అభివృద్ధి పనులు వేగంగా పూర్తవ్వాలి: మంత్రి ఎర్రబెల్లి
- ఈ నెల 20-25 తేదీల మధ్య డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవాలు
- అభివృద్ధి పనులు ఆలస్యమైతే క్షమించేది లేదు
- నిర్లక్ష్యంగా ఉన్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టుల్లోకి పంపండి
- అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో క్షేత్ర పర్యటనలు చేయండి
- రూర్బన్ ప్రాజెక్టు పనుల ఖరారుపై వరంగల్ రూరల్ కలెక్టరేట్ లో సుదీర్ఘ చర్చ
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన తెలంగాణను కొట్లాడి ప్రత్యేక రాష్ట్రంగా తెచ్చుకున్నామని, సీఎం కెసిఆర్ ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణ అభివృద్ధికి అద్భుత అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఇప్పుడు కాకపోతే, మరెప్పుడూ కాదనే విధంగా అభివృద్ధికి అనేక అవకాశాలు, నిధులు వస్తున్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులపైనా ఉందన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, కొత్తగా ఉపాధి హామీ కింద వచ్చిన కల్లాలను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. రోడ్లు, కల్వర్టులు, కాలువల మరమ్మతులు వంటి అన్ని రకాల పనులను మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి జరుగుతున్న ఆలస్యంపై కాంట్రాక్టర్లపై మంత్రి మండిపడ్డారు. వాళ్ళు అడిగినంతా సమయం ఇచ్చాం. ఇసుక వంటి సమస్యల పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అయినా, నిర్మాణాలు పూర్తి కావడం లేదు. అలాంటి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టుల్లో వేయండి. అని కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు ఈ నెల 20-25తేదీల్లో ప్రారంభోత్సవాలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పారు. ఇంకా పూర్తి కావాల్సిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సమన్వయ బాధ్యతలను ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులకు అప్పగించారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర పర్యటనలు జరపాలని, స్థానిక ప్రజాభిప్రాయాలు, ప్రజావసరాలను దృష్టిలో పెట్టకుని పని చేయాలని సూచించారు.
మరోవైపు రూర్బన్ ప్రాజెక్టు కింద పర్వతగిరికి మంజూరైన రూ.30 కోట్ల నిధులను ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేయాలనే అంశంపై మంత్రి ఎర్రబెల్లి, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఖరారు చేశారు. పర్వతగిరి మండలంలో మాత్రమే ఖర్చు చేయాల్సిన ఈ నిధులతో 50కి పైగా పనులను చేపట్టాలని నిర్ణయించారు. పర్వతగిరిలో మల్టీ జిమ్, మినీ స్టేడియం, ట్యాంకు బండ్ ఆధునీకరణ-పర్యాటక ప్రాంతంగా మార్చడం, పర్వతగిరి, కల్లెడలో క్లస్టర్ కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అలాగే, ఏనుగల్, చౌటపల్లి స్కూల్స్ లో సైన్స్ ల్యాబ్ లు, పర్వతగిరి చౌరస్తాలో షాపింగ్ కాంప్లెక్స్ తోపాటు లైబ్రరీ ఏర్పాటు, పర్వతగిరి, కల్లెడ, అన్నారం, రోళ్ళకల్, కొంకపాక, చౌటపల్లి, తురుపు తండా, దౌలత్ నగర్ లలో ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అన్నారం షరీఫ్ దర్గా చెరువు ఆధునీకరణకు నిర్ణయించారు.
అలాగే, కొంకపాక, ఎనుగల్లు వద్ద పశు వైద్య ఉప కేంద్రాలు, పర్వతగిరిలో సంత, గోపనపల్లి, రావూరు, నారాయణపురం వద్ద పప్పు మిల్లులు, చిరు ధాన్యాలు, డీ హస్కింగ్ యంత్రాలు, మక్కజొన్నల షెల్లర్లు, ఎనుగల్లులో వ్యవసాయ గోదాముల నిర్మాణాలు చేపట్టాలని మంత్రి నిర్ణయించారు. అన్నారం దర్గా, పర్వతగిరిల్లో కబేళాల నిర్మాణం అవసరమని భావించారు. ఇంకా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, చింత నెక్కొండ బస్ షెల్టర్, పలు గ్రామాల్లో స్థానికంగా వ్యవసాయోత్పత్తులననునసరించి చిన్న తరహా, కుటీర పరిశ్రమలు కూడా నెలకొల్పాలని నిర్ణయించారు. అయితే, ఆయా పథకాల పూర్తి ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
ఈ అభివృద్ధి సమీక్ష, రూర్బన్ ప్రాజెక్టు పనుల ఖరారు సమావేశంలో పర్వతగిరి ఎంపీపీ కమల, జెడ్పీటీసీ సింగ్ లాల్, పిఎసిఎస్ చైర్మన్ మనోజ్, ఎంపీడీఓ సంతోశ్, ఎమ్మార్వో మహ్మద్ పాషా, రాయపర్తి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ సురేందర్, బిల్లా సుధీర్ రెడ్డి, నర్సింహానాయక్ తదితరులతోపాటు వరంగల్ రూరల్ జిల్లా డిఆర్ డిఎ పిడి సంపత్, పంచాయతీరాజ్ ఇఇ సంపత్, ఇరిగేషన్ శాఖ ఇఇ శ్రావణ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఉష, ఆర్డీఓ మహేందర్, వివిధ శాఖల అధికారులుపాల్గొన్నారు.