'నో స్మోకింగ్ జోన్' తెలియజేసే సైనేజిల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోండి: తెలంగాణ సీఎస్ ఆదేశం

Related image

తెలంగాణకు సంబంధించి పబ్లిక్ ప్రాంతాలలో నో స్మోకింగ్ జోన్ లుగా తెలియజేసే సైనేజిల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. గురువారం సచివాలయంలో COTPA 2003 (Cigarettes  and other Tobacco Products Act 2003) అమలుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన హైపవర్ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ యోగితా రాణా, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ , రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్, డి.ఎస్ చౌహాన్, డా. గోవింద్ కుమార్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, స్మోకింగ్ ఫ్రీ తెలంగాణ కోసం చర్యలు చేపట్టాలన్నారు. ఆడిటోరియం, విద్యా సంస్థలు రైల్వే స్టేషన్ లు, హోటళ్ళు , బస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్ లాంటి పబ్లిక్ ప్లేస్ లలో నో స్మోకింగ్ ను తెలియ జేసే సై నేజిల ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీలు, ఎన్ ఫోర్స్ మెంట్ టీంల ను ఏర్పాటు చేయాలన్నారు. బస్ స్టాండ్లు, టూరిస్ట్ ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాల విద్యా పాఠ్యాంశాలలో పొగాకు దుష్ప్రభావాలపై అంశాన్ని చేర్చాలన్నారు. వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న మంచి పద్దతులపై చర్చించారు. నిషేధించిన పొగాకు ఉత్పత్తులపై నిఘా పెంచాలన్నారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

More Press Releases