కేసీఆర్ గారి సహకారంతో వాగులకు పూర్వ వైభవం తేవాలన్న నా కల నేరవేరబోతోంది: మంత్రి వేముల
- ప్యాకేజీ -21తో కాళేశ్వరం నీటిని వచ్చే ఏడాదికల్లా అందిస్తాం
- లాభసాటి వ్యవసాయం సీఎం కేసీఆర్ లక్ష్యం
- ఎస్సారెస్పీని కాళేశ్వరం జలాలతో నింపి చూపిస్తాం
- గల్ఫ్ నుంచి వచ్చే కార్మికులకు క్వారంటైన్ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది
అధికారులు, రైతులు, నాయకులతో కలిసి వాగులో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెద్దవాగు, కప్పల వాగు 365 రోజుల పాటు నీటిని ఉండడాన్ని తన బాల్యంలో చూశానని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ వాగులు వట్టిపోయి బోసిపోవడాన్ని చూసి ఈ రెండు వాగులను అన్ని కాలాల్లో నీటితో ఉండేలా చేయాలనేది తన కల అన్నారు. ప్రతి వర్షపు బొట్టును దోసిలితో పట్టినట్లు సద్వినియోగం చేసే కార్యక్రమాలు తీసుకున్న సీఎం కేసీఆర్ సహకారంతో తొలివిడతగా ఈ వాగుల్లో మూడు చెక్‌డ్యామ్‌లు మంజూరు చేసి నిర్మింపజేశానన్నారు.
వీటి సత్ఫలితాలు కనిపించడంతో విడతల వారీగా మరో ఆరు చెక్‌డ్యాంలు మంజూరు చేయించామన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాగులు, వంకల్లో చెక్‌డ్యామ్‌లను విరివిగా నిర్మించే కార్యక్రమం తీసుకుందన్నారు. దీంతో మరో 10 చెక్‌డ్యాంలు మంజూరు చేయించామన్నారు. వీటిని రూ. 60 కోట్లతో పూర్తి చేయనున్నామన్నారు. దీంతో కప్పల వాగు, పెద్ద వాగుల్లో అడుగడుగునా షేక్‌హ్యాండ్ చెక్‌డ్యామ్‌ల నిర్మాణం జరుగుతుందన్నారు.
ఇందులో భాగంగా చింతలూరు, జాన్కంపేట్ మధ్య 9 కి.మీ పొడవున పెద్ద వాగులో కొత్తపల్లి వద్ద, కోలిప్యాక్, పచ్చలనడ్కుడ వద్ద మూడు చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. వీటిని సుమారుగా రెండున్నర కి.మీ చొప్పున నిర్మించనున్నామన్నారు. 11 ఫీట్ల ఎత్తుతో నిర్మించే ఈ చెక్‌డ్యాంల్లో ఒక కిలో మీటర్ మేర నీరు నిల్వ ఉంటుందన్నారు. వాగుల నిండ మొత్తం 12 చెక్‌డ్యాంలు నిర్మాణమవుతాయని తెలిపారు. మరో 4 చెక్‌డ్యాంలు మంజూరు చేసుకుంటే 2 రెండు వాగులు మూడు కాలాల్లో జలకళతో ఉంటాయన్నారు. జిల్లాలో ఈ రెండు వాగులు 72 కి.మీ పొడవుతో ఉన్నాయన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 42 కి.మీ పొడవుతో 65 గ్రామాల పరిధిలో సుమారు 25వేల ఎకరాలతో ఈ వాగులతో సాగునీటి ప్రయోజనం కలుగుతుందన్నారు.
వచ్చే ఏడాది కల్లా ప్యాకేజీ -21 నీరు:
కాళేశ్వరం జలాలను బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు అందించే ప్యాకేజీ -21 వరంలాంటిదని మంత్రి అన్నారు. వచ్చే ఏడాది కల్లా ప్యాకేజీ 21 నీటిని అందిస్తామన్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌ను మాసాని చెరువుకు అక్కడి నుంచి నిజాంసాగర్ పాత కెనాల్‌కు, అక్కడి నుంచి మెంట్రాజ్‌పల్లి వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్‌కు తరలిస్తారన్నారు. అక్కడి నుంచి పైపులైన్ ద్వారా పంట పొలాలకు నీరందుతాయన్నారు. గతంలో కాలువ ద్వారా నీటిని అందించే ప్రతిపాదన ఉంటే భూములు అధికంగా కోల్పోయే అవకాశం ఉన్నందున రైతులకు నష్టం కలగకూడదన్న ఉద్ధేశంతో సీఎం కాలువ స్థానంలో పైపులైన్ మంజూరు చేశారని గుర్తు చేశారు. మొత్తం రూ. 1350 కోట్లతో చేపట్టిన ప్యాకేజీ -21లో రూ. 750 కోట్లు బాల్కొండ నియోజకవర్గంలో పనులకు వెచ్చిస్తున్నారని వివరించారు. ఈ పథకంలో 1 కి.మీ టన్నెల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. రెండు నెలల్లో కెనాల్ పనులు పూర్తవుతాయన్నారు. మెంట్రాజ్‌పల్లి వద్ద పంపుహౌస్ నిర్మాణం 70శాతం పూర్తయిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో పంపుహౌజ్ పనులు 90శాతం పూర్తయ్యాయని తెలిపారు.
లాభసాటి వ్యవసాయమే సీఎం కేసీఆర్ లక్ష్యం:
రైతులకు లాభం కలిగించే పంటలను సాగు చేయించాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే మంచి ధర కోసం రైతులు ధర్నాలు అంటూ రోడ్డెక్కె అవసరం ఉండకూడదనేది సీఎం లక్ష్యమన్నారు. లాభసాటి వ్యవసాయ విధానాన్ని అమలు చేయడంలో రైతుబంధు లాంటి పథకాలు ఇవ్వరనేది తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. రైతులు అడగకుండానే సీఎం అమలు చేస్తున్న ఈ పథకాలు ఎప్పటికి ఆగిపోవన్నారు. ఈ పథకాలు ఆగిపోతే రాజకీయ లబ్ధి పొందవచ్చని కొందరు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
రైతుకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు:
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎండకాలంలో సైతం చెరువులు, ప్రాజెక్టులను, ఎత్తిపోతలతో సాగునీటిని అందించడంతో పుష్కలమైన ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. ధాన్యం దిగుబడులు భారీగా వచ్చిన వేళ కరోనా విపత్తు ఎదురైనా సీఎం ధైర్యం చేసి పంటల కొనుగోలు పూర్తి చేయిస్తున్నారన్నారు. 0శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
ఎస్సారెస్పీ కాళేశ్వరం జలాలతో నింపి చూపిస్తాం:
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునర్జీవం పథకం ద్వారా నింపి చూపిస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పునరుద్ఘంటిచారు. ప్రతిపక్షాలు ఊహకు కూడా అందని ఎన్నో గొప్ప పనులు త్వరలో జరగనున్నాయన్నారు. పునర్జీవం పథకం ద్వారా నీళ్లు రావని సంబరపడ్డ ప్రతిపక్షాల నాయకులు వరద కాలువ ద్వారా కాళేశ్వరం జలాలు ఎగువకు ప్రవహిస్తుండటం చూసి నోటి మాట రాకుండా ఉండిపోయారని గుర్తు చేశారు. ఎస్సారెస్పీని నింపి చూపించబోతున్నామన్నారు.
గల్ఫ్ నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ కోసం ప్రభుత్వం అన్ని విధాలా ఉండగా ఉంటుంది:
కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. క్వారంటైన్ ఖర్చులు భరించే స్థోమత తమకు లేదని తెలిపే ప్రతీ కార్మికునికి ఒక్క రూపాయి ఖర్చు కూడా పెట్టనీయకుండా రాష్ట్ర ప్రభుత్వమే క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు. వారికి బయట నుంచి ఎవరూ ఎలాంటి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ప్రభుత్వం కల్పించబోదన్నారు. రోజుకు రూ. 2వేల చొప్పున, రోజుకు రూ. వెయ్యి చొప్పున భరించుకోగలిగే స్తోమత ఉందని ముందుకు వచ్చే వారికి మాత్రం ఆ మేరకు సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. అంత మాత్రాన డబ్బులు పెట్టుకునే స్తోమత లేని వారితో ఖర్చులు పెట్టిస్తున్నామన్నట్లు భావించకూడదన్నారు. ఈ విషయంలో పేద కార్మికులెవరైనా అవసరమైతే తనకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
నాన్న జ్ఞాపకార్థం సొంత ఖర్చుతో రైతువేదిక నిర్మిస్తా:
తన స్వగ్రామం వేల్పూర్‌లో ప్రభుత్వం సమకూర్చిన భూమిలో రూ. 15లక్షలతో రైతువేదిక నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రైతుల కోసం పరితపించిన తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం రైతువేదికను నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బీమా జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, వేల్పూర్ సర్పంచ్ పిట్ల సత్యం, ఆర్టీఏ సభ్యుడు రేగుల రాములు, పార్టీ మండల కన్వీనర్ నాగధర్, ఆయా గ్రామాల సర్పంచులు ఏనుగు శ్వేత, నితిష్, ఎంపీటీసీలు భూమన్న, గంగారెడ్డి, మొండి మహేశ్, చందన్, టీఆర్ఎస్ నాయకులు సామా మహిపాల్, మహేందర్, బాల్‌రెడ్డి, ప్రవీణ్, ప్రతాప్, కొత్తపల్లి నర్సారెడ్డి, నల్ల రమేశ్, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.