నాయకత్వ సామర్థ్యం, బాధ్యతాయుత దృక్పథం ఉన్నవారికే కమిటీల్లో స్థానం: జనసేన
- జనసేన విధివిధానాలకు... సిద్ధాంతాలకు బద్ధులై క్షేత్రస్థాయితో మమేకం కావాలి
- భావి తరాల ప్రయోజనాలకీ... యువత రాజకీయ చైతన్యానికీ ప్రాధాన్యం
- జనసేన పోలిట్ బ్యూరోలో నాదెండ్ల మనోహర్, పి.రామ్మోహన్ రావు, రాజు రవితేజ్, అర్హంఖాన్
- 11 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ... కమిటీ ఛైర్మన్ గా నాదెండ్ల మనోహర్
- క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా మాదాసు గంగాధరం
- సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన యువ అభ్యర్థులతో ప్రత్యేక కమిటీ
- కీలక నిర్ణయాలు తీసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
జనసేన పార్టీకి సంబంధించిన కీలక కమిటీలకు పవన్ కల్యాణ్ రూపునిచ్చారు. పోలిట్ బ్యూరోలో నలుగురు సభ్యులు ఉంటారు. పోలిట్ బ్యూరోలో నాదెండ్ల మనోహర్, పి.రామ్మోహన్ రావు, రాజు రవితేజ్, అర్హంఖాన్ ను సభ్యులుగా నియమిస్తూ పవన్ కల్యాణ్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తొలి విడతగా 11 మంది సభ్యులను నియమించారు. పార్టీ అవసరాలకు అనుగుణంగా ఈ కమిటీ పరిధిని పెంచుతారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి నాదెండ్ల మనోహర్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి తోట చంద్రశేఖర్ పార్టీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా మాదాసు గంగాధరంని నియమిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన యువ అభ్యర్థులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దే క్రమంలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది.
- సాధికారత... సహనశీలత
జనసేన పార్టీ ఆలోచన దృక్పథానికి అనుగుణంగా... పార్టీ సిద్ధాంతాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటిని బలంగా క్షేత్రస్థాయి వరకూ తీసుకువెళ్లే సమర్థత ఉన్నవారిని పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎంపిక చేశారు. వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో పార్టీ వ్యూహాలను ప్రభావశీలంగా అన్ని స్థాయిల్లో అమలు చేయగలిగేవారికి ఇందులో స్థానమిచ్చారు.
రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు ప్రాంతాల్లో సున్నితమైన భావోద్వేగాలు రగిలిన సమయంలో చట్టసభను సమర్థంగా నిర్వహించి జాతీయ స్థాయిలో మన్ననలు పొందిన సభా నాయకుడు నాదెండ్ల మనోహర్ జాతీయ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకూ రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన... సంబంధిత వర్గాలతో పరిచయాలు మనోహర్ కి ఉన్నాయి. చట్టాలు, పాలన అంశాలపై పట్టు ఉన్న ఆయన జనసేనలో అధికారికంగా చేరేందుకు రెండేళ్ల ముందు నుంచే జనసేనాని పవన్ కల్యాణ్ తో పలు చర్చలు చేశారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆలోచన విధానంపట్ల పూర్తి విశ్వాసం ఉన్నవారాయన. పార్టీలో చేరినప్పుడు ఎలాంటి పదవి కోరుకోలేదు. ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ పార్టీతోనే నడుస్తానని తొలి రోజునే మనోహర్ పార్టీ అధ్యక్షులకు చెప్పారు.
తమిళనాడు ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన పి.రామ్మోహన్ రావు ఏ అంశాన్నైనా 360 డిగ్రీల్లో విశ్లేషించగలరు. సామాజిక, రాజకీయ, పాలన అంశాలపై వారి సాధికారత పార్టీ నిర్వహణకు ఇతోధికంగా ఉపయోగపడుతుంది. సాంఘిక సంక్షేమ, రైతు ప్రయోజనాలపై స్పష్టమైన దృక్పథం ఉంది. పార్టీ నిర్మాణ, నిర్వహణకు వారి ఆలోచనలు అవసరమవుతాయి. జనసేన పార్టీలో లోకల్ బాడీ ఎలెక్షన్స్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్నారు.
జనగాం పట్టణానికి చెందిన రాజు రవితేజ్ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై సాధికారత కలిగినవారు. అభ్యుదయ భావాలు కలిగిన వీరు పొలిటికల్, ఫిలాసఫీ, కల్చర్ అంశాలపై 23 దేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. సాధారణ ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన వీరికి అంతర్జాతీయంగా దౌత్య సంబంధిత పరిచయాలున్నాయి. రవితేజ్ తండ్రి బచ్చల జోసెఫ్ డేవిడ్ జనగాంలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. రవితేజ్ ప్రజారాజ్యం పార్టీలోని యువరాజ్యం విభాగానికి ఉపాధ్యక్షులుగా పని చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో గత 12ఏళ్ల నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. పవన్ కల్యాణ్ తో పోలెండ్ రాయబారి భేటీకి కీలక భూమిక పోషించింది రాజు రవితేజ్.
ప్రజారాజ్యం పార్టీ సమయం నుంచి రాజకీయ పార్టీ నిర్వహణతో సంబంధం ఉన్నవారు అర్హం ఖాన్. విద్యావంతులైన వీరికి మైనార్టీల సమస్యలు, సామాజిక సమస్యలపై పట్టు ఉంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంలో అభ్యర్థుల ఎంపికలో ముఖ్య బాధ్యత నిర్వర్తించారు. జనసేన పార్టీలో మైనార్టీ విభాగానికి బాధ్యులుగా ఉన్నారు.
- పకడ్బందీ ప్రణాళికతో
- అంచలంచెలుగా... బలమైన ప్రమాణాలతో పార్టీ కమిటీల ఏర్పాటు
పవన్ కల్యాణ్ కమిటీల నియామకంపై మాట్లాడుతూ “పార్టీ నిర్మాణం అనేది ఒకే రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ఒక పరిశ్రమ విజయవంతంగా నడవాలంటే ఒక్కసారిగా అన్నీ అయిపోవు... సమర్థులను అన్వేషించి నిర్మించుకోవాల్సిందే. అదే రీతిలో సమర్థులు, బాధ్యతాయుతమైన ఆలోచన కలిగిన యువకులు, అనుభవజ్ఞులైన నాయకులతో దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనంతో పార్టీని నిర్మించాలి. నాపై అమితమైన విశ్వాసం ఉన్న అభిమాన గణం ఉంది... పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఆలోచనలపై విద్యావంతులు, తటస్తుల్లో నమ్మకం ఉంది. వీరిని పార్టీకి అనుసంధానించి ఒక బలంగా మార్చే శక్తి ఉన్న నాయకులు అవసరం. ఆ స్థాయి నాయకులను జనసేన ఎప్పుడూ స్వాగతిస్తుంది. ఇలా అనుసంధానించే బాధ్యత ఆ నాయకులు తీసుకోవాలి. అధ్యక్షుడిగా ఒక మాట చెబితే క్షేత్ర స్థాయి వరకూ ఆ ప్రభావాన్ని తీసుకువెళ్ళాలి. ఒక సమస్య మీద మాట్లాడితే దాన్ని పరిష్కరించే దిశగా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత అజెండాలు వదిలి... పార్టీ దృక్పథాన్నే తన పథంగా భావించేవారితోనే కమిటీలు ఉంటాయి. వ్యక్తిగత అజెండాలను జనసేన పార్టీ మోయదు. జనసేన పార్టీకి ప్రజా ప్రయోజనమే పరమావధి.
- పార్టీ నిర్మాణంలో భాగస్వాములకే గుర్తింపు... యువ నాయకులకు ప్రోత్సాహం
జనసేన పార్టీ ప్రారంభమైన నాటి నుంచి కలిసి నడిచినవారికి పార్టీ భావజాలం అర్థమవుతుంది. క్షేత్ర స్థాయిలోను, ఎక్కడెక్కడో ప్రవాసంలో ఉన్న తటస్తులకు పార్టీ భావజాలం దాని ప్రయోజనం అర్థమైంది. అయిదేళ్ళ నుంచి కాకుండా ఎన్నికలకు అయిదు వారాల ముందు వచ్చినవారికి పార్టీ సిద్ధాంతాలు, దృక్పథం అవగతం కాకపోవచ్చు. అలాంటివారు పార్టీని అధ్యయనం చేసి శ్రేణులతో మమేకం కావడం తప్పనిసరి. కులాన్ని కచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే మన సమాజం భిన్న కులాల సమాహారం. అలాగని కుల ప్రాతిపదికన పార్టీని నడపటం సాధ్యం కాదు.
జనసేన పార్టీ భావి తరాల ప్రయోజనం కోసం, నవతరం రాజకీయ నాయకత్వాన్ని తీర్చిదిద్దే క్రమంలో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో విస్తృత రాజకీయ ప్రయోజనాలతోనే పార్టీ నిర్వహణ ఉంటుంది. నేను ఏం చెబుతానో అదే ఆచరిస్తాను. నేను నా వ్యక్తిగత ప్రయోజనం అనేది చూసుకోలేదు.. చూసుకోను. అత్యధిక పారితోషికం తీసుకొనే కథానాయకుడిగా... స్టార్ డమ్ ఉన్న సమయంలోనే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రజా క్షేత్రంలోకి వచ్చాను. అమిత్ షా గారిని కలిసినా, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా అక్కడ నా వ్యక్తిగత అజెండా ఏదీ వారి ముందు ఉంచలేదు. పార్టీని, నన్ను విశ్వసించిన ప్రజల కోసమే పని చేస్తాను. ఈ ధోరణి కొందరికి రుచించకపోవచ్చు... వారికి ఇన్ స్టెంట్ రిజల్ట్, పదవులు అవసరం కావచ్చు. అలాంటివారితో పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. జనసేన ఎంచుకున్న పంథా కఠినంగానే ఉంటుంది. నిర్దుష్ట లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. అందుకు తగ్గ విధంగా నడిచే నాయకులతోనే జనసేన పరిపుష్టం అవుతుంది” అన్నారు.
- క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళిక రూపకల్పన
జనసేన కమిటీలకు నిర్దేశించిన బాధ్యతలను ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు, క్షేత్ర స్థాయిలో ఆ కమిటీల ప్రభావం, పని తీరును పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలన చేస్తారు. జనసేన పార్టీ పక్షాన తీసుకురానున్న మ్యాగజైన్ కు సంబంధించిన పనులు చురుగ్గా నడుస్తున్నాయి. సామాజిక, రాజకీయ పత్రికగా ఇది రూపుదిద్దుకుంటుంది.