పర్యావరణ హితానికే హరిత హారం: మంత్రి ఎర్రబెల్లి
- జీవ వైవిధ్యం, వాతావరణ సమతౌల్యానికి దోహదం
- మంకీ ఫుడ్ కోర్టుల ద్వారా గ్రామాల నుంచి కోతులు దూరం
- ఊరికో పార్కు, డంప్ యార్డు, స్మశాన వాటిక
- మొక్కలు నాటండి... పర్యావరణాన్ని కాపాడండి
- పంచాయతీరాజ్ నిధులు 10శాతం హరితహారానికే
- మొక్కల సంరక్షణకు పిఆర్ నిధులు వాడుకోవచ్చు
- ఉపాధి హామీ నిధులను కూడా హరిత హారానికి వాడొచ్చు
- జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరులో హరితహారంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
అనంతరం అక్కడకు వచ్చిన ఉపాధి హామీ కూలీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలనుద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. భూమి మీద పెరుగుతున్న జనాభా, ఉన్న సహజవనరుల వినియోగం వల్ల తావావరణ సమతౌల్యం దెబ్బతిన్నదన్నారు. అడవుల్లో ఉండాల్సిన జంతువులు అంతరించిపోయి జీవ వైవిధ్యం దెబ్బతినే దుస్థితి వచ్చిందన్నారు. వానలు సకాలంలో పడకపోవడంతో పాటు పర్యావరణానికి ముప్పు ఏర్పడుతున్నదన్నారు. వీటన్నింటి నుంచి మనల్ని కాపాడే అడవులు అంతరించిపోవడం మన స్వయంకృతాపరాధం అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ చేపట్టిన హరిత హారం అద్భుత కార్యక్రమని అంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో భాగస్వాములం కావాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు పిలుపునిచ్చారు.
*మంకీ ఫుడ్ కోర్టుల ద్వారా గ్రామాల నుంచి కోతులు దూరం*
మంకీ ఫుడ్ కోర్టులను గ్రామాల చెరువు శిఖాలు, గుట్టలు, బోడులలో ఏర్పాటు చేయాలని మంత్రి సర్పంచ్ లు, అధికారులకు చెప్పారు. తద్వారా గ్రామాల నుంచి కోతులను దూరం చేయొచ్చని మంత్రి అన్నారు.
*ఊరికో పార్కు, డంప్ యార్డు, స్మశాన వాటిక*
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ఇప్పటికే ప్రతి గ్రామానికి తడిపొడి చెత్తలను వేరు చేసేవిధంగా డంప్ యార్డులను, స్మశాన వాటికలను ఏర్పాట చేస్తున్నామని, ఇక నుంచి ఊరికో పార్కు కూడా ఉండాలని మంత్రి తెలిపారు.
విరివిగా మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి అంటూ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ నిధులు 10శాతం హరితహారానికే వాడుకోవచ్చని, మొక్కల సంరక్షణకు పిఆర్ నిధులు వాడుకోవచ్చని చెప్పారు. ఉపాధి హామీ నిధులను కూడా హరిత హారానికి వాడొచ్చన్నారు. పైసా ఖర్చు ఎవరిమీదా పడకుండా మొత్తం ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసి, హరిత హారం నిర్వహిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మనం చేయాల్సిందల్లా, మొక్కలు నాటాలని, అవి మనుగడ సాగించేలా సంరక్షించే బాధ్యత తీసుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు జనగామ కలెక్టర్ నిఖిల, డిఆర్డిఎ, అటవీ, ఉపాధి హామీ, ఎక్సైజ్, పోలీస్ వంటి పలు శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.