వణికించిన కరోనా నుంచి మనం మిగతా వాళ్ళకంటే బాగున్నామని చెప్పారు. మరికొద్ది రోజుల పాటు స్వీయ నియంత్రణ పాటించి, కరోనాని పారదోలుదామని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నిరుపేదలు, ప్రజలు పాల్గొన్నారు.