ప్యాక్ సభ్యులంతా ఒకే మాట, ఒకే సూత్రాన్ని అవలంభించాలి: పవన్ కల్యాణ్
- రాజకీయ వ్యవహారాల కమిటీని మరింత విస్తృత పరుస్తాం
- ప్యాక్ సభ్యులు లక్షలాది మందిని ప్రభావితం చేయాలి
- అసెంబ్లీలో జనసేన వాణిని వినిపించిన రాపాక వరప్రసాద్ కు అభినందనలు
- రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్
ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం, విలువలను కాపాడడం కోసం ఏర్పాటు చేసిన జనసేన పార్టీని మరే పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు మరోసారి ఉద్ఘాటించారు. విజయవాడ నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల కమిటీ(ప్యాక్) నూతన కమిటీ తొలి సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశ రాజకీయాలలో కులం, మతం ప్రభావం పెరగడం చూసి తట్టుకోలేక రాజకీయాల్లో విలువలు ఉన్న వారికి స్థానం లేకుండా పోవడం బాధ కలిగిస్తున్న నేపధ్యంలో, డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఈ దేశానికి నా వంతు సాయంగా ఒక మార్పు తీసుకురావడానికి జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సంగతిని ఆయన మరోసారి గుర్తు చేశారు.
2014లో కొద్ది మంది వ్యక్తుల బలంతో ఏర్పాటైన ఈ జనసేన పార్టీ గత ఎన్నికల్లో 6 శాతం ఓట్లనే సాధించినా తనకు అది చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఈ పార్టీని ధన ప్రభావం పడకుండా ముందుకు తీసుకువెళ్లానని, అదే పార్టీని మరొకరు ఇన్నేళ్ల పాటు నడపాలంటే వందలాది కోట్లు అవసరం అయ్యి ఉండేదని ఆయన అన్నారు. పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్లే వారు రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉండాలని భావించానని, మీలో అటువంటి శక్తి ఉందన్న నమ్మకంతోనే మిమ్మల్ని ప్యాక్‌లో సభ్యులుగా నియమించినట్టు ఆయన సభ్యులను ఉద్దేశించి అన్నారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీని విజయవంతంగా నడిపిన శ్రీ నాదెండ్ల మనోహర్ రాజకీయ వ్యవహారాల కమిటీని కూడా అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకంతో ఆయనను ఈ కమిటీకి చైర్మన్‌గా ఎంపిక చేసినట్టు తెలిపారు. కొన్ని జాతీయ పార్టీలు తమతో ప్రయాణం చేయమని కోరుతున్నాయని, అయితే ఎవరితో ప్రయాణం చేసినా లౌకిక పంధాని విడిచి పెట్టమని, దేశ సమగ్రత సిద్ధాంతాన్ని ఆచరిస్తామన్నారు.
రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో పాటు పార్టీలోని ప్రతి ఒక్కరు ఒకే ఆలోచన , ఒకే మాట, ఒకే సూత్రాన్ని అవలంభిస్తూ ఏకతాటి పై నడవాలని నిర్దేశించారు. విజయం లభించినప్పుడు పక్కన అంతా ఉంటారని, అపజయం వచ్చినప్పుడు ఉన్న వారే మనవాళ్లని అలా వెన్నుదన్నుగా నిలచిన వ్యక్తి శ్రీ నాదెండ్ల మనోహర్ అని వ్యాఖ్యానించారు. నేను పార్టీలోకి ఆహ్వానించకపోయినప్పటికీ నా సోదరుడు నాగబాబు పార్టీ కోసం పరోక్షంగా పని చేస్తూనే ఉండేవాడని, ఆయన తపన చూసిన తర్వాత పార్టీ తరఫున నరసాపురం లోక్‌సభ స్థానానికి పోటీ చేయమని కోరానని చెప్పారు. నాలో రాజకీయ ఆలోచనలు ప్రేరేపించింది నాగబాబే అని, ఆ విధంగా ఆయన నాకు రాజకీయ గురువని పేర్కొన్నారు. రాజోలు శాసనసభ్యుడు శ్రీ రాపాక వరప్రసాద్ గురించి మాట్లాడుతూ... జనసేన భావజాలాన్ని పుణికిపుచ్చుకుని అసెంబ్లీలో ఆయన చేస్తున్న ప్రసంగాలు నన్ను ఆకట్టుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్‌కళ్యాణ్ గారితో పాటు ప్యాక్ సభ్యులందరూ కరతాళ ధ్వనులతో రాపాకకు అభినందనలు తెలిపారు.
పవన్‌కళ్యాణ్ గారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బహూముఖ ప్రజ్ఞ ఉన్న వ్యక్తులు జనసేన పార్టీకి అవసరం అని, అటువంటి బహుముఖ ప్రజ్ఞ శ్రీ రాపాక వరప్రసాద్లో ఉన్నందునే ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారని, ఆశయానికీ, ప్రాక్టికాలిటీని జోడించి శ్రీ రాపాక విజయం సాధించారని , ఆ పనిని తాను కూడా చేసుకోలేకపోయానని శ్రీ పవన్‌కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. జనసేన ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా బలీయమైన రాజకీయ పార్టీలతో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పోరాటం చేయవలసి వచ్చింది. డబ్బు, మీడియా లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు అని తెలిపారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రస్తుతం 11 మందితో ఏర్పాటు చేసినా, దాన్ని భవిష్యత్తులో 18 మంది వరకు విస్తృత పరచాలని నిర్ణయించినట్టు తెలిపారు. లక్షలాది మందిని ప్రభావితం చేయగల వ్యక్తులుగా ప్యాక్ సభ్యులు ఆవిర్భవించాలని ఆయన ఆకాంక్షించారు.
* ప్యాక్ సభ్యుల పని తీరు ఇతరులకు ఆదర్శం కావాలి
అంతకు ముందు ప్యాక్ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ప్రారంభోపన్యాసం చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అవకాశం కల్పించినందుకు సభ్యలందరి తరఫున శ్రీ పవన్‌కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియచేశారు. లక్షలాది మంది కార్యకర్తలతో బలంగా ఉన్న జనసేన లాంటి ఒక పార్టీలో ముందుండి పనిచేయడానికి మనందరికీ అవకాశం రావడం ఒక గొప్ప అవకాశం అని అభిప్రాయపడ్డారు. ఈ పార్టీని ఈ స్థాయి వరకు తీసుకురావడానికి శ్రీ పవన్‌కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ముఖ్యంగా దగ్గరగా ఉన్న నాకు అందరికంటే ఎక్కువగా తెలుసు. ఆయనతో ప్రయాణం చేస్తే మరిన్ని విషయాలు మనకు అవగతం అవుతాయి.
పోరాటయాత్రలో ఆయన వ్యవహరించిన తీరు చాలా స్ఫూర్తిదాయకం అన్నారు. ధవళేశ్వరం కవాతు నుంచి జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సభలలో చెప్పమన్నా ఆయన చెప్పేందుకు నిరాకరించారు. ఆయన అంత ప్రాక్టికల్‌గా ఉంటారు. ఈ పార్టీలో చేరక ముందు నేను ఆయనతో రెండున్నరేళ్ల పాటు మాట్లాడాను. చివరకు మూడు రోజుల పాటు కూర్చుని అనేక విషయాలపై చర్చించాం. ఐదు అంశాలపై గట్టిగా పని చేయాలని ఇద్దరం ఒక అభిప్రాయానికి వచ్చాం. విలువలతో కూడిన రాజకీయాలు నడపడం, దేశభక్తి, జాతీయ భావం, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రతి కుటుంబానికి ఆర్ధిక నాయకత్వాన్ని కల్పించడం వంటి అంశాలపై ఇద్దరి అభిప్రాయాలు ఒకే మాదిరి ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్యాక్ సభ్యుల పని తీరు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, తద్వారా ఒక జనరేషన్‌కు ప్రేరణ కలిగించిన వారమవుతామని తెలిపారు.
ప్యాక్ సభ్యులతో పాటు పార్టీలోని ప్రతి ఒక్కరూ రాజకీయంగా మాట్లాడేటప్పుడు పార్టీ ఐడియాలజీ ప్రతిబింబించాలి. మీడియాతో మాట్లాడేప్పుడు గానీ, మీటింగుల్లో ప్రసంగించినప్పుడు గానీ పార్టీకి ఇబ్బంది కలిగించని విధంగా మెలగాలి. పార్టీ నేతలు ఒక నియోజకవర్గానికో, గ్రూపుకో, సోషల్ మీడియాకో పరిమితం కాకూడదు. ప్రతి ఒక్కరి ప్రయాణం పార్టీ అధ్యక్షునికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎన్నో త్యాగాలు చేసి, శ్రమకోర్చి పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న అధ్యక్షుని చర్యలను మనం ప్రశ్నించకూడదు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వంపై వివిధ ప్రాంతాల్లో అసంతృప్తి నెలకొంటోంది. దీనిపై మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపధ్యాన్ని తీసుకుని మనం ప్రజలకు సేవలు అందించాలి. అందర్నీ కలుపుకుని వెళ్లాలి. మనం ప్రజల కోసమే ఉన్నాం అన్న భావన వారికి కలిగించాలి. ఎన్నికలలో వచ్చిన ఫలితాలను కూడా మనం పాజిటివ్ దృక్పదంతో తీసుకుని విశ్లేషించుకోవాలి.
దీని కోసం సమయం కేటాయిద్దాం. నాకు పదవి వద్దని పార్టీ అధ్యక్షునికి చెప్పాను. పార్టీ అవసరాల దృష్ట్యా ప్యాక్ కమిటీ చైర్మన్‌గా ఉండమని ఆయన కోరడంతో పార్టీ అధ్యక్షుని మాట శిరసా వహించి ఈ బాధ్యతను స్వీకరించాను. శ్రీ పవన్‌కళ్యాణ్ గారి సాహచర్యంలో పని చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆయన ప్రతిది సుదీర్ఘంగా ఆలోచించే మాట్లాడుతారు. లోతుగా అధ్యయనం చేస్తారు. తొందరపడరు, ఈ లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆయన వల్లే ఈ రోజు మనందరికీ గుర్తింపు. మనలో ఎవరూ ఎక్కువ, తక్కువ అనే బేదభావం ఉండకూడదు. ఈ మూడేళ్లు జాగ్రత్తగా పని చేద్దాం. పార్టీని అధికారంలోకి తీసుకువద్దాం. మనం పని చేస్తున్నామే తప్ప త్యాగాలు చేస్తున్నామన్న భావన రాకూడదు అన్నారు.
* 2024లో శ్రీ పవన్‌కళ్యాణ్ గారిని సిఎంగా చూడాలన్న కసి కార్యకర్తల్లో ఉంది
సమావేశంలో జనసేన శాసనసభ్యులు శ్రీ రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ... గెలుపే లక్ష్యంగా పార్టీలో మార్పులు జరగాలన్నారు. కేవలం సిద్ధాంతాల ఆధారంగా గెలుపు రాదని, గెలిచిన తర్వాత సిద్ధాంతాలు అమలు చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్య ఉన్న వ్యక్తులు పార్టీకి అవసరం అన్నారు. మనమంతా జనంలోకి వెళ్లాలని అన్నారు. 2024లో పవన్‌కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్న కసి కార్యకర్తల్లో ఉందని చెప్పారు.
* మూడేళ్ల అధ్యయనం తర్వాత శ్రీ పవన్‌కళ్యాణ్‌ని నాయకుడిగా స్వీకరించా
శ్రీ నాగబాబు మాట్లాడుతూ... శ్రీ పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత అతనిలోని నాయకత్వ లక్షణాలు మూడేళ్ల పాటు కూలంకషంగా అధ్యయనం చేశానని, ఈ మూడేళ్ల పరిశీలన కారణంగా పవన్‌కళ్యాణ్ తనకంటే చిన్నవాడయినప్పటికీ ఆయనను నాయకుడిగా స్వీకరించానని చెప్పారు. ఒక నాయకుడిని అంగీకరించే ముందు లక్షసార్లు ఆలోచించాలని, అయితే అంగీకరించిన తర్వాత ఆయన చర్యలను ప్రశ్నించరాదన్నారు. తాను ఎన్నికలు అయిన తర్వాత పార్టీలోకి వస్తానని చెప్పినప్పటికీ, శ్రీ పవన్‌కళ్యాణ్ కోరడంతో నరసాపురం నుంచి పోటీ చేసినట్టు తెలిపారు. వచ్చే రెండు మూడు నెలల్లో శ్రీ పవన్‌కళ్యాణ్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో శ్రీ కందుల దుర్గేష్, శ్రీ మనుక్రాంత్‌రెడ్డి, శ్రీ ముత్తా శశిధర్, శ్రీమతి పాలవలస యశస్విని, శ్రీ కోన తాతారావు, శ్రీ బొమ్మిడి నాయకర్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ ఎ. భరత్‌భూషణ్ తదితరులు కూడా ప్రసగించారు.