పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు కావాలి: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
తొర్రూరు, పాలకుర్తి, మంచిప్పుల, మైలారం (జనగామ, వరంగల్ రూరల్ జిల్లా), జూన్ 5ః పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. పచ్చదనం-పరిశుభ్రతకు నిలయాలు కావాలి. పల్లెల్లో పారిశుద్ధ్యం పకడ్బందీగా నిర్వహించాలి. పరిశుభ్రమైన పల్లెలు ఆరోగ్యానికి కూడా నిలయాలుగా మారుతాయి. వచ్చిన కరోనానే కాదు, ఈ వానా కాలం సీజన్ లో ప్రబలే అంటు, సీజనల్ వ్యాధులను కూడా అరికట్టాలి. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. పల్లె ప్రగతిలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి 8 రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జనగామ జిల్లా ఎల్లరాయని తొర్రూరులో కాలువ పనులను పరిశీలించారు. పాలకుర్తిలో వైకుంఠ ధామ స్థలాన్ని పరిశీలించారు. మంచిప్పులలో వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. నర్సరీ, ఇంకుడు గుంతలను పరిశీలించారు. హరిత హారంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే, వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అలాగే మంచిప్పులలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని, రైతులతో మమేకం అయ్యారు. నియంత్రిత పంటలనే సాగు చేయాలని విజ్ఙప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మనది గ్రామీణ భారతమన్నారు. నూటికి 70శాతం ప్రజలు గ్రామాల్లో ఉన్నారన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామాలు పచ్చగా, పరిశుభ్రతతో ఉండాలి, స్వయం సమృద్ధంగా ఎదగాలి. అదే సీఎం గారి ఆశయం. అందుకే గ్రామాలను, పట్టణాలను మొత్తం తెలంగాణను స్వయం సమృద్ధంగా, సర్వతోముకాభివృద్ధిగా తీర్చిదిద్దుతున్నారన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పచ్చదనం-పరిశుభ్రత, హరిత హారం వంటి అనేక కార్యక్రమాలు కూడా అభివృద్ధి, సంక్షేమాలతో సమంగా అమలు చేస్తున్నారన్నారు. రైతులకు రుణ మాఫీ, పంటల పెట్టుబడులు, ఉచిత విద్యుత్, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, రైతు బీమా, చివరకు పంటల కొనుగోలు కూడా చేస్తున్నారని ఎర్ర బెల్లి చెప్పారు. ఇప్పుడు లాభసాటి నియంత్రిత పంటలనే వేయాలని రైతులకు సీఎం సూచిస్తున్నారని వివరించారు. సిఎం చెప్పినట్లుగా చేస్తే రైతులు రాజవడం ఖాయమన్నారు. ప్రపంచ మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని చెప్పారు. షుగర్ ఫ్రీ తెలంగాణ సోనాకు తరగని డిమాండ్ ఉన్నదన్నారు. మక్కజొన్న తప్ప, పత్తి, మిర్చి, కంది వంటి పంటలు వేయాలని మంత్రి ఎర్రబెల్లి దయార్ రావు రైతులకు ఉద్బోధించారు. అలాగే పచ్చదనం-పారిశుద్ధ్యం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, తద్వారా కరోనాతోపాటు ఈ వానా కాలంలో వచ్చే సీజనల్, అంటు వ్యాధులను అరికట్టవచ్చని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
*తొర్రూరులో... ఆకస్మిక తనిఖీ... కాలువల పరిశీలన*
పాలకుర్తి మండలం ఎల్లరాయని తొర్రూరులో మంత్రి ఎర్బెల్లి దయాకర్ రావు కాలువ పనులను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయా? అని సర్పంచ్ నాయిని మల్లారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు కనీసం రూ.200 ఒక రోజుకి వచ్చే విధంగా పనులు చేయించాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
*పాలకుర్తిలో వైకుంఠ ధామం స్థల పరిశీలన*
పాలకుర్తిలో వైకుంఠ ధామం స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో... మరో స్థలాన్ని వైకుఠ ధామానికి పరిశీలించాలని ఆర్డీవో, ఎమ్మార్వోలను ఆదేశించారు. అక్కడ ఏదైనా అతిథి గృహం కడితే బాగుంటుందని చెప్పారు. అలాగే, గోదాముల కోసం 20 ఎకరాల స్థలాన్ని సేకరించాలని, ప్రభుత్వ స్థలాలు ఉంటే పరిశీలించాలని అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు
*మైలారంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ*
ఇదిలావుండగా, రాయపర్తి మండలం మైలారం గ్రామంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు. బొమ్మినేని రంగారెడ్డి, సుజాత, అమరేందర్, నరేందర్, సురేందర్ లు సమకూర్చిన సరుకులను మంత్రి పేదలకు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ధాతృత్వం మానవత్వానికి నిదర్శనమన్నారు. ఇతరులకు సాయం చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదన్నారు. పోయేనాడు ఎవరూ ఏదీ కట్టకట్టుకుని పోలేరని, ఉన్నప్పుడే, కాస్త పేరు, కీర్తి సంపాదించుకోవాలని చెప్పారు.
*స్వయం సహాయక బృందాలకు రూ.12 కోట్ల నిధుల విడుదల*
కరోనా నేపథ్యంలో బ్యాంకు లింకేజీతో పాలకుర్తి నియోజకవర్గానికి మంజూరైన రూ.12 కోట్ల స్వయం సహాయక గ్రూపుల నిధులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి మండలం మంచిప్పులలో విడుదలచేశారు. మహిళా సంఘాల పొదుపుతోపాటు ఇచ్చిన నిధులను సద్వినియోగం చేస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.