నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులు.. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి

Related image

డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేసేలా రైతాంగాన్ని సన్నద్ధం చెయ్యాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యవసాయ శాఖాధికారులకు ఉద్బోధించారు. అందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు, రైతుబందు సభ్యులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు జరుప తలపెట్టిన నియంత్రితసాగు విధానంపై కోదాడ, హుజుర్నగర్, మిర్యాలగూడలలో జరిగిన డివిజన్ స్థాయి అవగాహన సదస్సులలో ఆయన పాల్గొన్నారు.

ఇప్పటి వరకు ప్రణాళిక రూపం వల్లనే తాను పండించిన పంటకు తాను ధర నిర్ణయించుకోలేక పోవడం నిజంగా రైతాంగం దురదృష్ట కరమన్నారు. అటువంటి రైతాంగం దళారుల చేతిలో మోసపోకూడదు అన్న తలంపుతోటే ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. అందులో భాగమే నీటి సౌలభ్యత ఉన్నచోట ఆయిల్ ఫామ్ వంటి సాగును ప్రోత్సాహించడం ద్వారా రైతాంగాన్ని ఆర్ధికంగా పరిపుష్టం చెయ్యొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతే గాకుండా పత్తి తో పాటు అంతర్ పంటగా కంది వేస్తే రైతుకు లాబాదయకంగా ఉంటుందన్నారు. యన్ యస్ పి ఆయకట్టు ప్రాంతంలో సన్నాలు వెయ్యడం ద్వారా కలిగే ప్రయోజనాలను అధికారులు రైతులకు వివరించాలని ఆయన సూచించారు. అదే సమయంలో కొత్తగా యస్ ఆర్ యస్ పి పారుతున్న ప్రాంతాల్లో పత్తి తో పాటు కందిని ప్రోత్సహించడం ద్వారా వచ్చే ఆర్థిక లాభాలను రైతులకు వివరించాలన్నారు. రైతుబందు పథకం ఎప్పుడూ అమలులోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

అయితే రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలను విధిగా వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని ఆయన చెప్పారు. ఒక్క కోదాడ డివిజన్ లో రైతుబందు పథకం కింద ఇప్పటివరకు 46,350 మంది రైతుల ఖాతాలో 43,55,60,833 రూపాయలు జమ అయినట్లు ఆయన వెల్లడించారు. అదే విదంగా హుజుర్నగర్ డివిజన్ పరిధిలో 65044 మంది రైతుల ఖాతాలో 79,75,40,933 రూపాయలు జమ అయ్యాయి అని ఆయన వివరించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,డి సి సి బి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, కోదాడ,హుజుర్నగర్, మిర్యాలగూడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్,శానంపూడి సైదిరెడ్డి,రైతుబందు జిల్లా అధ్యక్షుడు రజక్, యన్. భాస్కర్ రావు సూర్యపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases